Wednesday, December 17, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపంచాయతీల నిధులు ఎవరి బిచ్చం కాదు

పంచాయతీల నిధులు ఎవరి బిచ్చం కాదు

- Advertisement -

అవి రాజ్యాంగబద్ధమైన హక్కు
అధికార పార్టీ నేతల భూములమ్మి నిధులివ్వడం లేదు : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
ఖానాపూర్‌, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లోని సర్పంచులకు సన్మానం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలది అధికార మదం తలకెక్కిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. పంచాయతీలకు ఇచ్చే నిధులు, ఇందిరమ్మ ఇండ్లు అధికార పార్టీ నాయకుల అబ్బ సొత్తు కాదని చెప్పారు. సర్పంచులకు ఇచ్చే నిధులు రాజ్యాం గబద్ధమైనవనీ, ఎమ్మెల్యేల దయాదా క్షిణ్యాలు కాదని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబా ద్‌లోని తెలంగాణ భవన్‌లో ఖానాపూర్‌, షాద్‌నగర్‌ నియోజక వర్గాల్లోని బీఆర్‌ఎస్‌ మద్దతుతో నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను కేటీఆర్‌ సన్మానం చేశారు. వారికి శుభాకాంక్షలు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు ఎవరి బిక్ష కాదన్నారు. కాంగ్రెస్‌ నేతలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వారి ఇండ్లు, భూములమ్మి పంచాయతీలకు నిధులివ్వడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బెదిరింపులకు భయపడొద్దని అన్నారు. ప్రజల పైసలతో కట్టే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలు మాత్రమేననేది గుర్తుంచుకోవాలని సూచించారు. ఇండ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామసభలకు, సర్పంచులకే ఉంటుందని చెప్పారు. ఎవరైనా అడ్డుతగిలితే తాటతీయాలన్నారు. కేంద్ర ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి రావాల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే బీసీలను మోసం చేసి రిజర్వేషన్లను 17 శాతానికి తగ్గించి పంచాయతీ ఎన్నికలను నిర్వహించిందని విమర్శించారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధుల్లో 70 శాతం నేరుగా పంచాయతీలకే వెళ్తాయన్నారు.

జిల్లాకో ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటుతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణా శిబిరాలను నిర్వహిస్తామని వివరించారు. కాంగ్రెస్‌ పాలనలో పల్లెలు సంక్షోభంలో ఉన్నాయనీ, యూరియా కోసం రైతులు ముష్టి యుద్ధాలు చేస్తున్నారని విమర్శిం చారు. రైతుల వరుసలు కనపడకుండా ఉండేందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘యూరియా యాప్‌’ డ్రామా మొదలెట్టిందని అన్నారు. దుకాణాల్లో దొరకని యూరియా యాప్‌లో దొరుకుతుందా?అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేండ్లేననీ, మళ్లీ వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జ్పెడీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్‌, జాజాల సురేందర్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఖానాపూర్‌ ఇంచార్జీ జాన్సన్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

గుమ్మడిదల మండల సర్పంచులకు హరీశ్‌రావు అభినందనలు
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచులను మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అభినందించారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ హింసా రాజకీయాలను అడ్డుకుంటామని అన్నారు. కామారెడ్డి జిల్లా సోమార్‌పేట్‌లో బీఆర్‌ఎస్‌ నేత బిట్ల రాజు ఇంటిపై కాంగ్రెస్‌ సర్పంచ్‌ ట్రాక్టర్‌తో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఇంచార్జీ ఆదర్శ్‌రెడ్డి, నూతన సర్పంచులు బుద్ధుల దుర్గ, గడ్డం లావణ్య, మంజుల, కొమ్ము శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ గూండాల దాడిని ఉపేక్షించం : కేటీఆర్‌
కాంగ్రెస్‌ గూండాల దాడులు, అరాచకాలను ఉపేక్షించబోమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. దాడికి ప్రతిదాడి తప్పదని అన్నారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్‌ గ్రామంలో కాంగ్రెస్‌ నాయకుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ నాయకులు బిట్ల బాలరాజు, ఆయన భార్య గంజి భారతిలను కేటీఆర్‌ పరామర్శించారు. వారి వైద్య ఖర్చులను బీఆర్‌ఎస్‌ పార్టీనే భరిస్తుందని భరోసా ఇచ్చారు. దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని కోరారు. చర్యలు తీసుకోకుంటే అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్‌, గణేష్‌ బిగలా, నాయకులు రాజారాం యాదవ్‌, సుమిత్రానంద్‌ తనోబా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -