Friday, December 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేట్‌ కంపెనీలకు విత్తన బిల్లుతో పెద్దపీట

కార్పొరేట్‌ కంపెనీలకు విత్తన బిల్లుతో పెద్దపీట

- Advertisement -

రైతు వ్యతిరేక ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం
రైతే కేంద్రంగా నూతన బిల్లు ఉండాలి
ఈ బిల్లును వెంటనే ఆపాలి : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్న విత్తన బిల్లును వెంటనే ఆపాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విత్తన బిల్లు ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న విత్తన బిల్లు ముసాయిదాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న ఈ విత్తన బిల్లు వల్ల రైతన్నలకు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ట్రయల్స్‌ లేకుండానే విదేశీ విత్తనాలు దేశంలోకి వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతే కేంద్రంగా, రైతు ప్రయోజనాలే పునాదిగా నూతన విత్తన బిల్లు ఉండాలని సూచించారు. విత్తనాల అంశంలో రాష్ట్రాల పాత్ర లేకుండా చేస్తున్న ఈ బిల్లును అందరూ వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రైతు సంఘాలతోపాటు విత్తన నిపుణులు, వ్యవసాయ రంగ నిపుణులు, రాజకీయ పార్టీలతో కూలంకషమైన చర్చ తర్వాతే ఈ బిల్లుపై ముందుకు పోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ బిల్లులో నకిలీ విత్తనాలను కట్టడి చేసే అంశంపై స్పష్టత లేదనీ, వాటి వల్ల నష్టపోయిన రైతన్నలకు నిర్దిష్ట సమయంలోనే నష్టపరిహారం అందించే అంశంపై గ్యారంటీ లేదని తెలిపారు. కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా విత్తనాల ధరలను నిర్ణయించే విధంగా ఈ బిల్లులో నిబంధనలున్నాయనీ, గతంలా విత్తనాల ధరల నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకుండా పోతుందని వివరించారు. నకిలీ విత్తనాల తయారీలో కంపెనీలను బాధ్యులను చేయకుండా, కేవలం అమ్మకందారులను బాధ్యత వహించేలా చేయడం సరైంది కాదని తెలిపారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన అంశంలో జాతీయ స్థాయిలో ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌ చేయడం, భారీ జరిమానాలు విధించడం, కఠిన జైలు శిక్ష వంటి అంశాలకు ఇందులో పెద్దగా ఆస్కారం లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కంపెనీల ప్రయోజనాల కోసం కాకుండా రైతన్నల ప్రయోజనాలకు, వ్యవసాయ సంక్షేమ అభివృద్ధికి ఉపయోగపడేలా అత్యంత పారదర్శకంగా, కఠినమైన నిబంధనలతో కూడిన విత్తన బిల్లును తేవాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే ఈ అంశంపై మాజీ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితోపాటు మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ తరఫున రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్రానికి మరిన్ని సూచనలు ఇస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -