నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు మరో వివాదంలో చిక్కుకున్నారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న ది పెండెంట్ ఫామ్ హౌస్‌పై రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు పార్థసారథి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. బర్త్‌డే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మాధురి కూడా పాల్గొన్నారు. శుక్రవారం మాధురి పుట్టిన రోజు కూడా కావడంతో పార్థసారథి పేరుపై ఫామ్‌హౌస్‌ను బుక్ చేసినట్లు తెలుస్తున్నది. ఈ కార్యక్రమానికి 29 మంది వచ్చినట్లు సమాచారం. అయితే అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంలో స్థానిక పోలీసులతో కలిసి రాజేంద్ర నగర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 స్కాచ్ బాటిళ్లు, ఐదు హుక్కా బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదుచేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు.



