Wednesday, December 17, 2025
E-PAPER
Homeక్రైమ్కబడ్డీ ప్లేయర్ హ‌త్య‌..ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం

కబడ్డీ ప్లేయర్ హ‌త్య‌..ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పంజాబ్‌లోని మొహాలీ సిటీలో రెండు రోజుల క్రితం కబడ్డీ ప్లేయర్‌ను హత్య చేసిన హంతకుడు బుధవారం పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. హంతకుడి కోసం గాలిస్తున్న పోలీసులకు అతడు తారసపడటంతో లొంగిపొమ్మని ఆదేశించారు. కానీ అతడు పోలీసులపైకి కాల్పులు జరిపి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు హతమయ్యాడు.

వివరాల్లోకి వెళ్తే.. రెండు రోజుల క్రితం కన్వర్‌ దిగ్విజయ్‌ సింగ్‌ అలియాస్‌ రాణా బాలచౌరియా అనే 30 ఏళ్ల కబడ్డి ప్లేయర్‌ హత్యకు గురయ్యాడు. మొహాలీలోని బెద్వా స్పోర్ట్స్‌ క్లబ్‌లో అతడు ఒక ప్రైవేట్‌ టోర్నీలో ఆడుతుండగా ముగ్గురు దుండగులు అతడి దగ్గరకు వెళ్లారు. సెల్ఫీ పేరుతో అతడిని పక్కకు పిలిచి పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో కాల్చిచంపారు. ఆపై అక్కడి నుంచి జారుకున్నారు.

స్థానికులు హుటాహుటిన ఆ ప్లేయర్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఒకడు తారన్‌ తరన్‌ జిల్లా నౌషెరా పన్నూన్‌ వాసి అయిన హర్పీందర్‌ అలియాస్‌ మిడ్డుగా గుర్తించారు. అతడి కోసం గాలిస్తుండగా ఎదురుపడి పోలీసులపైనే కాల్పులు జరిపాడు. దాంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

అనంతరం పోలీసులు మిడ్డూను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్లిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పంజాబ్‌లోని కబడ్డీ టోర్నీలను నిర్వహించే ఆర్గనైజేషన్‌పై ఆధిపత్యం కోసం గ్యాంగ్‌స్టర్స్‌ మధ్య వార్‌లు జరుగుతున్నాయని పోలీసులు చెప్పారు.

ఆ వార్‌లో భాగంగానే కబడ్డీ ప్లేయర్‌ల హత్యలు జరుగుతున్నాయని తెలిపారు. సోమవారం హత్యకు గురైన బాలచౌరియా గ్యాంగ్‌స్టర్‌ జగ్గూ భగవాన్‌పూరియాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానించిన ప్రత్యర్థి గ్యాంగ్‌లు ఈ హత్య చేయించాయి. గతంలో కూడా ఈ గ్యాంగ్‌స్టర్ మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఇద్దరు కబడ్డీ ప్లేయర్‌లు హత్యలకు గురయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -