– వేతనాలు పెంచాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ
– నాలుగోరోజుకు ‘నాచారం షాహీ గార్మెంట్’ ధర్నా
నవతెలంగాణ – చర్లపల్లి
చలి, భయం, ఒత్తిడిని లెక్కచేయకుండా హక్కుల కోసం ధైర్యంగా పోరాడుతున్న షాహీ మహిళా కార్మికుల సంకల్పం అభినందనీయమని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.రమ అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారం పరిశ్రమ ప్రాంతంలోని షాహీ యూనిట్‌లో వేతనాల పెంపు కోసం మహిళలు చేపట్టిన నిరసన గురువారం నాలుగో రోజుకు చేరిన సందర్భంగా ఆమె కార్మికులను కలిసి మద్దతు తెలిపి మాట్లాడారు. తక్కువ వేతనాలతో కుటుంబాలు నెట్టుకొస్తున్న పరిస్థితుల్లో కార్మికులు డిమాండ్ చేస్తున్న కనీస వేతనం రూ.16,000 ఇవ్వడం యాజమాన్యం బాధ్యత అని అన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకుండా షాహీ యాజమాన్యం మొండి వైఖరి ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. మహిళలు ఐక్యంగా నిలుస్తున్న వేళ యాజమాన్యం చర్చలకు ముందుకు వచ్చి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని మహిళా కార్మికులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐఎఫ్‌టీయూ నాయకులు అరుణ, ప్రదీప్ మాట్లాడుతూ.. నియమాల ప్రకారం రూ.18 వేల వేతనం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటికీ 9 వేలు మాత్రమే చెల్లించడం షాహీ యాజమాన్యం అవలంబిస్తున్న స్పష్టమైన దోపిడీకి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల పోరాటానికి సంఘీభావంగా చర్లపల్లిలోని ఏపీ రాక్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో 800 మంది కార్మికులకు భోజనం ఏర్పాటు చేశారు. కార్మికుల పోరాటం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తమ మద్దతు, సహకారం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షకార్యదర్శులు జె.చంద్రశేఖర్, ఎర్ర అశోక్, నాయకులు పి.సత్యం, పి.గణేష్, ఐ.రాజశేఖర్, జె.వెంకన్న, లింగస్వామి, ఆర్. సంతోష్, మణికంఠ, బి.వి. సత్యనారాయణ, రమేష్, ఏఐటీయూసీ నాయకులు సత్యప్రసాద్, ధర్మేంద్ర, రమేష్, తదితర కార్మిక సంఘ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
షాహీ మహిళా కార్మికుల పోరాటం అభినందనీయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



