ఎమ్మెల్యే ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలి
సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఎంఏ ఇక్బాల్, దూపటి వెంకటేష్ ఆలేరు ఎమ్మెల్యే ఆలేరులో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన నిలబెట్టుకోవాలని సీపీఐ(ఎం) నాయకులు ఏం ఏ ఇక్బాల్,ధూపాటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో వివిధ వార్డులలో మంగళవారం రోజున ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రి గా అభివృద్ధి చేయాలని సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం) జిల్లా నాయకులు ఎంఎ ఇక్బాల్ మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ లు మాట్లాడుతూ.. ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రి ఈ ప్రాంత ప్రజల అవసరాలు తీర్చే స్థాయిలో లేదన్నారు.
ఈ ఆస్పత్రికి దగ్గరలో ఉన్నటువంటి ఇతర మండలాలు, జిల్లాల నుండి అనేక మంది రోగులు ఈ ఆస్పత్రికి వైద్య సేవల కోసం వస్తున్నారని వారికి సేవలు అందడం లేదన్నారు. జాతీయ రహదారి దగ్గరలో ఉండడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వైద్య సేవల కోసం ఆస్పత్రికి వచ్చినప్పటికీ వారికి వైద్య సేవలు అందించే స్థాయిలో ఈ ప్రభుత్వ ఆస్పత్రి లేదన్నారు. ప్రాథమిక చికిత్స చేసి జిల్లా కేంద్రానికి లేదా హైదరాబాద్ కు పంపవలసిన పరిస్థితులు ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గుండె సంబంధిత రోగులు అదేవిధంగా పెరాల్సిస్ వంటి విపత్కర పరిస్థితిలో గంటలోపు రోగికి అందవలసిన గోల్డెన్ అవర్ ను ఈ ప్రాంత ప్రజలు అందుకోలేక అనేకమంది ప్రాణాలు కోల్పోవడం అనేకం జరుగుతున్నాయి అన్నారు.
గత శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవలసిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే ఉందని గుర్తు చేశారు. వెంటనే ఆలేరులో వంద పడకల ప్రభుత్వాసుపత్రి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) మండల నాయకులు సూదగాని సత్య రాజయ్య, మొరిగాడి రమేష్, నల్ల మాస తులసయ్య, వడ్డేమాన్ బాలరాజు, జూకంటి పౌలు, గణగాని మల్లేశం, తాళ్లపల్లి గణేష్, కాసుల నరేష్ సంగీరాజు, యాసారపు ప్రసాద్, దండు నాగరాజు, బర్ల సిద్దులు, ఎండి అమీర్ తదితరులు పాల్గొన్నారు.



