Tuesday, May 20, 2025
Homeజాతీయంసుప్రీంకోర్టును ఆశ్రయించిన అలీ ఖాన్‌

సుప్రీంకోర్టును ఆశ్రయించిన అలీ ఖాన్‌

- Advertisement -

– విచారణకు అంగీకరించిన న్యాయస్థానం
– అరెస్టుపై మండిపడిన ప్రతిపక్షాలు
– విమర్శకులను చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా
న్యూఢిల్లీ:
ఆపరేషన్‌ సిందూర్‌పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనను అరెస్ట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ మహమూదాబాద్‌ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలీ ఖాన్‌ పిటిషన్‌ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవారు నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ మంగళ లేదా బుధవారం ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. దేశభక్తి పూరితమైన ప్రకటనలు చేసినందుకు మహమూదాబాద్‌ను అరెస్ట్‌ చేశారని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. బీజేపీ యువమోర్చా నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా అలీ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. కాగా ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రొఫెసర్‌ను అరెస్ట్‌ చేశారని, ప్రస్తుతం ఆయనను హర్యానాలోని రారు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారని విద్యార్థి పత్రిక ‘ది ఎడిక్ట్‌’ తెలియజేసింది. అలీ ఖాన్‌ అరెస్టుపై విద్యావేత్తలు, పౌర హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిని భావ ప్రకటనా స్వేచ్ఛ అణచివేతగా అభివర్ణించారు. కాగా దేశద్రోహం ఆరోపణలు మోపుతూ ప్రొఫెసర్‌ అలీఖాన్‌ను అరెస్ట్‌ చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. విమర్శకులను చూసి బీజేపీ ఎంత భయపడుతోందో ఈ అరెస్ట్‌ తేటతెల్లం చేస్తోందని ఎద్దేవా చేశాయి. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతదేశంలో మధ్యప్రదేశ్‌ మంత్రి విజరు షా వంటి ద్వేషపూరిత వ్యక్తులు స్వేచ్ఛగా సంచరిస్తుంటే శాంతి కోసం నిలబడే వారిని అరెస్ట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఎందుకింత భయం : ఖర్గే
ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ మహబూదాబాద్‌ను అరెస్ట్‌ చేయడం చూస్తుంటే విమర్శకులంటే బీజేపీ ఎంతగా భయపడుతోందో అర్థమవుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సోమవారం వ్యాఖ్యానించారు. ‘పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన లెఫ్టినెంట్‌ వినరు నర్వాల్‌ భార్య హిమాన్షి ముస్లింలు, కాశ్మీరీలపై ద్వేషపూరిత ప్రచారాన్ని ఖండిస్తే దుర్మార్గంగా ట్రోలింగ్‌ చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో విలేకరులకు సమాచారం అందించిన కల్నల్‌ సోఫియా ఖురేషీని మధ్యప్రదేశ్‌ బీజేపీ నాయకుడు, క్యాబినెట్‌ మంత్రి కున్వర్‌ విజరు షా ఉగ్రవాదుల సోదరిగా అభివర్ణించి అవమానించారు. ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ అరెస్ట్‌ కూడా వీటిలో భాగమే’ అని ఖర్గే ధ్వజమెత్తారు. మన సాయుధ దళాలపై అవమానకరమైన ప్రకటనలు చేసిన మధ్యప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిని తొలగించాల్సింది పోయి బహుళత్వానికి ప్రతినిధ్యం వహించే వారిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని, దేశ సేవలో వృత్తిపరమైన విధులు నిర్వర్తించే వారిని తమ మనుగడకు ముప్పుగా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోందని ఆయన ఆరోపించారు. దేశ ప్రయోజనాల ప్రాధాన్యత దృష్ట్యా సాయుధ దళాలను, ప్రభుత్వాన్ని సమర్ధించడం అంటే తాము సర్కారును ప్రశ్నించలేమని అనుకోవడం పొరబాటని స్పష్టం చేశారు.
విమర్శ దేశభక్తి పూరితమే : ఆర్జేడీ
ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే దేశాన్ని విమర్శించడం కాదని ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ కుమార్‌ అన్నారు. ఇదే విషయాన్ని వంద సార్లు చెబుతామని, అవసరమైతే నిరంతరం చెబుతూనే ఉంటామని చెప్పారు. ప్రభుత్వం అనేది ఎంత శక్తివంతమైనది అయినప్పటికీ అది తాత్కాలికమేనని చురక వేశారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, దాని నాయకులను విమర్శించడం తరచూ దేశభక్తి పూరిత చర్యేనని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చేయాలని, దాని విలువలను నిలబెట్టాలనే కోరికే ఈ విమర్శలకు ప్రేరణ అని అన్నారు. విజరు షా వంటి ద్వేషపూరిత వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే న్యాయం కోసం, శాంతి కోసం పిలుపునిచ్చే వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.
చట్ట ప్రక్రియను ఉల్లంఘిస్తోంది : ఒవైసీ
ప్రొఫెసర్‌ అలీ ఖాన్‌ అరెస్టును మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. అది చట్ట ప్రక్రియను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ‘అభిప్రాయం వ్యక్తం చేసినందుకు లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన పెట్టిన పోస్ట్‌ దేశ వ్యతిరేకమైనదో లేక స్త్రీ ద్వేష పూరితమైనదో కాదు. బీజేపీకి చెందిన ఓ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని హర్యానా పోలీసులు చర్యకు దిగారు’ అని అన్నారు. కేవలం పేరును బట్టి ప్రముఖ విద్యావేత్తను చౌకబారు ఆరోపణలపై అరెస్ట్‌ చేసి జైలులో పెట్టారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ధ్వజమెత్తారు. ఆయన పోస్ట్‌లో అభ్యంతరకరమైనది ఏదీ లేదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -