Thursday, December 18, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంచమురు ట్యాంకర్ల దిగ్బంధం

చమురు ట్యాంకర్ల దిగ్బంధం

- Advertisement -

వెనిజులాపై మరిన్ని చర్యలకు తెగబడిన అమెరికా
మదురోపై విషం చిమ్మిన ట్రంప్‌


కారకాస్‌ : ఆంక్షల నడుమ వెనిజులాకు రాకపోకలు సాగిస్తున్న చమురు ట్యాంకర్లను పూర్తి స్థాయిలో దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్‌ సోషల్‌ వేదికలో ఓ పోస్ట్‌ పెట్టారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోపై ఆయన మరోసారి విషం చిమ్ముతూ దొంగిలించిన చమురు సంపదను ఉపయోగిస్తూ నేరాలు, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘వెనిజులాను యుద్ధ నౌకలు పూర్తిగా చుట్టుముట్టాయి. దక్షిణ అమెరికాలో మునుపెన్నడూ ఈ విధంగా మోహరింపు జరగలేదు’ అని తెలిపారు. అమెరికా చమురును, భూమిని, ఇతర ఆస్తులను వెనిజులా తిరిగి ఇవ్వని పక్షంలో ఈ మోహరింపు మరింత పెరుగుతుందని హెచ్చరించారు.

వెనిజులియన్లను తిప్పిపంపుతాం
ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఆంక్షలను ఎదుర్కొంటూ వెనిజులాకు రాకపోకలు సాగిస్తున్న చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు అడ్డుకుంటాయి. అయితే ఎన్ని దిగ్బంధాలు ఉంటాయి, మిత్ర దేశాలు కూడా ఇందులో భాగస్వాములవుతాయా అన్నది ఆయన వివరించలేదు. ట్రంప్‌ తన తాజా చర్యను ఇమ్మిగ్రేషన్‌తో ముడిపెట్టారు. బైడెన్‌ ప్రభుత్వ హయాంలో అమెరికాలో ప్రవేశించిన వెనిజులా ప్రజలను త్వరితగతిన తిప్పి పంపుతామని చెప్పారు.

కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు
వెనిజులాపై అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకొస్తున్నాయి. అమెరికా సైన్యం ఇప్పటికే కరేబియన్‌లోనూ, వెనిజులా జలాల సమీపంలోనూ పెద్ద ఎత్తున మోహరించింది. ఆ ప్రాంతంలో ఉన్న యుద్ధ నౌకలు అదును కోసం వేచి చూస్తున్నాయి. మరోవైపు గగనతల నిఘా కూడా కొనసాగుతోంది. మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్నాయన్న కారణంతో అనేక ఓడలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఈ వారం ప్రారంభంలో వెనిజులా తీరం సమీపంలో ఓ చమురు ట్యాంకర్‌పై అమెరికా దాడి చేసి దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. అయితే ఈ చర్యలన్నీ తనను పదవీచ్యుతుడిని చేయడాని కేనని మదురో తెలిపారు. అమెరికా దాడులపై మౌనం వహిస్తున్న ఐరాసపై ఆయన మండిపడ్డారు.

ఆ వీడియోను విడుదల చేయం పీట్‌ హెగ్‌సేథ్‌
కరేబియన్‌లో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న పడవపై గతంలో జరిపిన దాడిని చిత్రీకరించిన ఎడిట్‌ చేయని వీడియోను విడుదల చేయబోమని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్‌సేథ్‌ స్పష్టం చేశారు. ప్రతినిధి సభ, సెనెట్‌లకు చెందిన సాయుధ సర్వీసుల కమిటీలకు వీడియో ఫుటేజ్‌ చూపుతామని, అంతేతప్ప ప్రజలకు దానిని బహిర్గతం చేయబోమని అన్నారు. ‘ఒక పెద్ద రహస్యాన్ని, పూర్తి, ఎడిట్‌ చేయని వీడియోని విడుదల చేయం. అది కూడా ప్రజలకు’ అని తెలిపారు. తూర్పు పసిఫిక్‌ సముద్రంలో మాదక ద్రవ్యాలను రవాణా చేస్తున్న మూడు పడవలపై సోమవారం దాడి చేశామని, ఎనిమిది మందిని మట్టుపెట్టామని అన్నారు. కాగా కరేబియన్‌, తూర్పు పసిఫిక్‌లోని అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఓడలపై ఇప్పటి వరకూ జరిపిన ఇరవై ఐదు దాడుల్లో కనీసం 95 మంది మరణించారని అమెరికా అధికారులు తెలిపారు.

మదురో ప్రభుత్వంపై అక్కసు
మదురో ప్రభుత్వాన్ని తాము ఒక ‘విదేశీ ఉగ్రవాద సంస్థ’గా పరిగణిస్తున్నామని ట్రంప్‌ తెలిపారు. ఆ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను రవాణా చేస్తోందని, కిడ్నాపులకు పాల్పడుతోందని, మనుషులను స్మగ్లింగ్‌ చేస్తోందని, హింసకు తెగబడుతోందని ఆరోపించారు. వెనిజులా క్షేత్రాల నుంచి దొంగిలించిన చమురుతో సంపాదించిన సొమ్మును మాదక ద్రవ్యాల ఉగ్రవాదానికి వినియోగిస్తోందని ధ్వజమెత్తారు. ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దొంగతనాన్ని, నేరపూరిత కార్యకలాపాలను అమెరికా ఇంకెంత మాత్రం సహించబోదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -