– టికెట్ దక్కని ఆశావహుల్లో తీవ్ర నిరాశ
– ఆసిఫాబాద్‌లో ధర్నా.. బోథ్, భైంసాలో నిరసనలు
నవతెలంగాణ-ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ తీవ్ర దుమారం రేపుతోంది. టికెట్టు రాని వారంతా శనివారం ఆసిఫాబాద్, బోధ్, భైంసాలో నిరసన కార్యక్రమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాలో చెన్నూర్ మినహాయించి ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో నాలుగు నియోజకవర్గాలకు తొలిసారి పోటీ చేస్తున్న వారు ఉండగా.. మరో ఇద్దరు మాత్రం గత ఎన్నికల్లో పోటీచేసిన వారు ఉన్నారు. బోథ్ నియోజకవర్గంలో అనేక మంది కీలక నాయకులు టికెట్లు ఆశించారు. కానీ అధిష్టానం మాత్రం డా.వన్నెల అశోక్‌కు టికెట్ కేటాయించింది. దీంతో ఇన్నాండ్లు వేర్వేరు గ్రూపులుగా ఉన్న ఆడె గజేందర్, డా.నరేష్‌జాదవ్, రాథోడ్ పార్వతీబాయి, కొమురం కోటేష్ తాజా పరిణామాలతో ఒక్కటయ్యారు. వీరందరూ శనివారం సమావేశం నిర్వహించి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వీరిలో ఒకరు రెబెల్ అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆదివారం కార్యకర్తలతో చర్చించి పోటీలో ఉండే అభ్యర్థిని నిర్ణయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆసిఫాబాద్‌లో తొలి నుంచి పార్టీలో ఉన్న మర్సుకోల సరస్వతి, రాథోడ్ గణేష్‌ను కాదని ఇటీవల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన ఆజ్మీరా శ్యాంనాయక్‌కు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఇన్నాండ్లు వేర్వేరు గ్రూపులుగా ఉన్న సరస్వతి, రాథోడ్ గణేష్ ఒకే గొడుగు కిందకు వచ్చారు. ఆసిఫాబాద్ పట్టణంలోని కుమురంభీం చౌక్‌లో ధర్నా నిర్వహించారు. 2002 నుంచి పార్టీలో ఉన్న తనకు పార్టీ అధిష్టానం తీవ్ర అన్యాయం చేసిందని సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా పోటీలో ఉంటానని.. కాంగ్రెస్ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది. ముధోల్‌లో కొమ్రెవార్ కిరణ్‌కుమార్‌కు కాకుండా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్‌కు ఆ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో కిరణ్‌కుమార్ అనుచరులు శనివారం భైంసాలో నిరసన తెలిపారు. ఆదిలాబాద్‌లో ముందు నుంచి పార్టీలో ఉంటూ టికెట్ ఆశించిన నాయకులను కాదని.. కొత్తగా చేరిన ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది. దీంతో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సంజీవరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వీరిలో ఒకరు రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ఇద్దరు సిట్టింగ్‌లకు నో ఛాన్స్..!
బీఆర్‌ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ సైతం టికెట్ నిరాకరించడం చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేఖానాయక్‌కు బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఇటీవల రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ.. ఆమె భర్త శ్యాంనాయక్‌కు కాంగ్రెస్ అధిష్టానం ఆసిఫాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించడంతో రేఖానాయక్‌కు టికెట్ దక్కలేదు.
దీంతో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుతో కలిసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాథోడ్ బాపురావుకు సైతం ఈసారి బీఆర్‌ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో ఆయన బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి టికెట్ తనకే వస్తుందని చివరి వరకు నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ పార్టీ అధిష్టానం మాత్రం డా.వన్నెల అశోక్‌కు కేటాయించడంతో బాపురావుకు నిరాశ తప్పలేదు. ప్రస్తుతానికి ఆయన సైలెంట్‌గా ఉన్నారు.