వ్యతిరేకించిన ప్రతిపక్షాలు..ఆందోళన
విస్తృత పరిశీలనకు పంపాలని డిమాండ్
తిరస్కరించిన అధికార పక్షం
బీమా రంగంలో వందశాతం ఎఫ్‌డీఐ బిల్లు కూడా..
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు ఉభయ సభల్లో మూడు కీలక బిల్లులను కేంద్రం ఆమోదించింది. ఉపాధి హామీ చట్టం – 2005 సవరణ, వీబీ జీ రామ్ జీ బిల్లు, పౌర అణుశక్తి రంగాన్ని ప్రయివేటీకరించే శాంతి బిల్లులను బుధవారం ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే అధికార పక్షం ఆమోదింపజేసుకుంది. రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ను అనుమతిస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుల ఆమోద సమయంలో కేంద్రంపై నిరసన తెలుపుతూ ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ‘ఉపాధి’ సవరణ బిల్లుపై కేంద్రం మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్చకు ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లుతో గ్రామీణ ఉపాధి రంగం కుదేలవుతుందని, వలసలు పెరిగి గ్రామీణాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుందని విమర్శించారు. వీటితో పాటు రాష్ట్రాలపై అదనపు భారం కూడా పడుతుందని నొక్కి చెప్పారు.
ఈ బిల్లును విస్తృత పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ), సెలక్ట్ కమిటీలకు పంపాలని వారు డిమాండ్ చేశారు. పౌర అణుశక్తి బిల్లుపై ఆ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు ప్రవేశపెట్టగా ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ రంగం ప్రయివేటు గుత్తాధిపత్యానికి వెళ్తుందని, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ వంటి కార్పొరేట్లకు లాభం, జాతీయ భద్రకు ముప్పు వాటిల్లుతుందని ధ్వజమెత్తాయి. ఈ బిల్లును కూడా జేపీసీకి పంపాలని డిమాండ్ చేశాయి. ఈ డిమాండ్‌ను తిరస్కరించిన కేంద్రం, తనకున్న సంఖ్యా బలంతో ఏకపక్షంగా ఆమోదించుకుంది.
మరో వైపు రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ బిల్లును చర్చకు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు దేశ బీమా రంగాన్ని చిన్నాభిన్నం చేస్తుందని, ఈ రంగంపై విదేశీ శక్తుల ఆధిపత్యం పెరుగుతుందని ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకించారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలగడంతో పాటు ఎల్‌ఐసీ వంటి కోట్లాది మంది పాలసీదారులున్న సంస్థలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వాడుకలో లేని 71 చట్టాల రద్దు లేదా సవరణకు సంబంధించిన బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగానే మిగిలిన బిల్లుల తరహాలోనే ఆమోదించుకున్నారు. ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు చేసిన డిమాండ్లను తిరస్కరిస్తూనే కేంద్రం ఏకపక్షంగా తన సంఖ్యా బలంతో బిల్లులను ఆమోదించుకుంది.
పార్లమెంటులో మూడు కీలక బిల్లుల ఆమోదం
- Advertisement -
- Advertisement -



