– దోపిడీ అంతం కావాలి
– అదే సుందరయ్యకిచ్చే నిజమైన నివాళి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
– సుందరయ్య పార్క్‌లో సుందరయ్య విగ్రహానికి నివాళి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసమానతల్లేని సమాజం కోసం పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. పేద, ధనికుల మధ్య తేడా, అంటరానితనం, స్త్రీ, పురుషుల మధ్య అసమానతల్లేకుండా సమాజం ఉండాలని సుందరయ్య భావించారని గుర్తు చేశారు. సుందరయ్య మార్గంలో పోరాటాలను ముందుకుతీసుకుపో వడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. సోమవా రం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్‌లో సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమా న్ని నిర్వహించారు. సుందరయ్య విగ్రహానికి జాన్‌వెస్లీ సహా పలువురు నాయకులు, వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పూలమాలవేసి నివాళులర్పించా రు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనీ, అందరికీ విద్యావైద్యం ఉచితంగా అందాలనీ, పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ఉండాలని సుందరయ్య కోరుకున్నారని చెప్పారు. ప్రతి మనిషికీ పనిచేసే హక్కుండాలన్నారు. వాటికోసం ఆయన జీవితాంతం కృషి చేశారని అన్నారు. ఈ దేశంలో కొద్ది మంది చేతుల్లో సంపద పోగవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. భూస్వాముల చేతుల్లో, కార్పొరేట్ సంస్థల చేతుల్లో సంపద ఉంటున్నదని వివరించారు. ఈ దేశంలో ఒక్క శాతం సంపన్నుల వద్ద 40 శాతం సంపద, 10 శాతం సంపన్నుల చేతుల్లో 90 శాతం సంపద పోగయ్యిందని అన్నారు. అట్టడుగున ఉన్న 50 శాతం పేదల చేతుల్లో మూడు శాతం సంపద ఉందన్నారు. అందుకే దేశంలో పేదరికం, దరిద్రం ఉన్నదని చెప్పారు. ఈ భూమిపై అందరికీ సమాన హక్కు ఉంటుందనీ. భూపంపిణీ జరగాలని ఆయన ఆకాంక్షించారని అన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆయన నాయకత్వం వహించారని గుర్తు చేశారు. బాంచన్ దొర నీ కాల్మొక్తా అన్న పేదల చేతులతో బందూకులు పట్టించి తిరుగుబాటు చేసి భూస్వాములు, రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర ఉందని చెప్పారు. మూడు వేల గ్రామాలను విముక్తి చేసి ప్రజారాజ్యాలను ఏర్పాటు చేశారనీ, భూమిని పేదలకు పంచారని అన్నారు. వెట్టిచాకిరీని రద్దు చేశారని చెప్పారు. దేశంలో భూసంస్కరణల చట్టాన్ని సాధించారని వివరించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో దేశంలోని ప్రజలంతా తిరుగుబాటు చేస్తారనీ, సోషలిస్టు వ్యవస్థ వస్తుందని ఆనాటి పాలకులు భావించారని అన్నారు. భారత సైన్యం, రజాకార్లు కలిసి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణచివేశారని చెప్పారు. ఈనాటికీ సుందరయ్య అందరికీ ఆదర్శమన్నారు. సామాజిక న్యాయం కోసం, వర్గదోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు. ఆయన మార్గంలోనే సీపీఐ(ఎం) ప్రజల తరఫున పోరాటాలను నిర్మిస్తుందన్నారు. దోపిడీ లేని సమాజం కోసం కృషి చేయాలని చెప్పారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేశ్ మాట్లాడుతూ సుందరయ్య ఉన్నత విలువలతో బతికారని అన్నారు. పోరాటాలతో ప్రజల కోసం సేవా కార్యక్రమాలు కూడా చేశారని చెప్పారు. వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ అధ్యక్షులు పివి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నేతగా, సంఘసంస్క ర్తగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సుందరయ్య పోరాటం చేశారని అన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా ఆయన భూమిని పేదలకు పంచారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శివర్గ సభ్యులు ఎం దశరథ్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి ఆశయ్య, టి స్కైలాబ్‌బాబు, ఆర్ వెంకట్రాములు, వాకర్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ సుందరయ్య పార్క్ ప్రధాన కార్యదర్శి ఎస్ మనోహర్‌రెడ్డి, ఉపాధ్యక్షులు వి కళ్యాణ్‌నాయక్, మాజీ అధ్యక్షులు నాగభూషణం, నాయకులు సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.
అసమానతల్లేని సమాజం కోసం పోరాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES