Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంకార్మికులకు వ్యతిరేకం

కార్మికులకు వ్యతిరేకం

- Advertisement -

రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం
‘ఉపాధి’ హక్కుల తొలగింపు : కేంద్రంపై సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శ


నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఉపాధి హామీ చట్టం కల్పించిన హక్కులను తొలగించడంతో మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని కార్మికులు, రాష్ట్రాలకు వ్యతిరేకంగా మారుస్తోందని సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ విమర్శించారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ వేతనాలతో సహా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చే ఈ పథకం ఆర్థిక భారంలో 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రాలు రూ.50,000 కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. దీంతో ఒక్కో రాష్ట్రానికి దాదాపు రూ.2,000-రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతోందని విమర్శించారు. కేంద్రం మోసంతో రాష్ట్రాలపై పథకం బాధ్యతను విధించడాన్ని అభివృద్ధి అని చెప్పలేమని అన్నారు. ఒక కార్మికుడు ఉద్యోగం అడిగితే, కేంద్ర ప్రభుత్వం దానిని అందించడానికి బాధ్యత వహిస్తుందని, ఇది ఉపాధి హామీ పథకం ప్రధాన ఆలోచన అని తెలిపారు.

అయితే మోడీ ప్రభుత్వం కొత్త బిల్లుతో ఈ పథకం ఈ లక్ష్యాన్ని తారుమారు చేసిందని విమర్శించారు. ముందుగా నిర్ణయించిన షరతుల ఆధారంగా కేంద్రం పంపిణీ చేసే నిధుల చట్రంలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని చెబుతున్నారని వివరించారు. నిధులు అయిపోయిన తరువాత ఈ పథకం కూడా రద్దు చేయబడుతుందనీ, ఉపాధి హామీ పథకం గతంలో గ్రామసభలు, పంచాయతీలపై ఆధారపడి ఉండేదని అన్నారు. అయితే, మోడీ ప్రభుత్వం ఈ వ్యవస్థను సరిదిద్దాలని, బయోమెట్రిక్స్‌, జియో-ట్యాగింగ్‌, ఏఐ ఆడిట్‌ మొదలైన వాటిపై ఆధారపడాలని ప్రతిపాదించిందని తెలిపారు. ఉపాధి హామీ చట్టంలోని సెక్షన్‌ 10 కింద ఏర్పాటు చేయబోయే కేంద్ర ఉపాధి హామీ మండలిలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళల ప్రాతినిధ్యం ఉండేలా నిబంధనలు ఉన్నాయనీ, అయితే, కొత్త బిల్లులో రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని ఆయన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -