Thursday, December 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంషాహీ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

షాహీ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

కార్మిక మంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవాలి
లేకపోతే జాగృతి పోరాటం : కల్వకుంట్ల కవిత


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
నాచారంలోని షాహీ ఎక్స్‌పోర్ట్‌ కంపెనీలో ధర్నా చేస్తున్న కార్మికులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కార్మికులు కవితను కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కార్మికుల పోరాటం స్ఫూర్తిదాయకమనీ, అలాగే కొనసాగించాలని సూచించారు. లేబర్‌ కమిషనర్‌ స్పందించాలని కోరారు. కార్మిక మంత్రి వివేక్‌ వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తొమ్మిదేండ్లుగా ఆ కార్మికుల జీతాలు పెరగలేదనీ, కార్మిక చట్టాలు అమలు కావటం లేదనీ, కరువు భత్యం ఇవ్వటం లేదని ఆమె విమర్శించారు. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించాలనీ, లేనిపక్షంలో మహిళా కార్మికులు, ఇతర కార్మిక సంఘాలతో కలిసి జాగృతి లేబర్‌ చట్టాల అమలు కోసం పోరాడుతుందని హెచ్చరించారు. అక్కడ పని చేస్తున్న 2,500 మంది మహిళలకు న్యాయం చేయాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు.

గురుకుల విద్యార్థులను కాపాడండి
గురుకులాల్లో విద్యార్థులు బలికాకుండా వారిని కాపాడాలని కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. సర్కారు నిర్లక్ష్యంగా ఆరోగ్యం విషమించిన తర్వాత హైదరాబాద్‌కు తరలించడంతో నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌ ఎస్సీ గురుకులంలో 8వ తరగతి విద్యార్థినీ సాయి లిఖిత ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వంద మంది విద్యార్థులు మరణించినా, నిత్యం ఫుడ్‌ పాయిజన్‌తో వందల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. మరో విద్యార్థి చనిపోకముందే చర్యలు తీసుకోవాలనీ, సాయి లిఖిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.

సర్పంచ్‌లకు సన్మానం
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచిన తెలంగాణ జాగృతి నాయకులను కల్వకుంట్ల కవిత సన్మానించారు. నిజామాబాద్‌ జిల్లాలో సర్పంచ్‌లుగా గెలిచిన పలువురు జాగృతి నాయకులు బుధవారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో కవితను మర్యాద పూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా వారిని కవిత వారిని అభినందించారు.

రాజు వెడ్స్‌ రాంబాయి మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు
రాజు వెడ్స్‌ రాంబాయి మూవీ టీమ్‌కు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆ సినిమా నిర్మాత వేణు ఉడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, ప్రజెంటర్‌ పూజారి నాగేశ్వర్‌ రావు, లిరిక్‌ రైటర్‌ మిట్టపల్లి సురేందర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేశ్‌ బొబ్బిలి, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మురళీ పున్న తదితరులు ఆమెను కలిశారు. మూవీ టీమ్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -