Thursday, December 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపోదాంపద పుస్తకాల జాతరకు…

పోదాంపద పుస్తకాల జాతరకు…

- Advertisement -

హైదరాబాద్‌లో ఒక సాంస్కృతిక ఉత్సవ సందడి ఆరంభమవుతున్నది. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఆధ్వర్యాన 38వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 19 నుండి 29 వరకు జరగబోతున్నది. ఎప్పటికన్నా అధికంగా ఈసారి 350కిపైగా స్టాల్స్‌తో ఎన్టీఆర్‌ స్టేడియం పుస్తకాల వెలుగులు చిమ్మనున్నది. ఈ పదకొండు రోజులూ ఇక్కడ పుస్తకాల అమ్మకాలు జరుగుతాయని సాధారణంగా అనుకుంటాం. కానీ అనేకానేక ఆలోచనల, అభిప్రాయాల, సంస్కారాల ఆదానప్రధాన వేదిక అది. అనంతమైన భావసమ్మేళనమది. నిరంతరం తలెత్తే ప్రశ్నలు, జవాబులు సంచరించే సందర్భం అది. పుస్తకాల మహత్తు, వాటిని హత్తుకున్న వాళ్లకు బాగా తెలుస్తుంది.

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అని అన్నపుడు, పుస్తకమని చెప్పాడు ప్రపంచ మేధావి ఐనిస్టీన్‌. అట్లాంటి గొప్ప సృష్టి అయిన వస్తువుల సందోహం మనముందుకు వస్తున్నది. పుట్టిన రోజు కానుకగా ఏమి కావాలని అడిగినపుడు పుస్తకాలు కావాలని కోరుకున్నారట విప్లవ నాయకుడు లెనిన్‌. ప్రాణంపోతున్న క్షణం ముందువరకూ పుస్తకంతోనే గడిపిన భగత్సింగ్‌ ప్రేమించిన అక్షరాలు లక్షలాదిగా మన ముంగిట కొస్తున్నాయి. ఆ అక్షరావరణంలోకి మనం వెళితే అనేకానేక ఉత్సాహాలను పొందగలుగు తాము. ప్రేరణ, స్ఫూర్తి, చైతన్యం, జ్ఞానం మనలో నిండుతుంది. నేటి భయంకర వస్తువినిమయ ప్రపంచాన, ఉత్కృష్టమైన వినియోగదారీ మార్కెట్‌ ఆలోచనలతో ఉక్కిరిబిక్కిర వుతున్న జనసామాన్యాలకు ఓ చల్లని పలకరింపు ఈ సందర్భం. నిత్యం మనం భౌతిక అవసరాలు తీర్చుకోవటం కోసం, సౌకర్యాల కోసం ఎన్నో కొంటాం. సమకూర్చుకుంటాం. కావలసిన వాటికన్నా కూడా ఎక్కువేకొని తరిస్తున్నాం కూడా. కానీ బౌద్ధికావసరాలను అసలు గుర్తిస్తున్నామా! మన మెదడుకొక అవసరముంటదని, జ్ఞానం దాని ఆకలని అనుకుంటున్నామా, దాన్ని తీర్చాల్సిన బాధ్యత మనపై ఉందని భావించిన వాళ్లకు, ఆకలి తీర్చే అక్షర కేంద్రం ఇది.

మనసుకు కడుపునిండా భోజనం పెట్టడానికి ఇప్పుడిక సమాయత్తమవ్వండి. విశ్వాన్ని చుట్టి రమ్మంటే ఆనాడు విఘ్నేశ్వరుడు, శివపార్వతుల చుట్టూ తిరిగి అనుభవాన్ని, జ్ఞానాన్ని గ్రహించాడని, మన పురాణాల్లో చెబుతారు. అదేవిధంగా ప్రపంచ గమనాలకు, విజ్ఞానాన్ని పొందటానికి పుస్తకాలే శరణ్యం. అవి మన కోసమే ఇక్కడికి చేరుతున్నాయి. ఇప్పుడు పుస్తకాల చుట్టూ తిరగాలి.
ప్రపంచ గమనాల వాస్తవికతలను, ముఖ్యంగా మన దేశ వాస్తవ చరిత్రలను, వర్తమాన సంఘటనలను వక్రీకరిస్తూ, కొత్త కొత్త నెరేటివ్స్‌ ప్రచారంలోకి వస్తున్నాయి. అందుకు పెద్దపెద్ద తిరోగామి శక్తుల యూనివర్సిటీలు నిరంతరంగా పనిచేస్తున్నాయి. జనం మెదళ్లపై మబ్బు తెరలను, విషపు అరలను సృష్టిస్తున్నాయి. జాగ్రత్తపడాల్సిన సమయం ఇది. మానవీయ సాంస్కృతిక పురోగమన ప్రయాణానికి బదులు, సాంస్కృతిక తిరోగమనానికి చేస్తున్న ప్రయత్నాలను అరికట్టాల్సిన కర్తవ్యం జ్ఞాన సమూహంపై ఉంది.

ఈ ప్రతిబంధక సంధి అవస్థ కొనసాగుతున్న వేళ వెలుగుతోవలేవో తెలుసుకోవాలి. ఒకరకంగా భావజాలాల మధ్య యుద్ధ సన్నివేశం నెలకొన్న సమయాన మనమూ సైనికులమవ్వాల్సిందే. అక్షరాయుధాలను అందుకునేందుకు ఇదే తరుణం. అంతేకాదు, జీవితమంటేనే యుద్ధం కదా! ఇందులోనూ మనం గెలవాల్సిన అవసరం ఉంది. పునరుజ్జీవం పొందాల్సీ ఉంది. ఈ అన్నింటికీ పుస్తకం ఒక సాధనం. ఇప్పటికి మన ముంగిట్లో డీమార్టులు, స్పెన్సర్లు, రత్నదీప్‌లూ, రిలయన్స్‌లూ, షోరూములు మార్కెట్లో బోలెడన్ని నోళ్లు తెరచుకుని ఉంటూనే ఉన్నాయి. అందులో కల్తీలు, అనారోగ్య కారకాలు, రంగులూ, అనవసరాలూ, రోగాలు అనేకం. వాటికి భిన్నంగా స్వచ్ఛమైన మాటల అక్షర సముచ్ఛాయాలు ఈ ప్రదర్శనలో దర్శనమిస్తాయి.

ఇంటికి తెచ్చుకుంటే ఎప్పటికీ మీతో సంభాషిస్తూనే ఉంటాయి. చదవడం గురించి ఎవరికీ తెలియంది కాదు. అదొక సంస్కృతి. పెట్టెల కొద్దీ పుస్తకాలను విదేశాల నుండి దేశానికి తెచ్చుకున్న మేధోజీవి బాబా అంబేద్కర్‌ చూపిన బాట. మీరూ మీ పిల్లలను తీసుకుని రండి. కొనుక్కోవాల్సిన, కొని చదివి భద్రపరచుకో వాల్సినవి పుస్తకాలేనని భవిష్యత్‌ తరాలకు తెలియజేయండి. పుస్తకం చేతిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా గౌరవమని భావించేలా చేయండి. పుస్తకాల ఎంపికనూ నేర్పించండి. ఇది అమ్మకాల అంగడి కాదు, సాంస్కృతిక సందడి. నిత్యం కళారూపాల ప్రదర్శనలుంటాయి. పిల్లలకు అనేక కార్యక్రమాలతో బాలోత్సవా లుంటాయి.

ప్రభావితం చేసిన పుస్తకాల స్ఫూర్తి చర్చలూ ఉంటాయి. కొత్త పుస్తకాల ఆవిష్కరణలూ, రచయితల, కవుల, సామాజిక కార్యకర్తల విలువైన సందేశాలు, చర్చలూ మాటలూ, పాటలూ మరెన్నో ఆలోచింపచేసే వేదికల సందోహం ఈ పుస్తకాల పండగ. అక్షరంతో, కళతో, మనతో జీవించి అమరులైన అందెశ్రీ ప్రాంగణాన, కవయిత్రి అనిసెట్టి రజిత, కొంపల్లి వెంకట్‌ గౌడ్‌ వేదికలు, ఆచార్య ఎన్‌.వి. రామారావు, స్వేచ్ఛా వోటార్కర్‌ జ్ఞాపకాలలో సాంస్కృతిక మహౌత్సవం స్నేహితుల పలకరింపులు, ఆత్మీయ సంభాషణల కలయికలతో కొనసాగనుంది. ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని నెలలుగా బుక్‌ఫెయిర్‌ కమిటీ సభ్యులు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి శ్రమ, పుస్తక ఉత్సవం ఫలించాలని కోరుకుందాం. అక్షర సముదాయంలోకి పయనిద్దాం.

కె. ఆనందాచారి
9948787660

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -