త్వరగా కోలుకోవాలంటూ ట్రంప్,
ఒబామా, కమలాహారిస్, మోడీ సందేశాలు
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రొస్టేట్ కేన్సర్‌తో బాధ పడుతున్నట్లు డెమోక్రటిక్ పార్టీ కార్యాలయం ఆదివారం ప్రకటించింది. ఆ కేన్సర్ ఆయన శరీరంలో ఎముకలకు కూడా వ్యాపించిందని తెలిపింది. మూత్రసంబంధిత సమస్యలు తలెత్తడంతో పరీక్షలు చేయించగా, ప్రొస్టేట్ నాడ్యూల్‌ను కనుగొన్నారు. ఆయనకు చికిత్సనందించే విషయమై ప్రస్తుతం వున్న అవకాశాలు, మార్గాలను బైడెన్ కుటుంబం పరిశీలిస్తోందని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన శరీరంలో వ్యాధి తీవ్రత చాలా ఎక్కువగా వుందని, బ్రెస్ట్, ప్రొస్టేట్ వంటి కేన్సర్లు హార్మోన్ల ఆధారిత కేన్సర్లని అందువల్ల హార్మోన్లను నిరోధిస్తే వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం వుంటుందని భావిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది. పురుషుల్లో అత్యంత సాధారణమైన కేన్సర్ ఇదని, తొలినాళ్ళలోనే గుర్తిస్తే చికిత్సకు చాలా అవకాశం వుంటుందని పార్టీ ప్రకటన పేర్కొంది. ఈ విషయం తెలిసిన వెంటనే అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభృతులు స్పందించారు. బైడెన్ త్వరలోనే పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించారు. ఈ వార్త తెలియగానే చాలా విచారించినట్లు ట్రంప్ సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. త్వరలోనే ఆయన కోలుకోవాలని, కుటుంబంతో ఆనందంగా వుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జో బైడెన్ ఒకయోధుడని కమలా హారిస్ వ్యాఖ్యానించారు. ఈ సవాలును అత్యంత సమర్ధవంతంగా, ధైర్యంగా ఎదుర్కొంటారని అన్నారు. ఈ సమయంలో బైడెన్ కుటుంబం గురించే తమ ఆలోచనలన్నీ తిరుగుతున్నాయని ఒబామా దంపతులు పేర్కొన్నారు. త్వరగా, పూర్తిగా కోలుకుని బైడెన్ బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ప్రధాని మోడీ సందేశం
అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ త్వరలోనే కేన్సర్ నుండి బయటపడాలని, పూర్తి స్థాయిలో కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. జిల్ బైడెన్, ఇతర కుటుంబ సభ్యులు ధైర్యంగా వుండాలని పేర్కొన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడుబైడెన్‌కుప్రొస్టేట్ కేన్సర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES