Friday, December 19, 2025
E-PAPER
Homeఆటలు3-1తో ముగిస్తారా?

3-1తో ముగిస్తారా?

- Advertisement -

భారత్‌, దక్షిణాఫ్రికా ఆఖరు టీ20 నేడు
సిరీస్‌ సమంపై సఫారీల ఆశలు
రాత్రి 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..

భారత్‌, దక్షిణాఫ్రికా ఫైట్‌ ఆఖరు అంకానికి చేరుకుంది. టెస్టుల్లో సఫారీలు 2-0తో కొట్టగా.. వన్డేలో భారత్‌ 2-1తో పంజా విసిరింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1తో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. పొట్టి సిరీస్‌ను నెగ్గలేని సఫారీలు.. కనీసం ట్రోఫీని పంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అహ్మదాబాద్‌లో అదిరే విజయంతో టీ20 సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని భారత్‌ ఎదురుచూస్తుండగా.. సఫారీలు 2-2తో భారత పర్యటనను విజయంవంతంగా ముగించాలని అనుకుంటున్నారు. అహ్మదాబాద్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా ఆఖరు టీ20 పోరు నేడు.

నవతెలంగాణ-అహ్మదాబాద్‌
పొగ మంచు, వాయు కాలుష్యంతో లక్నో టీ20 మ్యాచ్‌ రద్దు కావటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సమయంలో అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్నప్పటికీ మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేయటంపై విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఇప్పుడు 4 నాలుగు మ్యాచ్‌ల షోగా మారింది. సిరీస్‌ను కోల్పోలేని బలమైన స్థితిలో నిలిచిన భారత్‌ నేడు అహ్మదాబాద్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. సంజు శాంసన్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా రాకతో టీమ్‌ ఇండియా మరింత బలోపేతంగా కనిపిస్తోంది. ఆఖరు మ్యాచ్‌లో మెరిసి సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదల సఫారీ శిబిరంలోనూ కనిపిస్తోంది. దీంతో నేడు అహ్మదాబాద్‌లో ఆఖరు పోరు నువ్వా నేనా అన్నట్టు సాగటం ఖాయమే.

సంజు శాంసన్‌ ఆడేనా?
ఓపెనర్‌గా వరుస శతకాలతో చెలరేగిన సంజు శాంసన్‌ను బెంచ్‌కు పరిమితం చేసి, శుభ్‌మన్‌ గిల్‌కు అవకాశాలు ఇవ్వటంపై తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ఈ ఫార్మాట్‌లో గిల్‌ ఆశించిన మేరకు రాణించటం లేదు. కాలు బొటనవేలు గాయానికి గురైన శుభ్‌మన్‌ స్థానంలో తుది జట్టులోకి సంజు శాంసన్‌ను తీసుకునే అవకాశం ఉంది. లక్నో మ్యాచ్‌లోనే సంజు సిద్ధమైనా.. పొగ మంచు కారణంగా ఆట రద్దుగా ముగిసిన సంగతి తెలిసిందే. నేడు అహ్మదాబాద్‌లో సంజు శాంసన్‌ తుది జట్టులో నిలిస్తే అభిషేక్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా రానున్నాడు. ఇక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టును గెలుపు బాటలో నడిపిస్తున్నా.. వ్యక్తిగత ప్రదర్శన మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.

గత ఆక్టోబర్‌ తర్వాత సూర్య నుంచి ఒక్క అర్థ సెంచరీ రాలేదు. 21 ఇన్నింగ్స్‌ల్లో 119.5 స్ట్రయిక్‌రేట్‌తో 239 పరుగులే చేశాడు. జట్టులో సూర్య స్థానంపై ప్రశ్నలు రాకముందే… అహ్మదాబాద్‌ టీ20లో తనదైన ఇన్నింగ్స్‌ ఆడేందుకు మిస్టర్‌ 360 ఎదురుచూస్తున్నాడు. వ్యక్తిగత కారణాలతో గత రెండు మ్యాచ్‌లకు దూరమైన జశ్‌ప్రీత్‌ బుమ్రా.. నేడు సొంతగడ్డపై బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, అర్ష్‌దీప్‌లు కొత్త బంతిని పంచుకోనుండగా.. వరుణ్‌ చక్రవర్తితో కలిసి వాషింగ్టన్‌ సుందర్‌ స్పిన్‌ బాధ్యతలు చూసుకోనున్నాడు. అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్య, జితేశ్‌ శర్మలు నేడు ఆఖరు మ్యాచ్‌లో భారత్‌కు కీలకం కానున్నారు.

సమం చేస్తారా?
భారత పర్యటనలో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన సఫారీలు.. వన్డే సిరీస్‌ను డిసైడర్‌కు తీసుకెళ్లారు. టీ20 సిరీస్‌ను గెల్చుకునే అవకాశాలు లేకపోయినా.. సమం చేసి సగర్వంగా స్వదేశానికి బయల్దేరే అవకాశం మార్‌క్రామ్‌సేన ముంగిట ఉంది. భారత్‌ 2-1తో టీ20 సిరీస్‌లో ఆధిక్యం సాధించింది. చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నెగ్గితే సిరీస్‌ 2-2తో సమం అవుతుంది. లేదంటే సిరీస్‌ టీమ్‌ ఇండియా వశమవుతుంది. క్వింటన్‌ డికాక్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా.. రీజా హెండ్రిక్స్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌, డెవాల్డ్‌ బ్రెవిస్‌, డెవిడ్‌ మిల్లర్‌ వంటి మ్యాచ్‌ విన్నర్లు సఫారీ శిబిరంలో ఉన్నారు. కానీ సమిష్టగా రాణించటంలో బ్యాటింగ్‌ లైనప్‌ తడబాటుకు గురవుతోంది. లుంగి ఎంగిడి, నోకియా, బార్ట్‌మాన్‌లతో కలిసి జార్జ్‌ లిండె బౌలింగ్‌ బాధ్యతలు చూసుకోనున్నాడు.

పిచ్‌, వాతావరణం
అహ్మదాబాద్‌ పిచ్‌పై టాస్‌కు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక్కడ జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లు గణాంకాలు ఆ విషయం స్పష్టం చేస్తున్నాయి. కానీ ఈ మ్యాచ్‌ శీతాకాలంలో జరుగుతుండటంతో పిచ్‌ స్వభావంలో ఏమైనా మార్పులు ఉంటాయేమో చూడాలి. లక్నో తరహాలో అహ్మదాబాద్‌లో పొగ మంచు ప్రమాదం లేదు. వాయు కాలుష్యం సైతం సాధారణ స్థాయిలోనే ఉంటుంది!. పిచ్‌ నుంచి బ్యాటింగ్‌, బౌలింగ్‌కు సమానంగా అనుకూలత ఉంటుంది. దీంతో సిరీస్‌ ఆఖరు మ్యాచ్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా హౌరాహౌరీగా పోటీపడటం ఖాయం. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.

తుది జట్లు (అంచనా):
భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), రీజా హెండ్రిక్స్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌ (కెప్టెన్‌), డెవాల్డ్‌ బ్రెవిస్‌, డెవిడ్‌ మిల్లర్‌, డొనొవాన్‌ ఫెరీరా, మార్కో యాన్సెన్‌, కార్బిన్‌ బాచ్‌, జార్జ్‌ లిండా, ఎన్రిచ్‌ నోకియా, లుంగి ఎంగిడి, బార్ట్‌మాన్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -