Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంవిద్యా ప్రమాణాల పెంపునకు కేంద్రం సహకరించాలి

విద్యా ప్రమాణాల పెంపునకు కేంద్రం సహకరించాలి

- Advertisement -

స్టార్స్‌ ప్రాజెక్టు కింద రూ.4,400 కోట్ల ఆర్థిక సాయం
రూ.1,270 కోట్ల అదనపు నిధులు,
11 జెఎన్‌విలు మంజూరు చేయండి : కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్‌ భేటీ

న్యూఢిల్లీ : రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌ కోరారు. నైపుణ్య గణనకు సహకారం అందించాలని, విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడిక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, ఐటి మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి జయంత్‌ చౌదరితో మంత్రి నారా లోకేష్‌ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రికి వివరించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 11 జవహర్‌ నవోదయ విద్యాలయాలు (జెఎన్‌వి) మంజూరుతోపాటు, రాష్ట్రానికి ఇటీవల కాలంలో కేంద్రం కేటాయించిన 12 కేంద్రీయ విద్యాలయాల (కెవి) ఏర్పాటు, కార్యాచరణకు చర్యలు తీసుకోవాలి. సమగ్ర శిక్ష సంస్కరణల్లో భాగంగా స్టార్స్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి రూ.4,400 కోట్ల ఆర్థిక సాయం అందించి మద్దతుగా నిలవాలి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించిన రూ.1,270 కోట్ల అదనపు నిధుల మంజూరుకు ఆమోదం తెలిపాలి. పిఎం పోషణ్‌ పథకం కింద పైలట్‌ ప్రాతిపదికన రాష్ట్రంలో 155 స్మార్ట్‌ కిచెన్ల ఏర్పాటుకు అనుమతివ్వాలి’ అని కోరారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గుంటూరు జిల్లా చినకాకాణిలో అభివృద్ధి చేసిన మోడల్‌ ఆటిజం సపోర్ట్‌ సెంటర్‌ను ప్రారంభించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి లోకేష్‌ ఆహ్వానించారు.

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సహకారం అందించాలి
రాష్ట్రంలో నిర్వహించనున్న నైపుణ్య గణనకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ కోరారు. రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాప కులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటుచేసిన రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు మైటివై స్టార్టప్‌ హబ్‌ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌లో ఎవిజిసి – ఎక్స్‌ఆర్‌, డబ్ల్యుఎవిఎక్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద ఇన్నోఎక్స్‌ఆర్‌ యానిమేషన్‌, ఎఆర్‌/ విఆర్‌, ఇమ్మేర్సివ్‌ టెక్నాలజీస్‌ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు. ఇండియా ఎఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) మిషన్‌ కింద రాష్ట్రంలో ఎఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలి
విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని కేంద్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి జయంత్‌ చౌదరిని మంత్రి నారా లోకేష్‌ కోరారు. విశాఖ జిల్లా పెదగంట్యాడలోని జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ (ఎన్‌ఎస్‌టిఐ) ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ముందస్తుగా ఐదెకరాల స్థలాన్ని గుర్తించిన విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంస్థ ఏర్పాటుతో అధ్యాపక అభివృద్ధి, పరిశ్రమ అనుసంధానిత నైపుణ్య శిక్షణ, గ్రీన్‌ స్కిల్స్‌, డిజిటల్‌ రూపాంతరం కోసం ప్రాంతీయ కేంద్రంగా సేవలందించడమే కాకుండా జాతీయ నైపుణ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని వివరించారు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పరిమితిని మించి ఎస్‌బిటిఇటి – ఎపితో ఎన్‌సివిఇటి అర్హతలను పెద్దయెత్తున స్వీకరించేందుకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కోరారు. కేంద్ర మంత్రులతో భేటీలో మంత్రి లోకేష్‌ వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, టిడిపి ఎంపిలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -