ఇద్దరు పదో తరగతి విద్యార్థుల చేతులు విరిచిన ప్రిన్సిపల్..
బేరసారాలకు దిగిన యాజమాన్యం..?
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని హంసిని డీజీ హై స్కూల్‌లో చోటుచేసుకున్న అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్కూలుకు రాలేదన్న కారణాన్ని అడ్డం పెట్టుకొని ప్రిన్సిపాల్ ఇద్దరు పదో తరగతి విద్యార్థులను దారుణంగా కొట్టిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఒక విద్యార్థి చేయి విరగగా, మరో విద్యార్థి చేతి వేళ్లు విరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితుల వివరాల ప్రకారం… పట్టణానికి చెందిన సాయి, అయాన్ అనే విద్యార్థులు పలు కారణాల వల్ల కొద్ది రోజులుగా పాఠశాలకు హాజరు కాలేకపోయారు. ఇందులో అయాన్ తల్లికి శస్త్రచికిత్స జరగడంతో సుమారు 15 రోజుల పాటు ఆమెను చూసుకునేందుకు స్కూల్‌కు రాలేకపోయాడు. తండ్రి ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉండటంతో కుటుంబ బాధ్యతలు తనపై పడినట్లు అయాన్ మీడియాకు వివరించాడు. స్కూల్‌కు తిరిగి వచ్చిన అనంతరం తన పరిస్థితిని వివరిస్తూ క్లాస్‌కు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ, మాథ్స్ నోట్స్ పూర్తి చేయలేదన్న కారణంతో ప్రిన్సిపాల్ సంతోష్ అయాన్‌తో పాటు మరో విద్యార్థి సాయిపై దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని, వైద్య చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నిలదీయగా, విషయం బయటకు రాకుండా చూడాలని యాజమాన్యం బేరసారాలకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధిత కుటుంబాలను ఒత్తిడికి గురిచేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
హంసిని చుట్టూ వివాదాలే
ఇదిలా ఉండగా, హంసిని డీజీ హై స్కూల్ ప్రారంభం నుంచే ఏటా ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. సమస్యలు తలెత్తినప్పుడల్లా యూనియన్ పేరుతో, రాజకీయ నాయకుల అండతో వ్యవహారాలను సద్దుమణిగేలా చేయడం యాజమాన్యానికి అలవాటైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యూనియన్ నాయకుల ఒత్తిడి, రాజకీయ నాయకుల అండతో పాఠశాల యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హంసిని డీజీ పాఠశాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. పిల్లల భద్రత, హక్కుల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.



