Thursday, December 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఫిరాయింపుల పితలాటకం

ఫిరాయింపుల పితలాటకం

- Advertisement -

‘రాజకీయమంటే రాద్ధాంతం కాదు.. సిద్ధాంతం…’ అన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌. కానీ ఇప్పుడు సిద్ధాంతాలు పక్కకుపోయి, రాద్ధాంతాలే ముందుకొస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులు యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌… పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి తాజాగా తన తీర్పును వెలువరించటంతో ఫిరాయింపుల ప్రహసనం మరోసారి తెరపైకొచ్చింది. అసలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి..? ఆనాడు విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్‌ఎస్‌… నేడు అదే విషయమై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. తమ పార్టీలో గెలిచి, అధికార హస్తం పార్టీకి అంటగాకుతున్నారంటూ పలువురు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటేయాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అటు తిరిగి, ఇటు తిరిగి బంతి మళ్లీ శాసనసభాపతి కోర్టుకే చేరింది. సర్వోన్నత న్యాయ స్థానం గురువారం తుది గడువు విధించటంతో స్పీకర్‌ బుధవారం తన తీర్పును వెలువరించారు. ‘వారు పార్టీ మారారని చెప్పటానికి ఎలాంటి ఆధారాల్లేవ్‌…’ అంటూ ప్రధాన ప్రతిపక్షం వేసిన పిటిషన్లను కొట్టిపారేశారు. మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్‌పై ఆయన గురువారం తన తీర్పును వెలువరించనున్నారు.

ఇదంతా ఇప్పటిదాకా జరిగిన, జరుగుతున్న తతంగం. ఇందులో సాంకేతిక, న్యాయ పరమైన అంశాలను పక్కనబెడితే… అసలు మన రాజకీయ వ్యవస్థ ఎటుపోతోందంటూ ఆవేదన చెందక తప్పదు. సరళీకరణ ఆర్థిక విధానాలు దేశంలో అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో విలువలు వలువల్లాగా ఊడిపోతున్నాయి. పాలిటిక్స్‌, బిజినెస్‌ మిక్సయిపోయి ‘క్విడ్‌ ప్రోకో’… అంటే నాకిది, నీకది అనే చందంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. 1991 కంటే ముందు వ్యాపార, పారిశ్రామికవేత్తలు తెరవెనకుండి ‘తతంగం’ నడిపించేవారు. తమకు అనుకూలమైన రాజకీయ నేతలకు ఫండింగ్‌ ఇచ్చి.. వారిని తమ ప్రతినిధిగా చట్టసభలకు పంపి, తమ ప్రయోజనాలను కాపాడుకునేవారు. కానీ గత పాతికేండ్ల నుంచి వారు మరింత దూకుడుగా వ్యవహరిస్తూ, నాలుగడుగులు ముందుకేసి, ఏకంగా తామే రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తుండటం పరిపాటిగా మారింది. ఎన్నికల్లో గెలవటం కోసం వ్యాపారాల్లో అక్రమంగా సంపాదించిన డబ్బును కుమ్మరిం చటం, అప్పనంగా వచ్చిన సొమ్మును కాపాడుకోవటం కోసం మళ్లీ రాజకీయాలను వాడుకోవటమనేది మారిన ‘పాలిట్రిక్స్‌ ట్రెండ్‌’కు నిదర్శనం.

దీనిపై ఎవరైనా నిలదీస్తే…’అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం…’ అని సమాధానం చెప్పటం, రివాజుగా మారటమనేది దిగజారిన రాజకీయ విలువలకు పరాకాష్ట. వారు, వీరు అనే తేడా లేకుండా పాలక పార్టీలన్నీ వీటిని ప్రోత్సహిస్తుండటంతో ‘పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం’ నివ్వెరబోతోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ప్రజలు, వారేసే ఓట్లు, ప్రజాభిప్రాయమనేవి గంగలో కలిసిపోతుండటం అత్యంత విషాదకరం. ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒక పార్టీకి చెందిన అభ్యర్థిని ఏ కారణం చేతనో ప్రజలు వ్యతిరేకించి, ఇంకొకర్ని గెలిపిస్తే, ఆ గెలిచిన వ్యక్తి, ప్రజాభిప్రాయానికి భిన్నంగా జనాలు వ్యతిరేకించిన పార్టీలోనే చేరితే.. ఇక ఎన్నికల వ్యవస్థకు అర్థమేముంది? అసలు ఇంత ఖర్చుపెట్టి ఎలక్షన్లను నిర్వహించాల్సిన అవసరమేంటి? అనే సందేహాలు వెల్లువెత్తకమానవు. ‘ఏ పార్టీ నుంచి గెలిచి, సర్పంచు అయినా, చివరకు పనుల కోసం మా వద్దకు రావాల్సిందే, మా కండువా కప్పుకోవాల్సిందే…’ అంటూ గతంలో బీఆర్‌ఎస్‌, తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

‘అందుగలడిందుగలడనే సందేహము వలదు…’ అన్నట్టు ఈ ఫిరాయింపులు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా సర్వాంతర్యామి అయిపోయాయి. అందుకే మన దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేసి.. దామాషా పద్ధతిన ఎలక్షన్లు జరపాలంటూ మేధావులు, సామాజిక వేత్తలు కోరుతున్నారు. దీనిపై ప్రజల్లో చర్చ జరగాలి. వారిలో చైతన్యం రావాలి.. అప్పుడే మార్పు సాధ్యం.
ఇక్కడ తెలంగాణ వచ్చిన కొత్తలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేయాల్సిన అవసరముంది. ఆనాటి అధికార బీఆర్‌ఎస్‌.. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోవటానికి ‘ఆకర్షణ’ మంత్రం వేసింది. గులాబీ పార్టీ వేసిన ఆ గాలానికి నాటి ప్రధాన ప్రతిపక్షం కకావికలమైంది. నేటి ఉప ముఖ్యమంత్రి, నాటి సీఎల్‌పీ లీడర్‌ భట్టి విక్రమార్క.. ప్రతిపక్ష నేత హోదాను సైతం కోల్పోవాల్సి వచ్చింది. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నుంచి అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు ‘కారె’క్కారు. కానీ ఒకే ఒక్కడు…’నువ్వు ముఖ్యమంత్రి పదవినిచ్చినా నేను మాత్రం పార్టీ మారేది లేదు…’ అని తెగేసి చెప్పారు. ఆయన మరెవరో కాదు.. సీపీఐ(ఎం) సీనియర్‌ ఎమ్మెల్యే సున్నం రాజయ్య. రాజకీయ విలువలకు, సిద్ధాంత నిబద్ధతకు ఇదీ అసలు సిసలు రూపం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -