ప్రస్తుతం ప్రపంచం అంతటా దాదాపుగా అన్నిచోట్లా విద్యార్థులకు ఒకే తరహా ఆర్థిక శాస్త్రాన్ని బోధిస్తున్నారు. దానినే ”ప్రధాన స్రవంతి” ఆర్థిక శాస్త్రంగా పరిగణిస్తున్నారు. ఈ ”ప్రధాన స్రవంతి” ఆర్థిక శాస్త్రం పెట్టుబడిదారీ విధానపు వాస్తవికతను గ్రహించదు. దాని ప్రస్తుత అవతారంలో గాని, రానున్న రోజుల్లో దాల్చనున్న ”కొత్త” అవతారాల్లోగాని అది ఎన్నటికీ పెట్టుబడిదారీ విధానపు వాస్తవికతను గ్రహించ లేదు. దానికి అది సాధ్యం కాదు. ఎందువల్లనో చూద్దాం.
ఏ ఉత్పత్తికైనా అందులో నిమగమైన వ్యక్తుల నడుమ సమన్వయం ఉండడం అవసరం. అది ఆటవిక సమాజంలో అడవి పందిని వేటాడడం వంటిది కానీండి లేదా ఆధునిక సమాజంలో కారు ఉత్పత్తి చేయడం వంటిది కానీయండి. ఆ ఉత్పత్తిలో పాల్గొనే వ్యక్తులు ఒక ప్లాను ప్రకారం పని చేస్తేనే వాళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. అలా జర గాలంటే వారి మధ్య పరస్పరం సమన్వయం తప్పనిసరి. అటువంటి సమన్వయం ఉండాలంటే అందుకు క్రమశిక్షణ ఉండితీరాలి. పాత సమాజాల్లోని ఉత్పత్తి విధానాల్లో ఈ క్రమశిక్షణను బలప్రయోగం ద్వారా నిర్బంధంగా అమలు చేసేవారు. బానిస సమాజంలో కొంతమంది బానిసలు తమ వంతు పని చేయడంలో వెనకబడితే, దాని వలన మొత్తం పనిలో సమన్వయం దెబ్బ తినిపోయేది. అప్పుడు అటువంటి ”పని ఎగ్గొట్టిన” బానిసలను శారీరకంగా హిం సించడానికి, వారిపై నిర్బంధానికి పాల్పడడానికి యజమానులు కొంతమందిని ప్రత్యేకంగా నియమించేవారు.
భూస్వామ్య వ్యవస్థలో సైతం, భూస్వాముల పొలాలమీద పని చేసే భూదాసులలో (వెట్టి చేసేవారిలో) కొంతమంది పనిలో వెనకబడితే (కోతలు,నూర్పిళ్ళు వగైరా పనుల్లో) దాని వలన కొంత పంట నష్టం జరిగేది. అప్పుడు అలా పనిలో వెనకబడ్డ భూదాసులను చితక్కొట్టేవారు. ఉత్పత్తి సాధనాల మీద ఉమ్మడి యాజమాన్యం లేకుండా, కొందరు యజమానులుగా, మరికొందరు శ్రామి కులుగా విభజన ఏర్పడిన సమాజాల్లో శ్రామికులు సమన్వయంతో పని చేయడానికి స్వచ్ఛందంగా స్పందించరు. అటు వంటప్పుడు వారిని సమన్వయంతో పనిచేసేలా చేయడానికి ఏదో ఒక విధమైన నిర్బంధ పద్ధతిని అనుసరించడం అవసరమౌతుంది. పెట్టుబడిదారీ విధానం కూడా ఒక వర్గ సమాజమే. అయినప్పటికీ ఇక్కడ నిర్బంధ విధానం ఏదీ బయటకు కనిపించదు. అంటే ఈ పెట్టుబడి దారీ సమాజంలో ఎక్కడా పెట్టుబడిదారులు భౌతిక నిర్బంధ పద్ధతులను పాటిం చడం లేదని కాదు.
కాని ఈ విధానంలో భౌతిక నిర్బంధం అనేది అనివార్యమైన నియమంగా ఉనికిలో లేదు. మరి అటువం టప్పుడు కార్మికులు పనిలో పరస్పర సమన్వయంతో వ్యవహరిం చేలా చేయడానికి అనుసరించే మార్గం ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ”పని లోంచి గెంటేస్తామని” బెదిరించడం అనేదే ఆ మార్గం అని పోలండ్‌కు చెందిన మార్క్సిస్టు ఆర్థికవేత్త మైకేల్ కాలెక్కీ అన్నాడు. ఎవరైనా పనిలో వెనుకబడినా, పని ఎగ్గొట్టినా వాళ్లని వెంటనే పనిలోంచి తొలగిస్తారు. మరోలా చెప్పాలంటే అటువంటి వ్యక్తి పెట్టుబడిదారీ వ్యవస్థ ”లోపల” తనకుగల స్థానాన్ని కోల్పోయి ఆ వ్యవస్థ ‘వెలుపలికి’ గెంటివేయబడతాడు. ఇటువంటి విధానం అమలు జరగాలంటే పెట్టుబడిదారీ విధానంలో ”వ్యవస్థకు వెలుపల”, ”వ్యవస్థకు లోపల” అనే రెండు భాగాలు ఉండడం అవశ్యం. అప్పుడే ఉత్పత్తి విధానంలో క్రమశిక్షణను అమలు చేయించడం సాధ్యపడుతుంది.
బానిస వ్యవస్థలో మాదిరిగా బైటకు కనిపించే విధంగా ఉండే భౌతిక నిర్బంధం (కొట్టడం లేక తిండి పెట్టకుండా మాడ్చి చంపడం వంటివి) లేకపోయినా, పైకి కనిపించని నిర్బంధం పెట్టుబడి దారీ విధానంలో ఉంటుంది. అది లేకుండా ఇక్కడ ఉత్పత్తి సాధ్యం కాదు. ఇటువంటి పైకి కనిపించని నిర్బంధం అమలు కావాలంటే పెట్టుబడిదారీ విధానంలో ఒక ”లోపలి” భాగం, మరొక ”వెలుపలి” భాగం అనేవి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ ”వెలుపలి” భాగంలో పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉండాలంటే పనుల్లో కుదురుకున్నవాళ్లు ఎవరైనా సరే, ఆ ”వెలుపలి” భాగంలోకి పోవడానికి భయపడి చావాల్సిందే. ఇలా పెట్టుబడిదారీ విధానంలో ”లోపల, వెలుపల” భాగాలు రెండు ఉండడమనేది దాని మొత్తం లక్షణం. ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్నది కేవలం మార్క్సిజం మాత్రమే. ”వెలుపల” భాగంలో ఉండే ”కార్మికుల రిజర్వు సైన్యం” అనే లక్షణాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థలో తప్పనిసరిగా ఉండే లక్షణంగా గుర్తించింది మార్క్సిజం మాత్రమే. అయితే, మార్క్సిస్టులలో, మార్క్సిస్టు అభిమానులలో సైతం చాలామంది ఈ అంశాన్ని చూడటం లేదు.
పెట్టుబడిదారీ విధానంలో కార్మికుల నిజ వేతనాలు ఎప్పుడూ కనీస స్థాయిలోనే (పొట్ట పోసుకోడానికి చాలిన మేరకు మాత్రమే) ఎందుకు కొనసాగుతూ వుంటాయన్న అంశాన్ని వివరించేదానికోసం మాత్రమే రిజర్వు కార్మిక సైన్యం గురించి వాళ్లు ప్రస్తావిస్తూ వుంటారు. మాల్థస్ అనే సామాజికవేత్త ఈ విధంగా వాదించాడు: శ్రామికుల నిజ వేతనాలు గనుక కనీస అవసరాల స్థాయిని మించి ఎక్కువగా ఉంటే అప్పుడు కార్మికులు ఎక్కువమంది సంతానాన్ని కనేందుకు తయారౌతారని, దాని వలన పనులు చేయడానికి సిద్ధమయ్యేవారి సంఖ్య స్వల్ప కాలంలోనే బాగా పెరిగి పోతుందని, అప్పుడు తిరిగి కార్మికుల నిజవేతనాల స్థాయి కనీస స్థాయికి పడిపోతుందని మాల్థస్ చెప్పాడు. రికార్డో ఈ వాదననే స్వీకరించాడు. కాని మార్క్స్ మాల్థస్ సిద్ధాంతం ”మానవ జాతినే అపఖ్యాతిపాలు చేసేది”గా విమర్శిస్తూ దాన్ని తిరస్కరించాడు. మాల్థస్ సిద్ధాంతానికి బదులు మార్క్స్ తన ”రిజర్వు కార్మిక సైన్యం” భావనను ముందుకు తెచ్చాడని సాధారణంగా భావిస్తారు.
అయితే, ఇలా భావించడం అంటే మార్క్స్‌ను అసంపూర్ణంగా అర్థం చేసుకోవడమే. కార్మికుల వేతనాలను చారిత్రికంగా కనీస జీవన భృతి స్థాయికే పరిమితం చేయడంలో ”రిజర్వు కార్మిక సైన్యం” పాత్ర పోషిస్తుందన్నది వాస్తవం. కాని దాని పాత్ర అంతవరకే పరిమితం కాదు. ఈ రిజర్వు కార్మిక సైన్యం అనేది లేకపోతే పెట్టుబడిదారీ విధానంలో ఉత్పత్తిలో క్రమశిక్షణను అమలు చేయడంగాని, పెట్టుబడిదారీ పద్ధతిలో ఉత్పత్తిని చేపట్టడం కాని సాధ్యం కానేకాదు. కాని ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతాలన్నీ పెట్టుబడిదారీ విధానాన్ని ఒక స్వయం సంపూర్ణమైన వ్యవస్థగా పరిగణిస్తాయి. మార్కెట్లు గనుక స్వేచ్ఛగా వ్యవహరించడానికి సాధ్యమైతే అప్పుడు ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలూ పూర్తిగా వినియోగంలోకి వస్తాయని ఆ సిద్ధాంతాలు భావిస్తాయి. ఈ ప్రధాన స్రవంతి ఆర్థిక సిద్ధాంతానికి కీన్స్ ప్రతిపాదించినది కొంత భిన్నంగా ఉంటుంది. పెట్టుబడిదారీ విధానాన్ని స్వయం సంపూర్ణమైనదిగానే కీన్స్ కూడా పరిగణిస్తాడు. అయితే, అందులో ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలూ పూర్తిగా రంగంలోకి వచ్చి పూర్తిస్థాయిలో ఉపాధి అందరికీ అభించాలంటే మార్కెట్ నడకలో ప్రభుత్వం జోక్యం ఉండాలని కీన్స్ సూచించాడు.
మార్క్సిస్టు సిద్ధాంతం మినహా తక్కిన ఆర్థిక సిద్ధాంతాలు రకరకాలుగా ఉన్నా, అవన్నీ పెట్టుబడిదారీ విధానపు ”లోపలి” భాగాన్ని మాత్రమే చూస్తాయి తప్ప దాని ”వెలుపలి” భాగాన్ని చూడవు. అసలు అటువంటి ఒక ”వెలుపలి” భాగం అవసరం ఉందన్న అంశాన్ని కూడా అవి గుర్తించవు. నిరుద్యోగులు, పాక్షిక నిరుద్యోగులు, ప్రచ్ఛన్న నిరుద్యోగులు- ఇలా రక రకాలుగా పోగుబడే ”వెలుపలి” భాగం ఉద్యోగాలలో ఉన్న కార్మికులలో తాము గనుక పెట్టుబడిదారీ క్రమశిక్షణకు లోబడి వుండకపోతే ఏ గతి పడుతుందో అన్న భయాన్ని కలిగించి విధేయులుగా వ్యవహరించేట్టు చేస్తుంది. అందుచేత ఈ ”వెలుపలి” భాగం అనేది పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి అత్యంత అవసరం. మరి ఇంత ముఖ్యమైన అంశాన్ని ”ప్రధాన స్రవంతి” ఆర్థిక సిద్ధాంతవేత్తలు గుర్తించకపోడానికి కారణం ఏమిటి? వాళ్లు ఉత్పత్తిని ఉత్పత్తిగా, ఒక క్రమంగా చూడకుండా, అది మారకం అనే ప్రక్రియకు ఒక కొనసాగింపుగా మాత్రమే చూస్తారు. మార్కెట్‌లో జరిగే మారకం మీదనే వారి దృష్టి అంతా కేంద్రీకరించబడి వుంటుంది. వారి విశ్లేషణ అక్కడితోనే ఆగిపోతుంది.
పెట్టుబడిదారుడు ఆ మార్కెట్‌లో ముడిసరు కులను, శ్రమశక్తిని కొన్న తర్వాత వాటిని వెంట బెట్టుకుని ఫ్యాక్టరీ ఆవరణలోకి ప్రవేశించాక ఏం జరుగుతుంది అన్నది వారి దృష్టిలో ఉండనే వుండదు. అందు చేత వారు ఉత్పత్తి అనేదానిని ఒక ఊహాజనిత ప్రాతిపదికన మాత్రమే అవగాహన చేసుకోగలుగుతారు. ఆ ఫ్యాక్టరీ లోని ప్రతీ కార్మికుడూ వారి దృష్టిలో మహా అయితే ఒక్కో చేతివృత్తి నిపుణుడి వంటివాడే అవుతాడు. అందుచేత ఆ కార్మికుడిమీద క్రమశిక్షణ పద్ధతులను రుద్దవలసిన అవసరాన్ని వారు గుర్తించరు. అందుచేత పెట్టుబడిదారీ ఆర్థిక సిద్ధాంతాలన్నీ ఈ విషయంలో లోపభూ యిష్టంగానే ఉంటాయి. పెట్టుబడిదారీ విధానంలోని పలు లోపాలను ఎత్తి చూపి సహేతుకమైన విమర్శలు చేసినప్పటికీ, కీన్స్ సిద్ధాంతం కూడా ఈ విషయంలో లోటుగానే ఉంది.
ఈ రిజర్వు కార్మిక సైన్యం ఉండటం అనేదాని పర్యవసా నాలు చాలా ఉంటాయి. ఉత్పత్తి క్రమశిక్షణా యుతంగా కొనసాగడానికి తోడ్పడం, నిజవేతనాలను కనీస స్థాయికే పరిమితం చేయడంతోబాటు, మార్కెట్‌లో తమ శ్రమను అమ్ము కునే వారిగా కార్మికులు తమ శ్రమకు తగినంత, ఎక్కువ వేతనాలను డిమాండ్ చేయగల స్థితిలో ఎన్నడూ ఉండకుండా చూస్తుంది.
దాంతో వారి నిజవేతనాలు దిగజారిపోతూ వుంటాయి. ఈ రిజర్వు కార్మిక సైన్యం అనేది లేకుండా పోతే అప్పుడు వెంటనే పెట్టుబడిదారీ వ్యవస్థ దానంతట అదే కుప్పకూలుతుందని మాత్రం దీనర్ధం కాదు. కాని నిరుద్యోగం అనేది లేకుండాపోతే ఎక్కువ కాలం పాటు ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగడం మాత్రం సాధ్యం కాదు. దీనిని బట్టి మౌలికంగా మనం గ్రహించాల్సిదేమంటే పెట్టుబడిదారీ విధానం ఉన్నంతకాలమూ పూర్తిస్థాయిలో అందరికీ ఉపాధి కల్పించడం అనేది అసాధ్యం. ప్రభుత్వాల జోక్యంతో మార్కెట్‌లలో డిమాండ్‌ను తగువిధంగా పెంచడం ద్వారా అందరికీ ఉపాధి కల్పించడం పెట్టుబడిదారీ వ్యవస్థలో సాధ్యమే అని చెప్పిన కీన్స్ సిద్ధాంతం ఒక గారడీ మాత్రమే. స్థూల డిమాండ్ తగినంతగా లేకపోవడం వల్లనే నిరుద్యోగం ఏర్పడుతుందని కీన్స్ భావించినందువల్లే అతడు డిమాండ్‌ను ప్రభుత్వ జోక్యంతో సర్దుబాటు చేసి నిరుద్యోగాన్ని పెట్టుబడిదారీ విధానం పరిధిలోనే పరిష్కరించవచ్చునని భావించాడు.
కీన్స్ వాదన ఆచరణలో తేలిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం అనంతర కాలంలో కీన్స్ సిద్ధాంతాన్ని అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో ఆచరించారు. కార్మికులకు అక్కడ చెల్లించే జీతాల్లో వచ్చిన పెరుగుదల, దానితోబాటు అక్కడ నిరుద్యోగం నామమాత్రంగా ఆ కాలంలో ఉండడంతో 1968 నాటికి ద్రవ్యో ల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దానికి ముడిసరు కుల ధరల పెరుగుదల తోడైంది. రీగన్, థాచర్ ల హయాం వచ్చాక వాళ్ళు కీన్స్ డిమాండ్ మేనేజిమెంటు విధానాలకు స్వస్తి చెప్పారు. మళ్లీ భారీగా నిరుద్యోగాన్ని పెంచడానికి దోహదం చేశారు. అంటే పెట్టుబడిదారీ విధానంలో పూర్తి స్థాయి ఉపాధి కల్పన ఏ విధంగా సాధ్యం కాదో, అదే విధంగా పెట్టు బడిదారీ విధానం ఒక సంక్షేమ రాజ్యంగా కొనసాగడమూ అసాధ్యమే. సంక్షేమ విధానాలు అమలౌతూవుంటే అప్పుడు నిరాధారంగా ఉండే ”రిజర్వు సైన్యం” పరిస్థితి మరీ అంత దుర్భరంగా ఉండదు. అందుచేత తన ఉద్యోగం పోతుందన్న భయం కార్మికుడికి కూడా అంత తీవ్రంగా ఉండదు. అందుచేత పని ప్రదేశంలో క్రమశిక్షణ దెబ్బ తింటుంది. దానితోబాటు తమకు హెచ్చు వేతనాలు కావాలని బేరసారాలాడే శక్తి కార్మికులకు సంక్షేమ రాజ్యంలో పెరుగుతుంది.
ఇచ్చిన వేతనాన్ని మారుమాట్లాడకుండా అంగీకరించే స్థితిలో వారు అప్పుడు ఉండరు. అందుచేత ఎప్పుడైనా కొంత కాలం పాటు అటువంటి సంక్షేమ విధానాలు కొనసాగవచ్చు తప్ప పెట్టుబడిదారీ వర్గం వాటిని ఎప్పుడూ దెబ్బ తీస్తూనే వుంటుంది. యాభై,అరవై దశకాల్లో ఈ సంక్షేమ విధానాలు అమలౌతున్న కాలంలో ”పెట్టుబడిదారీ విధానం స్వభావం గాని మారిపోయిందా?” అన్న విధంగా కొంత చర్చ జరుగుతూ వుండేది. అది తన కొల్లగొట్టే స్వభావాన్ని మార్చుకుని సమాజ సంక్షేమం గురించి పాటుపడే లక్షణాన్ని సంతరించుకుందే మోనని కొందరు విశ్వసించారు కూడా. కాని నయా ఉదారవాద విధానాలు అమలులోకి వచ్చాక సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లోని కార్మికుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. పెట్టుబడిదారీ విధానపు స్వభావాన్ని మార్చి దాన్ని సంస్కరించాలని, దానిని మానవీయంగా తీర్చిదిద్దాలని చేసిన అన్ని రకాల ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఈ వ్యవస్థ కన్నా మానవీయంగా ఉండే వ్యవస్థ కావాలంటే ముందు ఈ పెట్టుబడిదారీ విధానాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిందే. అప్పుడు రూపొందే వ్యవస్థలో ఉత్పత్తి సాధనాలన్నీ సమిష్టి, సామాజిక యాజమాన్యం కింద ఉండాల్సిందే.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్



