Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'సామినేని' హంతకులెవరో ప్రజా తీర్పుతో స్పష్టం

‘సామినేని’ హంతకులెవరో ప్రజా తీర్పుతో స్పష్టం

- Advertisement -

పాతర్లపాడులో 12 వార్డుల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయం
నిందితులను అరెస్టు చేయాలి : సీపీఐ(ఎం)

నవతెలంగాణ- బోనకల్‌
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామపంచాయ తీలో కాంగ్రెస్‌ నాయకుల హత్యా రాజకీయాలకు ఓటర్లు ప్రజాతీర్పుతో గుణపాఠం చెప్పారు. సామినేని హంతకులు ఎవరో స్పష్టం చేశారు. దీంతో సామినేని రామారావు హంతకులు ఎవరో కాదు కాంగ్రెస్‌ నాయకులేనని ప్రజలు తమ తీర్పు వెల్లడించినట్టయింది. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామపంచాయతీ ఉంది. ఈ మండలంలో ఈనెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పాతర్లపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా ఓబినబోయిన లక్ష్మి పోటీ చేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా సామినేని రామారావు హత్య కేసులో ఏ-2గా ఉన్న బొర్రా ప్రసాద్‌ సతీమణి ఉమ సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అదే విధంగా ఆరో వార్డు మెంబర్‌గా బొర్రా ప్రసాద్‌ రంగంలోకి దిగాడు.

పాతర్లపాడులో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. ఈ 12 వార్డులలో సీపీఐ(ఎం) 11 వార్డులలో పోటీ చేసింది. కాంగ్రెస్‌ సర్పంచ్‌తో పాటు పది వార్డులకు పోటీ చేసింది. సామినేని సతీమణి స్వరాజ్యం తన భర్తను పాతర్లపాడు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులతో పాటు మరికొంతమంది అత్యంత కిరాతకంగా హత్య చేశారని చింతకాని పోలీస్‌ స్టేషన్లో 31 అక్టోబర్‌ 2025న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు చింతకాని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏ-1గా గుర్తుతెలియని వ్యక్తులు, ఏ-2గా బొర్రా ప్రసాద్‌, ఏ-3గా కంచుమర్తి రామకష్ణ, ఏ-4గా మద్దినేని నాగేశ్వరరావు, ఏ-5గా కాండ్ర పిచ్చయ్య, ఎ-6గా కొత్తపల్లి వెంకటేశ్వర్లుగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ (నెంబర్‌ 324/2025) నమోదు చేశారు. జనరల్‌ డైరీలో రిసెప్షన్‌ ఎంట్రీ నెంబర్‌-5గా నమోదు చేశారు. పంచాయతీ ఎన్నికలలో బొర్రా ప్రసాద్‌, హత్య కేసులో నిందితులు రంగంలోకి దిగారు. పది రోజుల పాటు సాగిన ఎన్నికల ప్రచారంలో బొర్రా ప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకులు అధికారం, డబ్బుతో ఓటర్లను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేశారు.

అధికార బలం, పోలీసుల బలంతో కాంగ్రెస్‌ నాయకులు అనేక రకాలుగా కవ్వింపు చర్యలకు దిగినా సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు ఓపికకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. సామినేని రామారావు హత్యపై కాంగ్రెస్‌ నాయకులు అనేక రకాలుగా తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. అయినా గ్రామ ఓటర్లు సహనాన్ని ప్రదర్శించారు. ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో తమ ప్రజా తీర్పుతో కాంగ్రెస్‌ సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన బొర్రా ప్రసాద్‌ సతీమణి ఉమతో పాటు బొర్రా ప్రసాద్‌కు ఓటర్లు ఘోరీ కట్టారు. పోటీ చేసిన పది వార్డులలోనూ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోయింది. టీడీపీ ఒకే ఒక వార్డులో విజయం సాధించింది. సీపీఐ(ఎం), మద్దతిచ్చిన పార్టీలు 11 వార్డులలో అఖండ విజయం సాధించాయి. ఈ ఎన్నికల తీర్పుతో ప్రజలు కాంగ్రెస్‌ నాయకులకు గుణపాఠం నేర్పారు. ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి నిందితులను అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పాతర్లపాడులో మొత్తం 2,720 ఓట్లు ఉన్నాయి. మొత్తం 2,557 ఓట్లు పోలయ్యాయి. సీపీఐ(ఎం) అభ్యర్థికి 1,532 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థికి 968 ఓట్లు వచ్చాయి. దీంతో సీపీఐ(ఎం) అభ్యర్థిని ఓబినబోయిన లక్ష్మి 567 భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. ఉప సర్పంచ్‌గా 11వ వార్డు మెంబర్‌ దారెల్లి సురేష్‌ ఎన్నికయ్యాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -