ఆధార్ అనుసంధానం, రెండు పూటల హాజరు, కేవైసీని రద్దు చేయాలి
పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ తీసుకురావాలి : ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మహాత్మా గాంధీపై గౌరవం ఉంటే ఉపాధి హామీ పథకానికి రూ.2.50 లక్షల కోట్లు నిధులు ఇవ్వాలని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ డిమాండ్ చేశారు. ఆధార్ అనుసంధానం, రెండు పూటల హాజరు, కేవైసీని రద్దు చేయాలని, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ తీసుకురావాలని డిమాండ్‌ను వినిపించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పూజ్య బాపు గ్రామీణ రోజ్ గార్ యోజనగా పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోవడం చాలా దారుణమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి ఉన్నప్పుడే అసలైన అభివృద్ధి అనే మహాత్మా గాంధీ కలను సాకారం చేయాలనే సంకల్పంతోనే ప్రజల ఆకాంక్ష మేరకు ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టారని గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే మొదటి దశలో ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌లో నాలుగు శాతం నిధులు కేటాయించారనీ, దానితో కొంత మేర గ్రామీణ పేదలకు మేలు జరిగిందని వివరించారు. మోడీ అధికార పగ్గాలు చేపట్టాక ఉపాధి హామీపై కక్ష కట్టారని విమర్శించారు. చట్టాన్ని బలహీన పర్చేందుకు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి, రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో క్రమంగా నిధులను తగ్గిస్తూ ఈ ఆర్థిక సంవత్సరంలో 1.37 శాతానికి కుదించారని విమర్శించారు. మెటీరియల్‌కు 10 శాతానికి మించి ఖర్చు చేయకూడదని చట్టంలో ఉన్నప్పటికీ, దానిని అతిక్రమించి 40 శాతానికి పెంచి కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉపాధి హామీని మార్చారని అన్నారు. చట్టానికి ఆధార్ ప్రామాణికమే కాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ, ఆధార్‌కు అనుసంధానం చేసి కోటికిపైగా జాబ్ కార్డులు, ఏడు కోట్ల మంది లబ్దిదారులకు ఉపాధి హామీని రద్దు చేశారని తెలిపారు. ఇప్పుడు కేవైసీని పెట్టి మరో 27 లక్షల మందిని తొలగించారని చెప్పారు. కొలతల వారీగా వేతనం ఇస్తూ రెండు పూటలు ఖచ్చితంగా పని చేయాలని ఆదేశాలిచ్చారని విమర్శించారు.
పని ప్రదేశాల్లో రెండు పూటలా ఉదయం 9, మధ్యాహ్నం 2 గంటలకు ఫొటోలు తీసి కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలనీ, ఒక పూటే చేస్తే సగం వేతనం, ఫొటోలు అప్‌లోడ్ చేయకపోతే అసలు వేతనమే ఉండదని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా అయితే కొలతలకు, రెండు పూటల ఫొటోలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 24 కోట్ల మందికి నెట్ సౌకర్యం లేదని ఆర్బీఐ చెప్పిందనీ, ఉన్న వారికి మారుమూల ప్రాంతాల్లో నెట్ సౌకర్యం సరిగ్గా లేదనే విషయం అందరికీ తెలుసునని అన్నారు. ఉపాధికి కేవైసీకి ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఈ చర్యలతో ప్రజలకు ఉపాధిపై ఆసక్తి తగ్గించి, క్రమంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర తప్ప మరొకటి కాదని అన్నారు.
ఉపాధి హామీ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల కన్నా రాష్ట్ర ప్రభుత్వాల వేతనాలు ఎక్కువగా ఉంటే వాటినే అమలు చేయాల్సి ఉందని చెప్పారు. కేరళలో 600 నుంచి 800 వేతనాల రేటు ఉందని, అనేక రాష్ట్రాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల కంటే ఎక్కువ ఉన్నాయనీ, కానీ ఆ వేతనాలను కేంద్రం అమలు చేయటం లేదని విమర్శించారు. నెలల తరబడి వేతనాలు విడుదల చేయటం లేదని, పని ప్రదేశాల్లో సౌకర్యాలు, పనిముట్లు ఇవ్వాలని చట్టంలో ఉన్నా.. మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయటం లేదని విమర్శించారు. కాబట్టి పేరు మార్చి జాతిపిత మహాత్మాగాంధీ పేరు మీద లబ్ది పొందాలనే తపన తప్ప, మోడీ ప్రభుత్వానికి ఉపాధి హామీ చట్టంపై ఎటువంటి ఆసక్తి లేదని ఆయన ఆరోపించారు.



