చర్యలు తీసుకోవాలని కార్మికుల ధర్నా
సీఐటీయూ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం
నవతెలంగాణ-మద్దూరు
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న బోజు బాలేష్‌పై పోలీస్ హౌంగార్డు బూరుగు భానుచందర్ శుక్రవారం దాడికి పాల్పడ్డాడు. బాధితుడు బాలేష్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలేష్ ప్రతిరోజూ గ్రామపంచాయతీ భవనం ముందు వాటర్ పైపుతో చెట్లకు నీళ్లు పడుతుంటాడు. అయితే గ్రామ పంచాయతీకి ఎదురుగా హౌంగార్డు భానుచందర్ ఇల్లు ఉంటుంది. కాగా, హౌంగార్డు తన కారును గ్రామపంచాయతీ భవనానికి ఎదుట పెట్టి పంచాయతీకి చెందిన నీళ్లతో కారును కడుగుతుండేవాడు. అయితే విధుల్లో భాగంగా పంచాయతీకి ఎదురుగా శుక్రవారం బాలేష్ నీళ్లు పడుతున్నాడు. ఈ క్రమంలో ఆ వాటర్ పైప్ ఇవ్వాలని హోంగార్డు భానుచందర్ అడగ్గా.. పంచాయతీ భవనం ముందు భాగంలో నీళ్లు కొట్టి ఇస్తానని బాలేస్ చెప్పాడు. దాంతో ఒక్కసారిగా కోపొద్రికుడైన సదరు హోంగార్డు తనపై దాడికి దిగాడని బాధితుడు బోరున విలపిస్తూ తెలిపాడు. దాంతో గ్రామపంచాయతీ సిబ్బంది విధులను బహిష్కరించి రోడ్డుపై బైటాయించి ధర్నా నిర్వహించారు. ధర్నా స్థలానికి చేరుకున్న పంచాయతీ కార్యదర్శి గద్ద వెంకటేశ్వర్లు.. దాడి చేసిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హామీ ఇవ్వడంతో సిబ్బంది ధర్నా విరమించారు.
హోంగార్డుపై చర్యలు తీసుకోవాలి..
గ్రామపంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిపై పోలీస్ హౌంగార్డు దాడిచేయడం పట్ల పంచాయతీ కార్మికుల యూనియన్ (సీఐటీయూ) మద్దూర్ మండల గౌరవ అధ్యక్షులు ఆలేటి యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యం గ్రామ ప్రజల సేవలో ఉండే గ్రామ పంచాయతీ సిబ్బందిపై దాడి చేసిన హౌంగార్డుపై చర్యలు తీసుకోవాలని, కార్మికులకు భద్రత కల్పించాలని పంచాయతీ కార్యదర్శి గద్ద వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి ఎండి షఫీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్మికునిపై హోంగార్డు దాడి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



