Saturday, December 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిగ్రామీణ భారతానికి మరణశాసనం

గ్రామీణ భారతానికి మరణశాసనం

- Advertisement -

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ-2005 చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ”వికసిత్‌ భారత్‌”- ”గ్యారెంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ అండ్‌ అజివితా మిషన్‌ (గ్రామీణ)” (VB- G RAM G) చట్టాన్ని తీసుకుని రావడానికి లోక్‌సభలో బిల్లును ఆమోదింప జేసుకుంది. వికసిత్‌ భారత్‌-2047లో భాగంగా కొత్త చట్టం తీసుకుని రానున్నట్లు పార్లమెంట్‌లో తెలిపింది. గతంలో అమలైన 2005 ఉపాధి చట్టానికి, ఇప్పటి బిల్లు తేడా చూస్తే మోడీ రాజకీయ ఎజెండా ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. అది గ్రామీణ భారతాన్ని ఆకలితో చంపే కుట్రగా అనిపిస్తున్నది! ఎందుకంటే, ఇప్పటివరకు పడిపోతున్న గ్రామీణ ఉపాధి పనిదినాలకు ఉపాధి చట్టం ద్వారా కొంతమేరకైనా పని దొరికింది. వ్యవసాయ పనులు, వేతనాలపై సానుకూల ప్రభావం కలిగింది. పేదలకు కొంతమేరకు బేరామాడే శక్తి వచ్చింది. హక్కుగా ఉన్న ఉపాధి వలన ‘నా పని’ అనే వ్యక్తిత్వానికి దోహదం చేసింది. రైతులకు మేలు జరిగింది. మహిళలు, పురుషులతో సమానంగా కూలి పొందే అవకాశం వచ్చింది.

కోవిడ్‌ సమయంలో పట్నం నుండి తిరిగి గ్రామాలకు వస్తే ఉపాధే కోట్లాదిమందిని కొంతైనా ఆదుకుంది. ప్రత్యేకించి గ్రామాల్లో ఉన్న శ్రామిక వర్గానికి ఒకే చోట పనిచేసే అవకాశం సంవత్సరంలో కొన్ని రోజులైనా వచ్చింది. ఇది రూరల్‌ ప్రోలిటేరియట్‌ పనిలో ఐక్యతకు, క్రమానికి సానుకూలత. కానీ, మోడీ ఉపాధి స్థానంలో తీసుకొస్తున్న కొత్త బిల్లు లక్ష్యం, కారణాలు, అందులో పొందుపర్చిన షెడ్యూల్‌లోని తొమ్మిదవ పాయింట్‌లో స్పష్టంగా చెప్పబడ్డాయి. ”సంవత్సరానికి ప్రతి వయోజనుడికి ప్రస్తుతం ఉన్న వంద రోజుల పనిని నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం, వ్యవసాయ సీజన్‌లో రైతులకు కూలీలు అందుబాటులో ఉండడానికి అరవై రోజుల పాటు ఉపాధి పనిని నిషేదించడం, ఉపాధి ఖర్చులో కేంద్రం ఇస్తున్న తొంభై శాతం వాటాను అరవై శాతానికి తగ్గించడం. అలాగే రాష్ట్రాల వాటాను పది శాతం నుండి నలభై శాతానికి పెంచడం, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవడం, అనేవి ఈ బిల్లులో పొందుపర్చిన అంశాలు.

మొత్తం ఎనిమిది చాప్టర్లు, 37 పాయింట్లలో ఉన్న సెక్షన్లు, సబ్‌ సెక్షన్లు, రెండు షెడ్యూల్‌లో ఉన్న అంశాలను విశ్లేషణ చేస్తే పేదలను మరింత పేదరికంలో పడేసే విధానాలే ఉన్నాయి.
ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఈ.జి.ఎ-2005 చట్టానికి ఈ కింద అంశాలు గుండెకాయ లాంటివి. అవి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వయోజనుడికి ఏడాది కాలంలో వంద రోజులకు పని తగ్గకుండా ఉపాధిని గ్యారెంటీ చేస్తూ పనిని హక్కును కల్పించింది. పని అడిగిన ప్రతి ఒక్కరికి బడ్జెట్‌ పరి మితులు లేకుండా పనిఇవ్వడం, ఈ పథకానికి డిమాండ్‌ బట్టి బడ్జెట్‌ కేటాయింపులు కేంద్రం చేయాలి తప్ప బడ్జెట్‌ను బట్టి పనిదినాలను నిర్ణయించడం అనేది ఈ పథకంలో లేదు. దేశంలోనే బడ్జెట్‌ షరతులు లేని ఏకైక చట్టంగా ఇది కొనసాగుతున్నది. ఈ చట్టానికి అయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు, రాష్ట్రాలు పది శాతం నిధులు భరించాలి.

వీటితోపాటు అడిగిన పదిహేను రోజులలో పని కల్పించక పోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఈ చట్టం ద్వారా కల్పించే పనులలో ప్రధానంగా రైతుల పొలాలకు రహదారులు అభివృద్ధి చేయడం, చెరువుల పూడికతీత, ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి సామాజిక తరగతుల భూములు, కాలనీల అభివృద్ధి, ఇండ్ల నిర్మాణం లాంటికి ప్రాధాన్యతలు ఉన్నాయి. అయితే కేంద్రం చేసే నూతన చట్టం, ప్రస్తుతం ఉన్నదాని కంటే మెరుగ్గా ఉంటేనే అది అభివృద్ధి అంటారు. పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకున్న 197 ఉపాధి బిల్లు, 2005 ఉపాధి చట్టంలో ఉన్న అంశాలను పోల్చిచూస్తే ఈ బిల్లు వెనుక దాగి ఉన్న కుట్రలు, కుతంత్రాలు అర్థమవుతాయి.

ఈ చట్టంలో ప్రధానంగా బడ్జెట్‌ పరిమితి లేదు. పనులు అడిగిన అందరికి పనులు కల్పించడానికి ఎంత బడ్జెట్‌ అయితే అంత ఇవ్వాలి. బడ్జెట్‌పై ఎలాంటి నియంత్రణ లేదు. కేంద్రం తెస్తున్న బిల్లులో సెక్షన్‌ 4 (5) కేంద్రం ప్రతి రాష్ట్రానికి ఎంత బడ్జెట్‌ ఇవ్వాలో ముందే నిర్ణయిస్తుంది.దీన్ని పరీశీలిస్తే డిమాండ్‌ బట్టి నిధులు ఇచ్చే పద్ధతి కాకుండా కేంద్రం ఇచ్చే నిధులకే పని పరిమితమవుతుంది. సెక్షన్‌4(6)లో కేంద్రం కేటాయించే నిధులకంటే ఎక్కువ ఖర్చయితే ఆ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. అంటే పని హక్కు అనే దాని స్థానంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు మేరకే పనులు జరగాలనేది స్పష్టమవుతోంది. నిధుల కొరతతో ఇప్పటికే అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసే అవకాశముంది.

పనికల్పనకు కోతలు
ఉపాధి చట్టం 2025లో డాదిలో ఎప్పుడైనా ప్రజలకు అవసరమైనప్పుడు పని అడిగే హక్కు ఉంది. కానీ ఈ బిల్లులో సెక్షన్‌6(2)లో వ్యవసాయ సీజన్‌ అనే పేరు చెప్పి అరవై రోజులు పనుల్ని చట్టబద్దంగా నిషేదిస్తున్నారు. ఇది వాస్తవంగా రైతులకు ఉపయోగపడేదేనా? కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ గణాంకాలను పోలిస్తే ఉపాధి హామీ పనులు చేసే వారిలో దళితులు 18.63, గిరిజనులు 17.32, మొత్తంగా 36 శాతం లోపు ఉన్నారు. అంటే మిగిలిన వారు బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు. దళితులు, గిరిజనులు భూమి లేని కుటుంబాలే పనులు చేస్తున్నారు అనుకున్న! మరి 64శాతం బీసీ, ఓసీలలో అత్యధిక శాతం మంది రైతులుగా ఉన్న వారు కూడా ఉపాధి పనులు చేస్తున్నారు. అంటే ఈ తరగతులు తమ స్వంత వ్యవసాయం పడావుగా పెట్టి ఉపాధి పనులకు వెళ్తున్నారా? అంతే కాదు ఇదే వెబ్‌సైట్‌లో ఉపాధి పనులు ఏ నెలలో ఎన్ని పనిదినాలు జరుగుతున్నాయే కూడా పొందుపర్చారు. ఉదా: గత ఆర్థిక సంవత్సరంలో 286, అంతకుముందు ఆర్ధిక సంవత్సరంలో 308 పనిదినాలను కల్పించారు.

70 శాతం నుండి 80శాతం పని దినాలు ఫిబ్రవరి నుండి జూన్‌ వరకు వ్యవసాయ పనులు ప్రధానంగా లేనప్పుడు జరిగాయి. స్పష్టంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో అంటే ఏప్రిల్‌ నుండి డిసెంబర్‌ 15 వరకు 168 పని దినాలు జరిగాయి. వీటిలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎనభై శాతం పని దినాలకు పైగా మార్చి నుండి జూలై మధ్యనే చేశారు. అంటే వ్యవసాయ పనులు లేనప్పుడు అత్యధిక శాతం మంది ఉపాధి పనికి వెళ్తున్నారు. కుటుంబాల నేపథ్యాన్ని, పనులు జరుగుతున్న కాలాన్ని పరిశీస్తే వ్యవసాయ సీజన్‌లో కూలీలు ఉపాధి పనులకు వెళ్లారు. కూలీలు అందుబాటులో ఉంచడానికి అరవై రోజుల పని నిషేధం అనేది బోడిగుండుకి మోకాళ్లకు ముడివేయడం లాంటిది. వ్యవసాయ పనులు స్వతహాగా సహాజసిద్ధంగా చేస్తారు. ఉపాధి పనులన్నీ మట్టి పనులే కాబట్టి ప్రభుత్వం ఈ బిల్లులో చెప్పే వాదన బూటకం. ఏ రైతులు సీజన్‌లో పనుల నిషేధం అడిగారు? రైతులు అడిగే కనీస మద్దతు ధర, వ్యవసాయ ఖర్చుల సహాయం లాంటి వాటి నుండి తప్పించుకోవడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే అరవై రోజులు పని నిషేదించడం.

రాష్ట్రాల పాత్ర శూన్యం, భారాలు బహుముఖం
గత ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకానికి రూ.93,850 కోట్లు పైగా వ్యయం చేశాయి. అందులో కేంద్రం తొంభై శాతం వాటాగా రూ.85,333 కోట్లు కాగా, రాష్ట్రాలు పదిశాతం వాటాగా సుమారు రూ.8,500 కోట్లు ఇచ్చాయి. 2025 నూతన బిల్లు ద్వారా కేంద్రం వాటా తొంభై శాతం నుండి అరవై శాతం వరకు తగ్గుతుంది.రాష్ట్రాల వాటా పది శాతం నుండి నలభై శాతం పెరుగుతుంది. కేంద్రం వాటా 56వేల కోట్లు తగ్గి రాష్ట్రాలపై రూ.37,500 కోట్ల భారం పడుతుంది. అంటే రూ.29వేల కోట్లు పైగా అదనపు భారం రాష్ట్రాలపై పడుతుండగా, ఆ మేరకు కేంద్రానికి మిగులుతుంది.

మన తెలుగు రాష్ట్రాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.7,707 కోట్లు వాటా ఇవ్వగా రాష్ట్రం రూ.856 కోట్లు వ్యయం చేసింది. నూతన బిల్లు ప్రకారం నలభై శాతం రాష్ట్రాల వాటా చెల్లించాలంటే రూ.2600 కోట్ల అదనపు భారం పడి అంతమేరకు కేంద్రానికి నిధుల ఖర్చు తగ్గుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గత ఆర్ధిక సంవత్సరంలో రూ.3855 కోట్లు కేంద్ర నిధులైతే రూ.425 కోట్లు రాష్ట్ర వాటా ఉంటే మొత్తం రూ.4250 కోట్లు ఖర్చయింది. మోడీ ప్రవేశపెట్టిన బిల్లు చట్టమైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1300 కోట్లు భారం పడుతుండగా, మొత్తంగా తెలుగు రాష్ట్రాలలోనే రూ.3900 కోట్లు అదనపు భారం పడుతుంది.

పనిదినాల పెంపు కేవలం భ్రమే
నూతన చట్టం కోసం వచ్చిన బిల్లులో 125రోజుల పని పెంచడమే గొప్ప ధ్యేయమని ప్రచారం చేస్తున్నారు. 2005 చట్టంలో కనీసం వంద రోజులు పని అన్నారు తప్ప గరిష్టంగా అని చెప్పలేదు. ప్రస్తుత నూతన బిల్లులో 125 రోజులు చేర్చడానికి పాత చట్టంలో ఏ సెక్షన్లు ఆటంకంగా ఉన్నాయో ఆరెస్సెస్‌ పరివారం చెప్పగలదా? అంతేకాదు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి పూర్తిస్థాయిలో వంద రోజుల పని కల్పించిందో వివరాలు ఇవ్వగలదా? కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌ లెక్కల ప్రకారమే గత ఆర్ధిక సంవత్సరంలో 5.78 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ పనులు చేస్తే 40 లక్షల70 వేల 163 కుటుంబాలు మాత్రమే వంద రోజుల పూర్తి చేశాయి. అంటే మొత్తంలో కేవలం ఎనిమిది శాతం లోపే. అలాంటిది అందరికి వంద రోజుల పని ఇవ్వడానికి ప్రస్తుతం చట్టంలో ఉన్న ఆటంకాలు ఏమిటో చెప్పకుండా 125 రోజులంటూ గప్పాలు కొట్టడం సమంజసమేనా?

పూర్తిస్థాయిలో పని దినాల కల్పనకు అసలైన ఆటంకం మోడీనే. యూపీఏ ప్రభుత్వం ఉండగా ఉపాధి హామీ పథకం అమలు కోసం నాలుగు శాతం బడ్జెట్‌ కేటాయింపులు చేస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమ క్రమంగా నిధులు తగ్గించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో 1.37శాతం నిధులు కుదించి, 80 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. లక్షా40వేల కోట్లకు పైగా కోతలు పెట్టింది. కుటుంబానికి యాభై రోజులు మించి పని కల్పించడం లేదు. అసలైన యదార్ధం ఇదైతే గ్రామీణ ప్రజలకు ముసుగేసి 125 రోజులు పనిదినాలు కల్పిస్తామని భ్రమలు కల్పిస్తున్నది. ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎలో పనుల ప్రణాళిక గ్రామసభల ద్వారా జరుగుతుంది. కానీ కొత్త బిల్లులో ‘నేషనల్‌ రూరల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్టాక్‌’ పేరుతో పనులను కేంద్రమే నిర్ణయిస్తుంది. గ్రామాలను మూడు భాగాలుగా విభజించి కేంద్రమే ఎక్కడ ఏ పనులివ్వాలో నిర్ణయిస్తుంది. బ్యూరోక్రసీకి (అధికార యంత్రాంగానికి) ఎక్కువ అధికారమిస్తుంది.

సాంకేతిక పేరుతో ఉపాధి కూలీల బహిష్కరణ
2005 చట్టానికి విరుద్ధంగా ఇప్పటికే ఆధార్‌తో అనుసంధానం చేసి కోటి జాబ్‌ కార్డులు, ఏడు కోట్ల లబ్ధిదారులను రద్దు చేశారు. కెవైసి పేరుతో మరో 27 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. బయోమెట్రిక్‌ పెట్టి రెండు పూటలా హాజరు, పని ప్రదేశాలు నుండి ఫొటోలు తీసి కేంద్ర పోర్టల్‌కు అప్‌లోడ్‌ చేయాలి. ఇప్పుడు నూతన చట్టంతో వీటన్నింటినీ చట్టబద్దం చేశారు. పూర్తి సాంకేతికత విని యోగించడం అనే షరతులు పెట్టారు. ఆధునిక టెక్నాలజీ ద్వారా ఉపాధి కూలీలను బహిష్కరణ చేస్తున్నారు.వేతనం కొలతల ప్రకారం ఇస్తూ ఈ తతంగమంతా ఎందుకు? కూలీలకు విరక్తి వచ్చి పనులకు రాకుండా ఉండాలనే కదా! మంచి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని అందరికీ చెప్పటం లాంటిది.

2005 చట్ట ప్రకారం కనీస వేతనాల నిర్ణయానికి కేంద్రం ఏడు గంటల పనిని ప్రాతిపదికగా తీసుకుంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకు మార్చారు. నూతన బిల్లు ప్రకారం పనిగంటలను పెంచేందుకు సెక్షన్‌ 19(బి) ప్రకారం, కార్మికుల పని గంటలు పన్నెండు గంటల వరకు పొడిగించే అవకాశం కల్పించారు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని దినం అనే హక్కును ఇది తుంగలో తొక్కుతుంది. ఇది కార్మిక దోపిడీని చట్టబద్ధం చేయడమే. లేబర్‌ కోడ్‌లను ఉపాధి హామీ పనిలో కూడా జొప్పించారు. పైగా 2005 చట్టంలో రాష్ట్రాలు గ్రామాలుగా పేర్కోన అన్ని చోట్ల ఆటోమేటిక్‌గా ఉపాధి అమలవుతుంది. దానికి విరుద్ధంగా నూతన బిల్లులో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామాల్లో ఉపాధి ఉంటుంది. ఇది అప్రజాస్వామిక, ఆధిపత్యం ధోరణి తప్ప మరొకటి కాదు.

కొత్త చట్టం వెనుక బీజేపీ మర్మమేమిటి?
ఆరెస్సెస్‌, హిందుమహాసభ, జనసంఘ్‌ వారి సైద్ధాంతిక భావజాలం జమిందార్లు, భూస్వాములకు అనుకూలం. ఆయా సంస్థల రాజకీయ పార్టీగా ఉన్న బీజేపీ ఉపాధి హామీకి మొదట నుండి వ్యతిరేకమే. అందుకు కారణం ఉపాధి వల్లన లబ్ది పొందే వర్గాలు, సామాజిక తరగతులు ఆరెస్సెస్‌ భావజాలానికి విరుద్ధమైనవి. కాబట్టి, బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో వెన్నెముకగా ఉన్న ధనిక వర్గాన్ని సంతృప్తి పర్చడం, పేదలను ఒంటరి చేసి ఈ ధనిక వర్గ ఆధిపత్య కులాలకు నూతన తరహా వెట్టిగా దిగజార్చడమే కొత్త చట్టం కాబోతున్న బిల్లు అసలు నేపథ్యం. వారి మోకాళ్ల దగ్గర పడి అణిగి ఉండాలనే ఆధిపత్య భావజాలానికి ఉపాధి హామీ ఆటంకంగా మారింది. కాబట్టి ఎంజిఎన్‌ఆర్‌ఈజిఎను రద్దు చేయడం, కొత్త చట్టం తేవడం గ్రామీణ ఉత్పత్తి వర్గాలు, సామాజిక తరగతులపై ప్రత్యక్ష దాడి చేయడమే. వర్గదృష్టితో ఆలోచిస్తే బీజేపీ అసలు నైజాం అర్థమవుతుంది. ఉత్పత్తి వర్గాలైన వ్యవసాయ కార్మికులు, కార్మికులు,పేద రైతులు,కౌలు రైతులు, వృతిదార్లు, ఐక్యమవ్వాలి. ధనిక వర్గానికి అనుకూలంగా రాబోతున్న ఈ చట్టాన్ని ఓడించాలి. ఈ ‘హక్కుల హరణ’ బిల్లును అడ్డుకోకపోతే.. రేపు గ్రామీణ భారతం ఆకలి కేకలతో అలమటించక తప్పదు.

బి.వెంకట్‌
9490098045

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -