Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుజాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే 2025 బిల్లు రద్దు చేయాలి

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే 2025 బిల్లు రద్దు చేయాలి

- Advertisement -

ఈనెల 19, 20 తేదీల్లో గ్రామ గ్రామాన బిల్లు ప్రతుల దగ్ధం: సీపీఐ(ఎం) పిలుపు
ఎండి జహంగీర్ జిల్లా కార్యదర్శి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – ఆలేరు రూరల్

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం–2005ను నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన వీబీ –జి ఆర్ ఏ ఎం జి 2025 (197) బిల్లును తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 19,20 తేదీల్లో ప్రతి గ్రామంలో బిల్లు ప్రతులను దగ్ధం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం సీపీఐ(ఎం) ఆలేరు కార్యాలయంలో మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ అధ్యక్షతన నిర్వహించిన పట్టణ,మండల కమిటీల సమావేశంలో ఎండి. జహంగీర్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ‘వికసిత్ భారత్–2047’ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే,ఉపాధి హామీ చట్టం తలలేని మొండంలా మారుతుందని తీవ్రంగా విమర్శించారు. పనిదినాలను 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి, 60 రోజులు పనులపై నిషేధం విధించడం ద్వారా కార్మికులను మోసం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఉపాధి హామీ నిధుల్లో కేంద్రం 90 శాతం,రాష్ట్రం 10 శాతం వాటా ఉండేదని,కొత్త బిల్లులో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం ద్వారా చట్టాన్ని ఎత్తివేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.

పనులను నాలుగు విభాగాలుగా చేసి కోట్ల రూపాయల పనులను యంత్రాలు, కాంట్రాక్టర్లకు అప్పగించడమే ఈ బిల్లుకు అసలైన ఉద్దేశమని విమర్శించారు. కేంద్రం నిర్ణయించిన వేతనాల కంటే రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలన్న నిబంధనను కొత్త బిల్లులో రద్దు చేశారని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచే విధానాన్ని తొలగించారని పేర్కొన్నారు. ఆధార్, బయోమెట్రిక్,ఏఐ,జీపీఎస్‌లను చట్టబద్ధం చేయడం ద్వారా పేదలను ఉపాధి హామీ నుంచి తప్పించాలన్న ప్రయత్నమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పంచాయతీలకు ఉన్న ప్రధాన పాత్రను తొలగించి,అన్ని అధికారాలను కేంద్రానికి కట్టబెట్టడం, సోషల్ ఆడిట్‌ను కూడా మనుషులకాకుండా టెక్నాలజీతో చేయాలనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల భూముల అభివృద్ధి, కాలనీలు, నివాస ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడిన ఉపాధి హామీ నిధుల ప్రస్తావన కూడా కొత్త బిల్లులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామాల్లో ఉపాధి పనిదినాలు తగ్గిపోవడంతో పేదలు జీవించలేని పరిస్థితి నెలకొందని,ఉన్న ఉపాధిని కూడా హరించే ఈ బిల్లును పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ ఇక్బాల్, పట్టణ, మండల నాయకులు మొరిగాడి రమేష్, సూదగాని సత్యరాజయ్య, మోరిగాడి చంద్రశేఖర్, జూకంటి పౌలు, పిక్క గణేష్, వడ్డెమాను బాలరాజు, తాళ్లపల్లి గణేష్, శంకర్, బొప్పిడి యాదగిరి, గణగాని మల్లేశం, కాసుల నరేష్, చౌడబోయిన యాదగిరి,గ్యార భాస్కర్,శాంతా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -