వివరాల్ని వెబ్‌సైట్‌లో పెట్టాలి
అభ్యంతరాలను చెప్పేందుకు 2 రోజుల గడువు పెంపు
హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంపుదల చేస్తూ వెలువడిన ప్రాధమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన పలు పిటిషన్లను విచారించిన హైకోర్టు మధ్యంతర ఆదేశాల జారీకి నిరాకరించింది. ఆ ప్రక్రియలో జోక్యానికి నిరాకరించింది. అయితే, వార్డుల విభజన, జనాభా లెక్కలు, వార్డు మ్యాప్‌లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు అధికారులను ఆదేశించింది. 24 గంటల్లోగా పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలంది. వాటిని పరిశీలించే ప్రజలు, పిటిషనర్లు అభ్యంతరాలు చెప్పేందుకు మరో రెండు రోజుల గడువు ఇవ్వాలని ఆదేశించింది ఈ ఆదేశాలతో అభ్యంతరాలను తెలియజేసేందుకు ఈనెల 17తో ముగియనున్న గడువు పొడిగింపు జరుగుతుంది. పలు లంచ్‌మోషన్ పిటిషన్లపై జస్టిస్ విజరుసేన్‌రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ సమీపంలోని మున్సిపాల్టీలు, గ్రామాలను జీహెచ్‌ఎంసీ పరిధిలోకి తీసుకొచ్చి డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంపు చేయడం ఏకపక్షమంటూ నాగేంద్ర ప్రకాష్ రెడ్డి ఇతరులు లంచ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.
కొత్త డివిజన్ల ఏర్పాటుకు డిసెంబర్ 5న కమిషనర్‌కు నివేదిక అందిందని, మరో 4 రోజులకే ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడిందని, జీహెచ్‌ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల ప్రస్తుత విస్తీర?ం 2000 చదరపు కిలోమీటర్లకు పెంపునకు తీసుకున్న సమాచారం బహిర్గతం కాలేదన్నారు. డివిజన్లల్లో జనాభా సంఖ్యలో అనూహ్యమైన తేడాలున్నాయన్నారు. డివిజన్ల మ్యాప్‌లు అందుబాటులో లేవని, డివిజన్ల వారీగా జనాభా అందుబాటులో లేదన్నారు. ఈ వాదలను ఏజీ సుదర్శన్‌రెడ్డి వ్యతిరేకించారు. చట్ట నిబంధనల మేరకే అంతా జరిగిందన్నారు. వాదనలపై న్యాయమూర్తి.. వార్డుల విభజన ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించారు. స్టే ఆదేశాలు ఇవ్వబోమన్నారు. అయితే, వార్డుల విభజనలో పారదర్శకత అవసరమని చెప్పారు. వార్డుల వారీగా జనాభా వివరాలు, మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. ఆ తరువాత ప్రజలు, పిటిషనర్లు అభ్యంతరాలు చెప్పేందుకు రెండు రోజుల గడువు ఇవ్వాలని కూడా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.



