ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీస్తుంది
వీబీ-జీఆర్‌ఏఎంజీ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలోని గ్రామీణ పేదలకు జీవనాధారంగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్ ఈజీఏ)ను రద్దు చేసి, దాని స్థానంలో వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్‌గా ర్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (వీబీ- జీఆర్‌ఏఎంజీ బిల్లు) తీసుకురావాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు ఉపాధి హక్కును కాలరాస్తుందని పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం నాడొక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఒక సార్వత్రికంగా వర్తించే, డిమాండ్ ఆధారిత ఉపాధి హక్కు చట్టం. కొత్త బిల్లు మాత్రం ఉపాధికి చట్టబద్ధమైన హక్కును బలహీ నపరుస్తూ, అవ సరానికి అనుగు ణంగా నిధులు కేటాయించాల్సిన కేంద్ర ప్రభుత్వ బాధ్యతను నిర్మూలి స్తుంది.
ఎంజీ ఎన్‌ఆర్‌ఈజీఏ మౌలిక స్వరూపాన్ని నాశనం చేస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉపాధి హామీని వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచుతున్నామని ప్రభుత్వం చెప్తున్నా.. ఇది పేరుకే పరిమితం. ‘జాబ్ కార్డుల రేషనలైజేషన్’ పేరిట పెద్ద సంఖ్యలో గ్రామీణ కుటుంబాలను పథకం నుంచి తప్పించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. పంటలు కోతకు వచ్చే కీలక వ్యవసాయ కాలంలో 60 రోజుల వరకు ఉపాధిని నిలిపివేసే అధికారం ప్రభుత్వాలకు ఇవ్వడం వల్ల, గ్రామీణ కుటుంబాలు అత్యవసర సమయంలోనే పని కోల్పోతాయి. దీనితో కూలీలు మళ్లీ భూస్వాములపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. పని ప్రదేశంలో డిజిటల్ అటెండెన్స్‌తో హక్కులు కోల్పోయే ప్రమాదమున్నది. సాంకేతిక సమస్యల కారణంగా కూలీలు పని కోల్పోయే, వేతనాలు అందని పరిస్థితులు ఏర్పడతాయి.
నిధుల విధానంలో ప్రతిపాదిత మార్పులు అత్యంత ప్రమాదకరం. ఈ బిల్లు వేతనాలపై కేంద్ర ప్రభుత్వ బాధ్యతను వంద శాతం నుంచి 60:40 నిష్పత్తికి తగ్గిస్తుంది. నిరుద్యోగ భృతి, ఆలస్య వేతన పరిహారం పూర్తిగా రాష్ట్రాలపైకి నెట్టివేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై భరించలేనంత ఆర్థిక భారం పడుతుంది. అలాగే నిర్ణయాల్లో మాత్రం రాష్ట్రాలకు ఎలాంటి పాత్రా ఇవ్వడం లేదు. కేంద్రం విధించే ‘నార్మేటివ్ కేటాయింపులు’ ద్వారా రాష్ట్రాల వ్యయాలకు పరిమితి విధించడం వల్ల పథకం పరిధి మరింత కుదించబడుతుంది. కేంద్రం బాధ్యత, జవాబుదారీతనం నీరుగారుతుంది. పథకం పేరును మార్చటం బీజేపీ-ఆరెస్సెస్ భావజాలానికి అనుగుణమైన రాజకీయ సంకేతమే. ఈ బిల్లును తక్షణమే ఉపసంహరించాలి. అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, గ్రామీణ పేద సంఘాలతో సంప్రదింపులు జరిపి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను మరింత బలోపేతం చేయాలి. నిజమైన హక్కుల ఆధారిత ఉపాధి హామీ పథకంగా సమర్థవంతంగా అమలు చేయాలి.



