నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థి నాయకుడు షరిప్ ఉస్మాన్ హాదీ అకాల మరణంతో బంగ్లాదేశ్‌లో అల్లర్లు శృతి మించుతున్నాయి. ఇప్పటికే ఆ దేశవ్యాప్తంగా ఆయన అనుచరుల పలు హింస చర్యలకు పాల్పడుతున్నారు. భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తూ పలు మీడియా సంస్థలపై దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ దేశ రాజధాని ఢాకాలో భారీగా హాదీ అనుచరులు చేరుకున్నారు. హోదీ మృతికి తగ్గిన న్యాయం చేయాలని, దుండగలను వెంటనే అరెస్ట్ చేయాలని, కుట్ర కోణాన్ని ఛేదించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
డిసెంబరు 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా ఉస్మాన్ హాదీపై దాడి జరిగింది.హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం ప్రాణాలు విడిచాడు. తూటా గాయం కారణంగా హాదీ మెదడుకు తీవ్ర గాయమైందని వైద్యులు వెల్లడించారు. హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్‌లో ఆగ్రహజ్వాలలు మొదలయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.



