ఎపిఇఆర్‌సికి డిస్కమ్‌ల సమాధానం
పిఎం కుసుమ్ ప్రాజెక్టులకు టారీఫ్ నిర్ధారించిన కమిషన్
రూ.3.19 వరకు ఎపిఇఆర్‌సి అనుమతి ఉత్తర్వులు
అమరావతి : అడ్డగోలుగా చేసుకుంటున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పిపిఎ)లో మిగులు విద్యుత్ ఉంటే బహిరంగ మార్కెట్‌లో వాటిని అమ్ముతామని విద్యుత్ పంపిణీ సంస్థలు.. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి)కి సమాధానం చెప్పాయి. మిగులు విద్యుత్‌లో ఉన్న డిస్కమ్‌లు ఇప్పటికే సెకీతో ఒప్పందాన్ని చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు ఇటీవల పిఎం కుసుమ్ కింద 3,725 మెగావాట్లకు పిపిఎలకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఇటీవల 1,162.8 మెగావాట్లకు బహిరంగ విచారణ నిర్వహించిన ఎపిఇఆర్‌సి 22 ప్రాజెక్టులకు టారీఫ్‌ను నిర్ధారిస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ ఒప్పందం వెనుక జరిగిన కొన్ని అంశాలను ఎపిఇఆర్‌సి ఉత్తర్వుల్లో పేర్కొంది. సెకీ నుంచి యూనిట్ రూ.2.49 చొప్పున ఇప్పటికే 7 వేల మెగావాట్లకు రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌లు ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావించింది. సెకీ, పిఎం కుసుమ్ ఒప్పందాల వల్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యే సమయంలో మిగులు విద్యుత్ ఉంటుందని, దీనిని ఏం చేస్తారని ప్రశ్నించింది. సెకీ 7 వేల మెగావాట్ల ఒప్పందం 2025 జూన్ నుంచి 2029 మధ్య అమల్లోకి వస్తుందని సమాధానం చెప్పిన డిస్కమ్‌లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బెస్) ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నామని తెలిపాయి. అదేవిధంగా 7,500 మెగావాట్లకు ఎపి జెన్‌కో.. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో స్టేషన్లు (పిఎస్‌హెచ్‌పి) అభివృద్ధి చేస్తుందని పేర్కొన్నాయి. సెకీ, ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రాజెక్టు వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్ పిఎస్‌హెచ్‌పి ప్రాజెక్టులకు ఉపయోగపడుతుందని పొందుపరిచాయి.
అనివార్యంగా మిగులు విద్యుత్ ఉంటే దానిని విద్యుత్ మార్కెట్‌లో విక్రయిస్తామని సమాధానం చెప్పాయి. సోలార్ ఉత్పత్తి అయ్యే సమయంలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ ధర రూ.2.50లోపే దొరుకుతుంది. ఇలాంటి సమయంలో పిపిఎలు చేసుకోవాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఫీడర్ లెవల్ సోలారైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఎస్)లో భాగంగా ఎపిఎస్‌పిడిసిఎల్ పరిధిలో 751 మెగావాట్లు, ఎపిసిపిడిసిఎల్ పరిధిలో 191.5 మెగావాట్లు, ఎపిఇపిడిసిఎల్ పరిధిలో 220.30 మెగావాట్ల చొప్పున కేటాయించింది. మొత్తం 22 ప్రాజెక్టులకు యూనిట్‌కు రూ.3.2 నుంచి రూ.3.19 వరకూ టారీఫ్‌ను నిర్ధారించింది. ఈ 22 ప్రాజెక్టుల పరిధిలో 2,93,587 వ్యవసాయ పంపుసెట్లు ఉంటాయని పేర్కొంది. మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎకోరన్, ఐ సోలార్ టెక్నాలజీస్, అర్జున్ ఇన్‌ఫ్రాటెక్, మెహన్ స్పిన్‌టెక్స్, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పరడిగిమ్ ఐటి టెక్నాలజీ, నోవెల్ లాజిస్టిక్స్, సంగమ్మమ్, భవ్య హెల్త్ సర్వీసెస్ కంపెనీలకు ఈ ప్రాజెక్టులను అప్పగించింది. రెండేళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలని పేర్కొంది. 25 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని పేర్కొంది.



