నేటి అమ్మాయిలు తమ కాళ్లపై తాము నిలబడాలని కోరుకుంటున్నారు. ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకూడదనే లక్ష్యంతో పెండ్లికి ముందే కెరీర్‌ను రూపొందించుకుంటున్నారు. అయితే ఒక్కోసారి పెండ్లి తమ ఆలోచనలకు భిన్నంగా ఉన్నా రాజీ పడిపోతున్నారు. అది తమ ఇష్టప్రకారం అయితే ఇబ్బంది లేదు. కానీ బలవంతంగా బంధంలో ఇరుక్కుంటే మాత్రం జీవితాంతం బాధపడాల్సిందే. అందుకే కొందరు అమ్మాయిలు ధైర్యంగా తమ నిర్ణయాలను చెప్పి నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెండ్లి చేసుకుంటున్నారు. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో చదవండి.
అర్చనకు 25 ఏండ్లు ఉంటాయి. చదువు పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఒక అన్న, అక్క ఉన్నారు. వారిద్దరికీ పెండ్లి అయిపోయింది. అర్చనకు కూడా ఈ మధ్యనే రాహుల్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది. కానీ అతనంటే అర్చనకు నచ్చడం లేదు. ఎలాగైనా ఈ పెండ్లి ఆపాలని ఐద్వా అదాలత్‌కు వచ్చింది. ఆమె మాటలకు మొదట మాకు ఆశ్చర్యం వేసింది. ఎవరి మధ్య అయినా పెండ్లి తర్వాత గొడవ రావడం సహజం. వాటిని పరిష్కరించుకునేందుకు మా దగ్గరకు వస్తారు. కానీ మొదటి సారి ఇలా ‘నా పెండ్లి ఆపండీ’ అంటూ ఓ అమ్మాయి వచ్చింది.
ఆమెను కూర్చోబెట్టి ‘నీకు ఈ పెండ్లి ఇష్టం లేకపోతే మీ ఇంట్లో వాళ్లకు చెప్పొచ్చు కదా, మా వరకు ఎందుకు వచ్చావు, అసలు ఏం జరిగింది’ అని అడిగాము. దానికి ఆమె ‘రాహుల్ నాకు ముందు నుంచే తెలుసు. మేమిద్దరం ఒకే కాలేజీ కానీ క్లాసులు వేరు. కాలేజీలో ఉన్నప్పుడు చూసుకునే వాళ్లం. ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఈ మధ్య నాకు పెండ్లి సంబంధం చూస్తున్నారని తెలిసి రాహుల్ వాళ్లు మా ఇంటికి వచ్చారు. వాళ్ల అమ్మానాన్నల మాటలను బట్టి రాహుల్ నన్ను కాలేజీ రోజుల నుండే ప్రేమిస్తున్నాడని తెలిసింది. అందుకే అతను నన్ను వెదుక్కుంటూ వచ్చాడు. మంచి ఉద్యోగం ఉంది. అతనికి కూడా అక్క, అన్నయ్య ఉన్నారు. వాళ్లకూ పెండ్లి అయిపోయింది. నాలాగే రాహుల్ కూడా ఇంట్లో అందరికంటే చిన్నవాడు.
రెండు కుటుంబాలు మాట్లాడుకొని మాకు ఎంగేజ్‌మెంట్ చేశారు. అప్పటి నుండి మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాము. మొదటి నెల రోజులు రాహుల్‌తో మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉండేది. మా పెండ్లికి ఎంగేజ్‌మెంట్‌కు ఆరు నెలలు టైం ఇచ్చారు. ఈ నాలుగైదు నెలల్లో మేమిద్దరం కలిసి నాలుగైదు సార్లు బయటకు వెళ్లాం. ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. ఎందుకోగానీ ఈ మధ్య రాహుల్‌తో మాట్లాడలనిపించడం లేదు. అతనితో కలిసి బయటకు వెళ్లాలని లేదు. నాలో ఏదో తెలియని భయం. రాహుల్ ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటాడు. ఎప్పుడైనా అతను ఫోన్ చెయ్యగానే ఎత్తకపోయినా, ఇప్పుడు నాకు పనుంది, నిద్ర వస్తుంది తర్వాత చేస్తాను అన్నా అతనికి చాలా కోపం వస్తుంది.
‘నీకు నాకంటే ఆఫీసు పనే ఎక్కువైందా, జాబ్ మానేసి ఇంట్లో ఉండొచ్చు కదా, పెండ్లి తర్వాత ఎలాగో జాబ్ చేయాల్సిన అవసరం నీకు లేదు’ అంటాడు. ఈ విషయం అమ్మ వాళ్లకు చెబితే ‘అతను చెప్పిన దాంట్లో తప్పేముంది. వాళ్ల దగ్గర ఆస్తులు బాగా ఉన్నాయి, ఇక నీకు ఉద్యోగం చేయాల్సిన పనేముంది’ అంటున్నారు. కానీ ఉద్యోగం మానేస్తే పెండ్లి తర్వాత నా ప్రతి అవసరానికి రాహుల్‌పై ఆధారపడాల్సి వస్తుంది. నేను కాలేజీకి వచ్చినప్పటి నుండి నా అవసరకు నేనే సంపాదించుకుంటున్నాను. ఇలా అలవాటు పడిపోయాను. అలాంటిది ఇప్పుడు రాహుల్‌పై ఆధారపడడం నాకెందుకో నచ్చడం లేదు. పైగా అతను ఎవరితో మాట్లాడమంటే వాళ్లతోనే మాట్లాడాలి. వాళ్ల అక్క ఫోన్ చేస్తే ఆమెతో ఏం మాట్లాడాలో కూడా అతనే చెప్తాడు. సొంతంగా ఆలోచించే స్వేచ్ఛ నాకు లేకుండా పోతుందేమో అనే భయం నాలో కలుగుతుంది. మా ఇంట్లో మా పెండ్లి ఏర్పాట్లు మొదలుపెట్టారు. మూహూర్తం కూడా చూశారు. నాకు చాలా భయంగా ఉంది. అందుకే ఈ పెండ్లి ఆపండి’ అంటూ బాధగా చెప్పింది.
ఆమె మాటలు విన్న తర్వాత మేము ఇరు కుటుంబ సభ్యులతో పాటు రాహుల్‌ని పిలిచి అర్చన భయాల గురించి చెప్పాము. కానీ అందరూ ‘ఆమె ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. రాహుల్ చెప్పినట్టు అర్చన వినాలి’ అన్నారు. దానికి మేము ‘అలా ఎలా అంటారు. ఆమెకంటూ ఓ జీవితం ఉంది. ఉద్యోగం చేయొద్దు, వాళ్లతో మాట్లాడొద్దు అంటూ పెండ్లికి ముందే ఆంక్షలు పెడుతున్న వ్యక్తి గురించి ఏ ఆడపిల్ల అయినా ఎలా ఆలోచిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇక పెండ్లి తర్వాత ఆమె పరిస్థితి ఏంటీ?’ అన్నాము.
రాహుల్‌తో ‘నువ్వు అర్చనను ఇష్టపడి పెండ్లి చేసుకుంటున్నావు. కానీ ఆమె ఇష్టాలను మాత్రం వదిలేస్తున్నావు. అందుకే ఆమె భయపడుతుంది. ఏ నమ్మకంతో ఆమె నిన్ను పెండ్లి చేసుకుంటుంది. ఆమె స్వేచ్ఛ ఆమెకు ఇవ్వాలి. పెండ్లి తర్వాత ఉద్యోగం చేయాలా వద్దా అనేది ఆమే నిర్ణయించుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని నువ్వు గౌరవించాలి’ అని చెప్పాము. కానీ అతను ‘మహిళలకు అంత స్వేచ్ఛ అవసరం లేదు. నేను చెప్పినట్టు ఇప్పుడే వినడం లేదు. ఇక పెండ్లి తర్వాత ఎలా వింటుంది? మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అస్సలు ఇవ్వకూడదు. ఇస్తే భర్త మాట వినరు. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆమెకు తెలియదు. అందుకే నేను చెప్తున్నాను. దాన్ని కూడా తప్పు బడితే ఎలా? ఆమె ఉద్యోగం చేయాలనుకుంటే చేసుకోమనండి. నేను వేరే అమ్మాయిని పెండ్లి చేసుకుంటాను’ అన్నాడు.
దానికి అర్చన ‘మీరు చెబితే అతని పద్దతి మార్చుకుంటాడేమో అనుకున్నాను. కానీ అతను మరీ దారుణంగా ఆలోచిస్తున్నాడు. నా ఆత్మగౌరవాన్ని చంపుకొని అతన్ని పెండ్లి చేసుకోలేను, నన్ను నా నిర్ణయాలను గౌరవించే వ్యక్తి దొరికినప్పుడే పెండ్లి చేసుకుంటాను’ అని కచ్చితంగా చెప్పింది. రాహుల్ మాటలు విన్న తర్వాత అర్చన తల్లిదండ్రులు కూడా కూతురికే మద్దతు ఇచ్చారు. ‘నెల రోజుల నుండి ఈ పెండ్లి వద్దు అంటుంది కానీ అసలు విషయం చెప్పలేదు. మా అమ్మాయికి నేనే స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతకడం నేర్పాను. అలాంటిది ఇప్పుడు వాటిని దూరం చేసే ఇంటికి ఆమెను పంపలేను’ అన్నాడు ఆమె తండ్రి. రాహుల్ తల్లిదండ్రులు కూడా తప్పు తన కొడుకుదే అని అంగీకరించి వెళ్లిపోయారు.
ఎంత చదువుకున్నా నేటికీ సమాజంలో మహిళలంటే చిన్న చూపు. ఉద్యోగం చేసే మహిళలంటే అలుసు. గొప్ప స్థాయిలో ఉన్న వారి ఆలోచనలు కూడా ఇలాగే ఉంటున్నాయి. అయితే అర్చనలా స్వతంత్రంగా ఆలోచించే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతుంది. తన నిర్ణయాన్ని భయం లేకుండా చెప్పి తన జీవితాన్ని తనే కాపాడుకుంది. ఇలా అమ్మాయిలందరూ ధైర్యంగా ఉంటే తమ సమస్యలను తామే పరిష్కరించుకోవచ్చు.
వై వరలక్ష్మి, 9948794051



