Sunday, January 11, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనేపాల్‌లో రూ.100 పైబడిన నోట్లకు అనుమతి..!

నేపాల్‌లో రూ.100 పైబడిన నోట్లకు అనుమతి..!

- Advertisement -

దశాబ్దం తర్వాత పెద్ద నోట్లపై నిషేధం ఎత్తివేత యోచన
పర్యాటకంపై ఆ దేశం కీలక దృష్టి

న్యూఢిల్లీ : పొరుగుదేశం నేపాల్‌లో రూ.100 కంటే ఎక్కువ విలువైన భారతీయ కరెన్సీ నోట్లను అనుమతించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. దాదాపు పదేండ్ల క్రితం పెద్ద నోట్లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసి తిరిగి వాటి చెలామణికి అనుమతించాలని భావిస్తోన్నట్టు ‘ది ఖాట్మండు పోస్ట్‌’ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ”భారత కరెన్సీ రూ.100 పైబడిన నోట్ల అనుమతికి మేము తుది దశ నిర్ణయంలో ఉన్నాము. దీనికి సంబంధించిన నేపాల్‌ గెజిట్‌లో నోటీసును ప్రచురించడానికి సిద్ధం చేస్తున్నాము. ఆ తర్వాత కొత్త నిబంధనల గురించి బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సర్క్యులర్లు జారీ చేస్తాము” అని నేపాల్‌ రాష్ట్ర బ్యాంక్‌ (ఎన్‌ఆర్‌బీ) ప్రతినిధి గురు ప్రసాద్‌ పౌడెల్‌ పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య ప్రయాణించే విద్యార్థులు, యాత్రికులు, వైద్య చికిత్స కోసం వచ్చేవారు, పర్యాటకులతో పాటు, భారత్‌కు వెళ్లే నేపాల్‌ వలస కార్మికులు ఎదుర్కొంటున్న నగదు సంబంధిత ఇబ్బందులను తగ్గించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు.

కొత్త నిబంధన అమలులోకి వచ్చే అధికారిక తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, ప్రక్రియ మాత్రం తుది దశలో ఉందని పౌడెల్‌ తెలిపారు. నవంబర్‌ 28న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తన ‘ఫారిన్‌ ఎక్పేంజీ మేనేజ్‌మెంట్‌ (కరెన్సీ ఎగుమతి, దిగుమతి) నిబంధనలను’ సవరించిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకోవడం విశేషం. 2025 డిసెంబర్‌ 2న భారత అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన ఈ సవరణ ప్రకారం.. వ్యక్తులు రూ.100 వరకు ఉన్న భారతీయ నోట్లను ఎప్పుడైనా నేపాల్‌కు తీసుకెళ్లవచ్చు. అలాగే రూ.100కంటే ఎక్కువ విలువైన నోట్లను రెండు వైపులా (భారత్‌ నుంచి నేపాల్‌కు లేదా నేపాల్‌ నుంచి భారత్‌కు) మొత్తం రూ.25,000 పరిమితి వరకు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.

పర్యాటక రంగానికి సానుకూలం
నేపాల్‌ చాలా కాలంగా ఈ సడలింపు కోసం కోరుతోంది. పెద్ద నోట్లపై ఉన్న పరిమితుల వల్ల పర్యాటకం, ముఖ్యంగా భారతీయ సందర్శకులపై ఆధారపడే క్యాసినోలు, హోటల్‌ వ్యాపారాలు ప్రభావితమయ్యాయి. చాలా మంది ప్రయాణికులు తెలియక నిబంధనలను ఉల్లంఘించి, అరెస్టులు, జరిమానాలను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం భారతీయులతో సహా నేపాల్‌ను సందర్శించే పర్యాటకులు 5,000 డాలర్లు (దాదాపు రూ.4.5 లక్షలు) లేదా ఇతర కన్వర్టబుల్‌ కరెన్సీలలో దానికి సమానమైన మొత్తాన్ని ఎటువంటి డిక్లరేషన్‌ లేకుండా తీసుకెళ్లవచ్చు. అంతకు మించిన మొత్తాన్ని కస్టమ్స్‌ వద్ద వెల్లడించాల్సి ఉంటుంది. నేపాల్‌కు వచ్చే పర్యాటకులలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -