Thursday, December 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపల్లెల తీర్పు కాంగ్రెస్‌ పతనానికి నాంది

పల్లెల తీర్పు కాంగ్రెస్‌ పతనానికి నాంది

- Advertisement -

అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి గెలిచిన బీఆర్‌ఎస్‌ సైనికులకు సలాం
ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై పంచాయతీల్లో మోగించిన జంగ్‌సైరన్‌ : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్‌ పతనానికి నాంది అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె తారక రామారావు (కేటీఆర్‌) తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి గెలిచిన బీఆర్‌ఎస్‌ సైనికులకు శిరస్సు వంచి సలాం చేస్తున్నానని ప్రకటించారు. రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పతనం కాక తప్పదని పేర్కొన్నారు. రెండేండ్లుగా ప్రజలను అన్ని అంశాల్లో మోసం చేసిన అధికార పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ అందరినీ మోసం చేసిందని పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్‌ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. అధికార దుర్వినియోగాన్ని, బలప్రయోగాన్ని, హింసను ఎదుర్కొని భారీగా పంచాయతీలను బీఆర్‌ఎస్‌ గెలిచిందని తెలిపారు. తమ పార్టీకి అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు ప్రకటించారు. రేవంత్‌రెడ్డిని మట్టికరిపించేందుకు తమ పార్టీ శ్రేణులు చేసిన అలుపెరుగని పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాలికి బలపం కట్టుకుని జిల్లాలు తిరిగినా మంత్రులు మోహరించినా సగం సీట్లు సాధించడానికి కాంగ్రెస్‌ తంటాలు పడిందని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షం ఇన్ని పంచాయతీలను గెలవడం చరిత్రలో లేదని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్‌ మోసాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పల్లె ప్రజలు జంగ్‌సైరన్‌ మోగించారని తెలిపారు. రాజకీయ హింసకు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. తమ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్న ప్రతి ఒక్కరికీ భవిష్యత్తులో సమాధానం ఇస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.

మహాపడిపూజలో పాల్గొన్న కేటీఆర్‌
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బుధవారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడిపూజకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరయ్యారు. తలసాని సాయికుమార్‌ యాదవ్‌, సిహెచ్‌ రాకేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, దాసోజు శ్రవణ్‌, ఎమ్మెల్యే సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -