నవతెలంగాణ – అశ్వారావుపేట
అమ్మ చేతి ఒడిలో మొదలైన జీవితం, నేడు గ్రామ పాలన సింహాసనం వరకు చేరింది. ఇన్నాళ్లు ఇంటి గడప దాటని మహిళ, ఇప్పుడు గ్రామ భవితవ్యాన్ని నిర్ణయించే నాయకురాలిగా ఎదిగింది. ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు… ఇది మహిళా శక్తి సాధించిన సామాజిక విజయం.
రాజ్యాంగం మహిళలకు ఇచ్చిన హక్కులు చాలా కాలం కాగితాలకే పరిమితమయ్యాయి.రిజర్వేషన్ ఉన్నా, అధికారాన్ని ఇతరులే వినియోగించిన దశలు ఎన్నో. కానీ ఈ ఎన్నికలు ఆ చరిత్రకు గట్టిగానే గడియలు బిగించారు.చదువు, చైతన్యం, ఆత్మవిశ్వాసంతో మహిళలు స్వయంగా పాలనలోకి అడుగుపెట్టారు.మండలంలోని 27 మంది సర్పంచ్ లలో 14 మంది మహిళలు కావడం గణాంకం కాదు ఇది మారుతున్న సమాజానికి కొలమానం ఇది మారుతున్న సమాజానికి కొలమానం. ఈ మహిళా సర్పంచ్ లలో ఎక్కువ మంది విద్యావంతులే కావడం విశేషం.ఎంబీఏ నుంచి బీఏ,బీఈడీ వరకు చదువుకున్న మహిళలు గ్రామాల సమస్యలను పాలసీ స్థాయిలో ఆలోచించే స్థితికి వచ్చారన్నదే దీని అర్థం.
ఇంతకాలం “మహిళ సర్పంచ్ అంటే పేరుకే” అన్న అపవాదు కు ఈ ఎన్నికలు సమాధానం చెప్పాయి. నేడు మహిళా సర్పంచ్ అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకత్వం, గ్రామ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే పాత్ర.చదువు,చైతన్యం మహిళా శక్తి కి గీటురాయిగా మారింది
పాతరెడ్డిగూడెం లో ఎంబీఏ చదివిన వెంకటరమణ,కేసప్పగూడెం లో బీఎస్సీ చదివిన భారతి,గుమ్మడవల్లి లో బీఏ,బీఈడీ చేసిన శ్రీదేవి,అనంతారం లో బీఏ చదివిన అనూషా దేవి,నారాయణపురం,ఊట్లపల్లి లో ఇంటర్మీడియట్ చదివిన మోడీకి కుమారి,లక్ష్మి కుమారి లు.ఇవన్నీ పేర్లు మాత్రమే కాదు… ఇవి గ్రామ పాలనకు వచ్చిన కొత్త భాష. మరోవైపు ఐదు, ఏడు తరగతులు చదివిన మహిళలు సైతం ప్రజల నమ్మకంతో సర్పంచ్ లు అయ్యారు. చదువు పరిమిత మైనా, జీవన అనుభవమే వారికి పాలన పాఠంగా మారింది.గ్రామాల మహిళా నాయకత్వం నేడు పాలనా పగ్గాలు చేపట్టాయి.
ఈ మహిళా సర్పంచ్‌ల విజయం ఒక్కో గ్రామానికే పరిమితం కాదు. ఇది ఆడపిల్ల చదువు, ఆత్మవిశ్వాసం, సమాన హక్కులపై పల్లెల్లో చర్చకు దారి తీసింది. “చదివితే ఉద్యోగమే కాదు… పాలన కూడా చేయొచ్చు” అన్న సందేశం ప్రతి ఇంటికీ చేరింది.మహిళలు ఇక సహాయక పాత్రల్లో కాదు.నిర్ణయాధికారులు గా ముందుకొస్తున్నారు.గ్రామ పాలనలో మహిళా శక్తి ఇక తిరుగులేని వాస్తవం.ఇది ముగింపు కాదు…ఇది ఒక కొత్త యుగానికి ఆరంభం



