Friday, December 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంషాహీ మహిళా కార్మికులది ధర్మ పోరాటం

షాహీ మహిళా కార్మికులది ధర్మ పోరాటం

- Advertisement -

యాజమాన్యం మొండి వైఖరి వీడాలి
వేతనాలు పెంచి సమ్మె విరమింపజేయాలి
కార్మిక శాఖ మంత్రి జోక్యం చేసుకోవాలి : కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు


నవతెలంగాణ – చర్లపల్లి
వేతనాలు పెంచాలంటూ పదకొండు రోజులుగా నాచారం షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ ఎదుట మహిళా కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె న్యాయబద్ధమైన ధర్మ పోరాటమని కెేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు అన్నారు. ఈ సమ్మెపై కార్మిక శాఖ మంత్రి తక్షణమే జోక్యం చేసుకుని చర్చలు జరిపి వేతనాలు పెంచి సమ్మెను విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాచారంలోని షాహీ ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీ ఎదుట సమ్మెలో ఉన్న మహిళా కార్మికులకు గురువారం కేవీపీఎస్‌ నాయకత్వం సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాహీ కంపెనీలో నిజాం కాలం నాటి వెట్టిచాకిరీ నేటికీ కొనసాగుతోందని విమర్శించారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ మహిళా కార్మికుల వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. సూపర్‌వైజర్లు, ఇతర విభాగాల ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్న యాజమాన్యం మహిళా కార్మికుల విషయంలో మాత్రం వివక్ష చూపుతోందన్నారు.

అనారోగ్య కారణాలతో విధులకు హాజరు కాలేకపోతే రూ.800 కోత విధిస్తున్నారని, కానీ రోజువారీ వేతనం మాత్రం రూ.300 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు రూ.300తో కుటుంబం ఎలా గడుస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఒక కార్మికుడికి నెలకు కనీసం రూ.26,400 వేతనం ఇవ్వాల్సి ఉన్నా.. మహిళా కార్మికులు మాత్రం రూ.16 వేలే అడుగుతున్నారని అన్నారు. 11 రోజులుగా ఎండా, చలిలో రోడ్డుపై బైటాయించి మహిళా కార్మికులు ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకపోవడం వారి మొండి వైఖరికి నిదర్శనమన్నారు. సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్మిక శాఖ అధికారులు వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. తమ కుటుంబ పోషణ కొంత మెరుగ్గా సాగేందుకు వేతనాలు పెంచాలని మాత్రమే కోరుతున్నారన్నారు. మహిళా కార్మికుల న్యాయమైన పోరాటానికి కేవీపీఎస్‌ సంపూర్ణ మద్దతు ఉంటుందని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా సమ్మెను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.బాలపీరు, నాయకులు స్వామి, శ్రీను, భాగ్య, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -