170 విమానాలు రద్దు
నత్తనడకన నడుస్తున్న రైళ్లు
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరింది. గాలిలో నాణ్యత పూర్తిగా పడిపోయింది. కంటి ముందు ఏమీ కనిపించని విధంగా పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన 170 విమానాలను సోమవారం రద్దు చేశారు. వందలాది విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. మరోవైపు రైళ్లు కూడా నత్తనడక నడుస్తున్నాయి. ఉదయం వేళలో రోడ్లపై వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగాయి. రాజధానిని ఉదయం మంచుపొర పూర్తిగా కప్పేసింది. నగరంలో సగటు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 498గా నమోదైంది. దీనిని బట్టి వాయు నాణ్యత ‘తీవ్రమైన’ కేటగిరీలో ఉన్నదని అర్థమవుతోంది.
న్యూఢిల్లీలో 40 వాయు నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 30 కేంద్రాలు వాయు నాణ్యత దారుణంగా ఉన్నదని తేల్చాయి. రెండు కేంద్రాలు చాలా పేలవమైన స్థాయిని సూచించాయి. జహంగీర్‌పురి ప్రాంతం అత్యంత కాలుష్య ప్రదేశంగా నిర్ధారణ అయింది. అక్కడ ఏక్యూఐ 498గా నమోదైంది. ఇతర కేంద్రాలతో పోలిస్తే ఇదే అత్యధిక సూచీ. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) ప్రకారం ఏక్యూఐ 401-500 మధ్య ఉంటే పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టు పరిగణించాలి. వాయు కాలుష్యం ఈ స్థాయిలో ఉంటే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఆదివారం కూడా ఢిల్లీలో ఏక్యూఐ 461గా నమోదైంది. వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో కాలుష్య స్థాయిలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.



