నిజాయితీగా సేవ చేయండి… ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి
విధి నిర్వహణలో మార్పు, ఆ పదవికి గౌరవం తీసుకొస్తే విజయం సాధించినట్టే.. : సివిల్ సర్వీస్ అధికారుల శిక్షణ ముగింపులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అధికారిగా మాత్రమే కాకుండా ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందాలని డిప్యూటీ సీఎం మల్లు మల్లు భట్టి విక్రమార్క సివిల్ సర్వీసెస్ అధికారులను కోరారు. అప్పుడే సివిల్ సర్వీసెస్ హోదాకు తగిన గుర్తింపు, న్యాయం చేసిన వారు అవుతారని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో వివిధ రాష్ట్రాలకు చెందిన 203 మంది సివిల్ సర్వీస్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో భట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంసీఆర్‌హెచ్‌ఆర్టీ వైఎస్ చైర్‌పర్సన్ శాంతకుమారి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రతిరోజు కార్యాలయాన్ని వదిలి వెళ్లే ముందు తాము చేసిన పనుల ద్వారా ఎవరి జీవితంలోనైనా మంచి మార్పు వచ్చిందా? తగిన గౌరవాన్ని తెచ్చిందా? అని తమకు తామే ప్రశ్నించుకోవాలని సూచించారు. విధుల్లో ఉన్నప్పుడు ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పారు. అప్పుడే విధి నిర్వహణలో చాలా వరకు విజయం సాధించినట్టేనని తెలిపారు. ‘నిజాయితీతో సేవ చేయండి…ధైర్యంగా నిర్ణయాలను తీసుకోండి’ అని కోరారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత బాధ్యత, వివేకం, విచక్షణ, విశ్వాసం పెరిగిందన్నారు. ఇంజినీర్లుగా, వైద్యులుగా, ఆర్థిక నిపుణులుగా, న్యాయవాదులుగా, సాంకేతిక నిపుణులుగా వివిధ పాత్రలు పోషించాల్సి వస్తోందని తెలిపారు.
ఇక్కడ నుంచి బాధ్యతలు, బదిలీలు, క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ద్వారా కొన్ని జీవితాలే తీవ్రంగా ప్రభావితమవుతాయని గుర్తు చేశారు. అందువల్ల విధి నిర్వహణలో ఎంతో నిబద్దతతో పని చేయాలని సూచించారు. ‘పాలనలో ఒత్తిడి, కఠినమైన సందర్భాలు, మానవీయతతో కూడిన నిర్ణయాలు, ప్రజాశ్రేయస్సు కోసం శ్రమించే సందర్భాలు. ప్రశంసలు, విమర్శలు కూడా ఉంటాయి. అవన్నీ ప్రజల కోసమేనన్న భావనతో ముందుకు వెళ్లాలి’ అని సూచించారు.
యువ సివిల్ సర్వెంట్లుగా సమాజంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వేగవంతంగా పెరుగుతోందనీ, దాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. మారుతున్న ఆర్థిక, వాతావరణ, భౌగోళిక, రాజకీయాంశాలను అవగాహన చేసుకోవాలన్నారు. అధికార స్థానంలో ఉన్నప్పుడు చరిత్ర, నమ్మకం, కరుణ తదితరాంశాలను ఎప్పటికీ మరువకూడదని చెప్పారు. ‘పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో మహాత్మా గాంధీని ఒక సలహా అడిగారు. అప్పుడు గాంధీజీ స్పందిస్తూ ఎప్పుడైనా, ఏదైనా సందేహం వచ్చినప్పుడు అత్యంత పేద, బలహీనమైన వ్యక్తిని గుర్తు చేసుకోండి’ అని సలహా ఇచ్చారని గుర్తు చేశారు. సాధారణ ప్రజలతో ఎప్పుడూ సంబంధాలు కొనసాగించాలని సూచించారు. వారిని నిత్యం కలవాలనీ, వారు చెప్పేది ఓపికతో వినాలని భట్టి సూచించారు.
ప్రజా సేవకుడిగా గుర్తింపు పొందాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



