నవతెలంగాణ – హైదరాబాద్: పుదుచ్చేరి క్రికెట్ అసోసియేషన్ లో తీవ్ర కలకలం రేగింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి జట్టులో చోటు దక్కలేదన్న ఆగ్రహంతో ముగ్గురు స్థానిక క్రికెటర్లు అండర్-19 హెడ్ కోచ్ ఎస్. వెంకటరామన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయపడ్డారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 8న ఉదయం 11 గంటల సమయంలో క్యాప్ కాంప్లెక్స్‌లోని ఇండోర్ నెట్స్‌లో ఈ దాడి జరిగింది. సీనియర్ క్రికెటర్ కార్తికేయన్ జయసుందరం, ఫస్ట్-క్లాస్ ఆటగాళ్లు ఎ. అరవిందరాజ్, ఎస్. సంతోశ్ కుమారన్ తనపై దాడి చేశారని వెంకటరామన్ సెదరపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
తమను జట్టులోకి ఎంపిక చేయకపోవడానికి కారణం నువ్వేనంటూ దూషిస్తూ దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ దాడి వెనుక భారతిదాసన్ పాండిచ్చేరి క్రికెటర్స్ ఫోరం కార్యదర్శి జి. చంద్రన్ ప్రోద్బలం ఉందని ఆయన ఆరోపించారు. ఈ ఘటనలో వెంకటరామన్ తలకు 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, వారు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.



