– వారిపై 184 ద్వేషపూరిత దాడులు
– పహల్గాం దాడి తర్వాత పెరిగిన ఇలాంటి ఘటనలు
– బీజేపీ పాలిత యూపీ నుంచి అత్యధికం
– మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లలోనూ ఇవే పరిస్థితులు
– బీజేపీ,దాని అనుబంధ హిందూత్వ శక్తుల రెచ్చగొట్టే చర్యలు
– దేశవ్యాప్తంగా భయాందోళనలో మైనారిటీ సమాజం
– ఏపీసీఆర్ నివేదిక వెల్లడి
దేశంలో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా.. కేంద్రంలోని మోడీ సర్కారు ఆ ఘటనను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నది. ప్రజలను భావోద్వేగ ప్రపంచంలోకి తీసుకెళ్తూ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నది. అంతేకాదు.. ఆ దాడులకు రాజకీయంగా కాంగ్రెస్‌కు, మతపరంగా ముస్లింలకు ముడిపెడుతున్నది మోడీ అనుకూల పరివారం. పుల్వామా దాడి నుంచి నిన్నటి పహల్గాం ఘటన వరకు ఇదే తంతు కనిపిస్తున్నది. దేశవ్యాప్తంగా బీజేపీ, దాని అనుబంధ శక్తులు, సంస్థలు, నాయకులు, కార్యకర్తలు జరిపే దాడులు, బెదిరింపులకు ముస్లింలు బలవుతున్నారు. తాజా నివేదిక ఒకటి ఈ విషయాన్ని వెల్లడించింది.
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం దేశంలో ముస్లింలు.. బీజేపీ పరివారానికి టార్గెట్‌గా మారారు. వారిని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయి. ఏప్రిల్ 11 నుంచి మే 8 వరకు భారత్‌లో మొత్తం 180కి పైగా ముస్లిం వ్యతిరేక ద్వేషపూరిత సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలలో 300 మందికి పైగా ప్రజలు భౌతికంగా, మానసికంగా ప్రభావితమయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రం యూపీ నుంచే ఎక్కువ ఘటనలు నమోదు కావటం ఆందోళనకరం. అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. పహల్గాం ఉగ్రదాడి చాలా వరకు ఈ విద్వేషపూరిత ఘటనలను ప్రేరేపించిందని వివరించింది.ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ముస్లింలే టార్గెట్‌గా 184 ద్వేషపూరిత ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో పహల్గాం ఉగ్రదాడి తర్వాత 106 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలలో 316 మంది శారీరకంగా, మానసికంగా గాయాలను అనుభవించారు. ఈ దాడులు యాదృచ్చికంగా జరగలేదు. ఈ ఘటనలు అత్యధికంగా యూపీ నుంచి 43 నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలే అయిన మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి.
యూపీలో స్కూల్ విద్యార్థిపై దాడి
యోగి పరిపాలిస్తున్న యూపీలో అయితే కఠిన పరిస్థితులే ఉన్నాయి. బీజేపీ పరివారం తీవ్రంగా రెచ్చిపోయింది. 15 ఏండ్ల ముస్లిం బాలుడు స్కూల్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో హిందూత్వ మూక ఆయనపై దాడి చేసింది. ఆ బాలుడి చేత పాకిస్తాన్ జెండాపై బలవంతంగా మూత్ర విసర్జన చేయించింది. అలీఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది.
మధ్యప్రదేశ్‌లో హెడ్ కానిస్టేబుల్‌పై..
మధ్యప్రదేశ్ కూడా ఇందుకు ఏ మాత్రమూ తీసిపోలేదు. ఏకంగా ముస్లిం మతానికి చెందిన ఒక పోలీసు పైనే దాడికి దిగిన ఘటన భోపాల్‌లో గతనెల 26న నమోదైంది. మద్యం మత్తులో ఉన్న హిందూత్వ కార్యకర్తలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాజర్ దౌలత్‌ను చాలా దారుణంగా దాడి చేసింది. హిందూత్వ కార్యకర్తలు రైల్వే స్టేషన్ ఆవరణలో ఒక కారులో తెల్లవారు జామున మద్యం సేవిస్తుండటాన్ని గమనించిన హెడ్ కానిస్టేబుల్.. వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే, హెడ్ కానిస్టేబుల్ పేరుచివరన ‘ఖాన్’ అనే ముస్లిం పేరును గమనించిన హిందూత్వ కార్యకర్తలు ఈ దారుణానికి దిగారు. విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ యూనిఫామ్‌ను సైతం చింపేశారు.
విద్యార్థులను బహిష్కరించాలని అల్టిమేటం
చండీగఢ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలోని హాస్టళ్లలో కూడా కాశ్మీరీ ముస్లిం విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు జరిగాయి. డెహ్రాడూన్‌లో అయితే హిందూత్వ కార్యకర్తలు.. కాశ్మీరీ విద్యార్థులను బహిష్కరించాలంటూ అల్టిమేటం జారీ చేయటం గమనార్హం. అంతేకాదు.. పలు కాలేజీలకు లిఖితపూర్వక బెదిరింపులను కూడా పంపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇక కాశ్మీర్ నుంచి వచ్చి వ్యాపారం చేసుకునే ముస్లింలను టార్గెట్ చేసుకుంటూ జరిగిన దాడులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముస్సోరీలో ఇద్దరు కాశ్మీరీ శాలువా విక్రేతలపై బజరంగ్‌దళ్ కార్యకర్తలు దాడికి దిగారు. కాశ్మీరీ శాలువా విక్రేతల బృందాన్ని రాత్రిపూట ఖాళీ చేయాలని కూడా ఆదేశించటంతో వారు రూ.12 లక్షల విలువైన వస్తువులను వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది.
ఆస్తులపై దాడులు
ముస్లింలకు సంబంధించిన సంస్థ అని తెలిస్తే చాలు.. హిందూత్వ శక్తులు అక్కడకు వచ్చి దాడులు, బెదిరింపులు వంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దిగాయి. ఈ విధంగా దేశవ్యాప్తంగా ముస్లింల వ్యాపారాలు, దుకాణాలు, మసీదులు, మదర్సాలు, ఇతర పవిత్ర ప్రదేశాలు టార్గెట్‌గా మారాయి. వారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటూ బీజేపీ అనుకూల పరివారం రెచ్చిపోయింది.
రెచ్చిపోయిన బీజేపీ ఎమ్మెల్యే
రాజస్తాన్‌లో అధికార బీజేపీ ఎమ్మెల్యే అయితే తన బాధ్యతను మరిచి ప్రవర్తించాడు. బాల్‌ముకుంద్ ఆచార్య ఒక ర్యాలీలో మసీదును ధ్వంసం చేశారు. ఉత్తరాఖండ్‌లో హిందూత్వ శక్తులు మసీదుపై రాళ్లతో దాడి చేశాయి. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ మరీ కాశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాడుల ఇండ్లను అధికార యంత్రాగాలు కూల్చి వేయటం ఆందోళనకరం. దేశవ్యాప్తంగా హిందూత్వ శక్తుల దాడులతో ముస్లిం సమాజం భయాందోళన లో జీవిస్తున్నది. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలు మాత్రం ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని మైనారిటీ సంఘాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.
టార్గెట్ ముస్లిం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES