బీఆర్ ఎస్ సర్పంచులకు సన్మానం
నవతెలంగాణ – మిర్యాలగూడ
గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపు చివరి అంచు వరకు పోరాడిన గులాబీ సైనికులు అధైర్య పడవద్దు అని, భవిష్యత్తు మనదేనని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. మిర్యాలగూడ నియోజవర్గంలో గెలుపొందిన బి ఆర్ఎస్ సర్పంచ్లను సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల గుండెల్లో గులాబీ జెండాకీ ప్రత్యేక స్థానం, అభిమానం ఉందనడానికి గెలిచిన మన పార్టీ సర్పంచులు, వార్డుసభ్యులే నిదర్శనం అని చెప్పొచ్చునన్నారు.119 గ్రామపంచాయతీలకు గాను 36 గ్రామపంచాయతీలను సొంతం చేసుకున్నాం, ఒక 4 గ్రామపంచాయతిలు ‘’టాస్’’ లో కోల్పోయాం అని చెప్పారు.
ఇంకా 28 గ్రామపంచాయతీలలో మన పార్టీ బలపరిచిన అభ్యర్థులు 20 లోపు ఓట్ల తేడాతో ఓడిపోయారు, అలాగే 70 ఓట్ల లోపు అభ్యర్ధులు 18 గ్రామ పంచాయతీలు కోల్పోయాం. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోను కావద్దు అన్నారు. ఎన్నికలంటే గెలుపోటములు సహజం.కానీ ఫలితాల నుంచి విశ్లేషణలతో పాఠం నేర్చుకొని.. మళ్లీ కొత్త పోరాటానికి సిద్ధం కావడం యోధుల లక్షణం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ బి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, కుందూరు వీర కోటిరెడ్డి, జిల్లా నాయకులు పాల్గొన్నారు.



