నాజీ జర్మనీని ఓడించినది ప్రధానంగా సోవియట్ యూనియన్. తమ మాతృ దేశ రక్షణ కోసం సోవి యట్ ప్రజలు చేసిన అపార త్యాగాలు ఎవరి ఊహలకూ అందనంత స్థాయిలో ఉన్నాయి. ఐతే, మొదటినుంచీ పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులు ఈ సత్యాన్ని ఏదో ఒక విధంగా మరుగుపరిచి నాజీ జర్మనీ ఓటమికి కారణం తాము చేసిన ప్రయత్నాలే అని చెప్పుకోడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. ప్రారంభంలో ఈ ప్రయత్నం చాప కింద నీరులాగా సాగింది. అప్పట్లో కనీసం ఆ పశ్చిమ దేశాల ప్రజలు కూడా వారి ప్రచారాన్ని విశ్వసించలేదు. ఇక ఆ పశ్చిమ దేశాల మేథావులైతే ప్రత్యక్షంగా ఆ యుద్ధాన్ని చూసినవారు గనుక అది ఎలా పరిణమించిందో తెలుసు గనుక ఈ తప్పుడు ప్రచారం వారి వద్ద చెల్లలేదు.
నేను వ్యక్తిగతంగా పొందిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. ప్రొఫెసర్ జోన్ రాబిన్సన్ ప్రఖ్యాత వామపక్ష కీన్షియన్ ఆర్థికవేత్త. పలు కేంబ్రిడ్జి సెమినార్లలో ఆమెతోబాటు పాల్గొన్నాను. ఆ సెమినార్లలో ఎవరైనా సోవియట్ యూనియన్ మీద చేసిన విమర్శలు శృతి మించినప్పుడు ఆమె ”సోవియట్ యూనియనే గనుక లేకుంటే మనం ఇప్పుడు ఇలా సెమినార్లలో కూర్చుని వుండగలిగేవాళ్ళం కాదు” అని గట్టిగా స్పందించేవారు. ఆమె తండ్రి ఒక ప్రఖ్యాత బ్రిటిష్ సైనిక జనరల్. అతను ఏ రకంగా చూసినా కమ్యూనిస్ట్ అనుకూలుడు కాడు. కాని అతడి కుమార్తెకు నాజీలపై పోరులో సోవియట్ యూనియన్ పాత్ర గురించి ఇటువంటి అభిప్రాయం ఉండేది. ఇదే విధమైన అభిప్రాయాన్ని చాలామంది పశ్చిమ దేశాల విద్యావేత్తలు కలిగివుండేవారు. ఐతే కాలం గడుస్తున్నకొద్దీ, కొత్త తరాలు రంగం మీదకు వస్తున్నకొద్దీ, సోవియట్ యూనియన్ పాత్రను మరుగుపరిచే కట్టు కథలకు బలం పెరిగింది. ఈ కొత్త తరాల వారు ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసినదీ లేదు, దాని గురించిన విషయ పరిజ్ఞానమూ వారికి లేదు. అందుకే ఈ కట్టుకథల ప్రభావం పెరుగుతూ వచ్చింది.
ఈ విధంగా సత్యాన్ని మరుగుపరిచే విషయంలో హాలీవుడ్ కూడా తెలిసో తెలియకో తన వంతు పాత్ర పోషించింది. హాలీవుడ్‌లో నిర్మించిన పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలు -‘ది లాంగెస్ట్ డే’, ‘ది గన్స్ ఆఫ్ నవ్రాన్, మొదలు ‘సేవింగ్ ప్రైవేట్ రియాన్’ వరకూ-పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలు నాజీలకు వ్యతిరేకంగా ఎలా ‘గొప్పగా’ పోరాడారో, ఏ విధంగా నాజీలను ఓడించారో ఆ చిత్రాల్లో చూపించారు. ఈ చిత్రాలు పశ్చిమ దేశాల ప్రేక్షకుల కోసం ప్రధానంగా ఉద్దేశించబడ్డాయి. అందుకే ఆ చిత్రాల మౌలిక కథనాలు ఆ విధంగా ఉన్నాయి. కాని రెండవ ప్రపంచ యుద్ధం ప్రధానంగా నాజీ జర్మనీకి, పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలకు నడుమ జరిగినట్టు, నాజీలను, దాని మిత్రులను పశ్చిమ దేశాలు ఓడించినట్టు జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఆ చిత్రాలు బలాన్ని చేకూర్చాయి.
ఆ యుద్ధంలో బ్రిటన్ సుమారు 5 లక్షల మంది ప్రజల ప్రాణాలను కోల్పోయింది. వారిలో సైనికులు, పౌరులు కూడా ఉన్నారు. అమెరికా అంతకన్నా తక్కువ సంఖ్యలోనే ప్రాణ నష్టాన్ని చవి చూసింది. దీనిని సోవి యట్ యూనియన్‌తో పోల్చి చూడండి. ఆ దేశం 2 కోట్ల 70 లక్షల మంది ప్రజల ప్రాణాలను కోల్పోయింది. కాని ఈ వాస్తవం పాశ్చాత్య దేశాల ప్రజల జ్ఞాపకాల్లో ఎక్కడా మిగలలేదు. వాస్తవానికి యుద్ధంలో ఎంతెంత మంది ప్రాణాలను త్యాగం చేశారన్నది ప్రధానం కాదు. ఆ సంఖ్య ఎంత తక్కువైనా, వారి త్యాగాలను గౌరవిం చాల్సిందే. కాని పాశ్చాత్య దేశాల ప్రజానీకం జ్ఞాపకాల్లో సోవియట్ ప్రజల అపార త్యాగాలకు ఏ స్థానమూ లేకపోవడం మాత్రం చాలా అన్యాయం.
పశ్చిమ దేశాలు ఆ యుద్ధం ముగిసిన తర్వాత మొదలుబెట్టిన ప్రచ్ఛన్న యుద్ధ వ్యూహానికి ఇది చాలా ఉపయోగపడింది. సోవి యట్ యూనియన్ త్యాగాలను మరుగు పరచడంతోబాటు, సామ్రాజ్య వాద దేశాలు మరొక దుర్మార్గమైన ప్రచారానికి తెరతీశారు. సోవియట్ యూనియన్ విస్తరణ కాంక్షతో ఉందని, పశ్చిమ యూరప్‌ను ఆక్రమించు కోవడానికి పథకాలు పన్నుతోందని వారు ప్రచారం మొదలుబెట్టారు. అప్పుడే ముగిసిన యుద్ధంలో ఏకంగా 2 కోట్ల 70 లక్షల మందిని పోగొట్టుకుని భారీ స్థాయిలో వినాశనాన్ని చవిచూసిన సోవియట్ యూని యన్ అంత త్వరలో ఏవిధంగా విస్తరణకు పూనుకుంటుంది? ఈ ఇంగిత జ్ఞానం కూడా పశ్చిమ దేశాల ప్రచా రకులకు లేదు. విన్‌స్టన్ చర్చిల్ వంటి పక్కా సామ్రాజ్యవాది నాయకత్వంలో సోవియట్ వ్యతిరేక ప్రచారానికి పూనుకున్నారు. యూరప్ కు సోవియట్ నుండి ప్రమాదం పొంచి వుందని పాట ఎత్తుకున్నారు. నిజానికి యూరప్ దేశాల పాలకవర్గాల ఆధిపత్యానికి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో అంతర్గతంగానే తీవ్ర సవాలు ఎదురైంది. దానిని తిప్పికొట్టడానికి ఆ పాలకవర్గాలు ప్రజలకు పలు రాయితీలను ఇవ్వవలసి వచ్చింది. అటువంటి రాయితీలలో సంక్షేమ రాజ్యం అనేది ఒకటి. దేశీయంగా సంక్షేమ రాజ్యాన్ని ఏర్పరచడంతోబాటు తమ ఆధీనంలో ఉన్న వలసలకు స్వతంత్రాన్ని ఇవ్వడం రెండవది (ఈ రెండవ చర్యకు చర్చిల్ పూర్తి వ్యతిరేకి).
వాస్తవానికి యాల్టాలో, పోట్స్‌డామ్ సమావేశాల్లో కుదిరిన అవగాహనకు సోవియట్ యూనియన్ పూర్తిగా కట్టుబడి వ్యవహరించింది (ఫాసిస్టు కూటమికి వ్యతిరేకంగా పోరాడుతున్న శక్తులు ఈ రెండు సమా వేశాల్లో పాల్గొన్నాయి). వాస్తవానికి గ్రీస్‌లో విప్లవం ఆ కాలంలో తలెత్తినప్పుడు దానికి సహాయంగా నిలవడానికి సోవియట్ యూనియన్ ముందుకు రాలేదు. ఆ కారణంగా గ్రీక్ విప్లవం ఓటమిపాలైంది. ఐనా సరే, సామ్రాజ్య వాదులు మాత్రం సోవియట్ యూనియన్ ను ఒక భూతం గా చిత్రించడం మాత్రం మానుకోలేదు. ఆ ప్రచారం ద్వారా పశ్చిమ దేశాల పాలకవర్గాలు తమ ఆధిపత్యానికి ఎదురౌతున్న సవాలును తట్టుకోడానికి ప్రయత్నించారు.
బ్రిటిష్ వలసగా భారతదేశం ఉన్నప్పుడు ఇక్కడి ప్రజల నుండి బలవంతంగా చేయించిన త్యాగాలు పశ్చిమ దేశాలు అన్నీ కలిసి రెండో ప్రపంచ యుద్ధంలో చేసి త్యా గాలకన్నా చాలా ఎక్కువ అన్నది చాలా మంది గుర్తించరు. ఆ యుద్ధంలో తూర్పు రంగాన బ్రిటన్ జపాన్‌తో తలపడవలసి వచ్చింది. అందుకయే ఖర్చులో అత్యధిక భాగాన్ని అప్పటి భారతదేశం లోటు బడ్జెట్ ద్వారా భరిం చింది. ఆ యుద్ధంలోకి భారతీయులు వారి ఇష్టాయి ష్టాలతో నిమిత్తం లేకుండానే బలవంతంగా లాగబడ్డారు. భారతదేశం నుండి యుద్ధ ఖర్చుల నిమిత్తం బ్రిటన్ బలవంతంగా రుణాలు తీసుకుంది. ఆ రుణాలను న్యాయంగా ఇండియాకు తిరిగి చెల్లించాల్సివుంది. కాని యుద్ధం ముగిసిన చాలా కాలం వరకూ తిరిగి చెల్లించనేలేదు. బడ్జెట్‌లో ఏర్పడిన లోటు కారణంగా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు ఎటువంటి రేషనింగు విధానమూ లేదు. దాంతో బెంగాల్ గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన కరువు ఏర్పడింది. ఆ కరువుకు 30 లక్షల మంది బలయ్యారు (అదే బ్రిటన్‌లో మొత్తం యుద్ధకాలం అంతటికీ 5 లక్షల మంది మాత్రమే మరణించారు). ధరల పెరుగుదల కారణంగా బ్రిటన్ ఇండియాకు తిరిగి చెల్లించవలసిన రుణం విలువ బాగా పడిపోయింది. దానికి తోడు పౌండు విలువను 1949లో తగ్గించారు. రుణం పౌండ్ల లెక్కల్లో ఉన్నందున వాస్తవంగా ఇండి యాకు దక్కినది అసలు రుణంలో కొద్ది భాగం మాత్రమే. యుద్ధంలో పాల్గొనడానికి ఏ మాత్రమూ సంసిద్ధం కాకపోయినా, బ్రిటన్ అనుసరించిన విధానం వలన 30 లక్షల మంది బెంగాలీ ప్రజలు ఆ యుద్ధానికి బలైపోయారు.
నాజీలను ఓడించడంలో సోవియట్ యూనియన్ పాత్రను కప్పిపుచ్చే ప్రయత్నం ఇప్పుడు ట్రంప్ హయాంలో తారాస్థాయికి చేరింది. నిజానికి నాజీ జర్మనీని ఓడించినది ప్రధానంగా అమెరికాయే నని పచ్చి అబద్ధాలను అడ్డగోలుగా ట్రంప్ ప్రకటించేస్తున్నాడు. కొత్త తరం యువతకు ఆ యుద్ధానికి సంబంధించిన పూర్తి వాస్తవాలు తెలియకపోవచ్చు. కాని 1946లో పుట్టిన ట్రంప్ కు యుద్ధానంతర కాలపు జీవితంతో ప్రత్యక్షాను భవం ఉంది. ఐనా, ఇలా సిగ్గులేకుండా పచ్చి అబద్ధాలను వాగడం ట్రంప్‌కే చెల్లింది. యుద్ధం ముగిసిన తర్వాత సామ్రాజ్య వాదులు మొదలుబెట్టిన తప్పుడు ప్రచారానికి ఇది కొనసాగింపే.
ఈ ఏడాది నాజీ జర్మనీపై విజయం సాధించి 80 సంవత్స రాలు పూర్తయిన సందర్భంగా మాస్కోలో విజయోత్స వాలు నిర్వహించారు. వాటిలో పాల్గొన డానికి అప్పటి మిత్ర దేశాలైన బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలకు రష్యా ఆహ్వానం పంపింది. కాని సామ్రాజ్యవాద దేశాలు ఆ ఉత్సవాలను బహిష్కరిం చాయి. ఉక్రెయిన్ -రష్యా యుద్ధాన్ని అవి సాకుగా చూపించి ఉత్సవాలను ఎగవేశాయి. నిజానికి ఆనాటి యుద్ధంతో పుతిన్ కు ఏ సంబంధమూ లేదు. కాని అప్పటి ఘన విజయాన్ని ఇప్పుడు సంబరంగా జరుపుకుని ఆ ఖ్యాతిలో వాటా కొట్టే ద్దామని పుతిన్ తాపత్రయపడుతున్నాడు. అంతమాత్రం చేత సామ్రాజ్య వాద దేశాలు ఆ ఫాసిస్టు వ్యతిరేక విజయోత్సవాలను బహిష్కరించడం సమర్ధనీయం కానే కాదు. పోనీ అలా బహిష్కరించడానికి వారు అప్పటి సోవియట్ యూనియన్‌కు ఇప్పటి పుతిన్‌కు తేడా ఉందని ఏమైనా వాదన ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు.
ఐతే ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం గుర్తిం చాలి. కేవలం చైనా, వియత్నాం, క్యూబా వంటి సోషలిస్టు దేశాలు మాత్రమే కాకుండా చాలా మూడవ ప్రపంచ దేశాలు ఈ విజయోత్సవాలకు హాజరయ్యాయి. వాటిలో బ్రెజిల్, వెనిజులా, బుర్కినా ఫాసో (ఈ దేశం ఇప్పుడు ఫ్రెంచి-అమెరికన్ సామ్రాజ్యవాదంతో తల పడుతోంది) వంటి దేశాలు ఉన్నాయి. ఈ ఉత్పవాలలో భారతదేశం పాల్గొనలేదు. ఇదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. ప్రస్తుత ప్రభుత్వ అధినేతల హిందూత్వ వాదానికి మూలాలు ముస్సోలినీ, హిట్లర్‌ల దగ్గర నుంచి సంక్రమించాయి. ఆ యుద్ధ కాలంలో హిందూత్వ వాదులు నాజీలకు మద్దతుగా వ్యవహరించారు. ప్రపంచం లోని అత్యధిక మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా నిలిచారు.
ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. చాలా దేశాల్లో ఫాసిస్టు శక్తులు తిరిగి అధికారంలోకి వస్తున్నాయి. ఇటువంటి సమయంలో ఫాసిస్టు-వ్యతిరేక ఉత్సవాలలో పాలుపంచుకోవడం పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదులకు ప్రాధాన్యతాంశంగా ఉండదు. ఎందుకంటే సామ్రాజ్యవాద శక్తులు ఈ ఫాసిస్టు శక్తులలో చాలా వాటితో పొత్తులకు సుముఖంగా ఉన్నారు. ఇలా ఉన్నవారిలో డొనాల్డ్ ట్రంప్ అందరికన్నా ముందుం టాడు. అతగాడి అనుంగు మిత్రుడు ఎలన్ మస్క్ జర్మన్ నయా నాజీ పార్టీ అయిన ఎ.ఎఫ్.డి కి వీరాభిమాని. రష్యాతో ప్రస్తుతం యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్ ప్రభుత్వానికి సామ్రాజ్యవాద దేశాల మద్దతు ఉంది. ఆ ఉక్రెయిన్ ప్రభుత్వం నిండా స్టెపాన్ బండేరా అనుయాయులు ఉన్నారు. ఈ స్టెపాన్ బండేరా రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తమను ఆక్రమించు కోవడానికి వచ్చిన నాజీలకు బంటుగా వ్యవహరించాడు.
నాజీలపై సాధించిన విజయం యొక్క కీర్తిలో వాటా కొట్టేద్దామని పుతిన్ ప్రయత్నిస్తూండవచ్చు. కాని అతగాడికి కనీసం ఆ యుద్ధంలో సోవియట్ యూనియన్ సాధించిన విజయం ఎంత ఘనమైనదో అది కనీసం బోధపడింది. కాని పశ్చిమదేశాల సామ్రాజ్యవాదులకు ఆపాటి కూడా బోధపడలేదు.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
నాజీల ఓటమిపై సామ్రాజ్యవాదుల కట్టుకథలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES