Saturday, December 20, 2025
E-PAPER
Homeఎడిట్ పేజి''అణు'' సమర్పణం

”అణు” సమర్పణం

- Advertisement -

కేంద్రప్రభుత్వం తెచ్చిన ”అణుశక్తి ప్రయివేటీకరణ బిల్లు” మనదేశ అణువిధానంలో ఒక ప్రమాదకరమైన మలుపు. ప్రభుత్వ నియంత్రణ, జాతీయ భద్రత, ప్రజల జీవనహక్కు వంటి మౌలిక అంశాలను ప్రశ్నార్థకంగా మారుస్తూ.. అణుశక్తిని పెట్టుబడికి అప్పగించే ఏలినవారి కుతంత్రాలకు నిదర్శనం. ఈ బిల్లు ఆమోదం పొందిన తీరే వారి ఉద్దేశ్యాన్ని బహిర్గతం చేస్తోంది. పార్లమెంటులో విస్తృతచర్చకు తావు లేకుండా, స్టాండింగ్‌ కమిటీకి పంపకుండా, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు లేవనెత్తిన ఆందోళనలను పూర్తిగా పక్కనపెట్టి, సంఖ్యా బలంతో చట్టాన్ని నెగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్లింది. ఇలా ప్రజాస్వామ్యంలో విధాన నిర్ణయాలకు అవసరమైన ప్రజావాదనలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకర సంకేతం. అణుశక్తి వంటి అత్యంత వ్యూహాత్మక రంగంలో ప్రయివేటు పెట్టు బడులకు ద్వారాలు తెరవడమంటే కోరి కొరివితో తలగోక్కోవడమే. ఇది సాధారణ మౌలిక వసతి రంగం కాదు. జాతీయ భద్రత, పర్యావరణ రక్షణ, తరతరాల ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అత్యంత కీలకమైన రంగం. అలాంటి రంగంలో ”పెట్టుబడుల ఆకర్షణ”, ”సామర్థ్య విస్తరణ” అనే ఆర్థిక పదజాలం మాటున ప్రజల ప్రాణాలను, దేశ ప్రయోజనాలను బలిచేయడానికి కేంద్రం పూనుకోవడం ఆందోళనకరం.

అణుశక్తి అంటేనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు అవసరమైన రంగం. దేశ రక్షణ, అంతర్జాతీయ ఒప్పందాలతో ముడిపడి ఉన్న రంగం. కేవలం ఓ సాధారణ విద్యుత్‌ ఉత్పత్తి రంగం కాదు. ఒక చిన్న తప్పిదం కూడా మహావిపత్తుగా మారే స్వభావంగల సున్నితమైన రంగం. ఏ చిన్న వైఫల్యం తలెత్తినా దాని ప్రభావాలు కొన్ని తరాల వరకూ కొనసాగే ప్రమాదకరమైన రంగం. ఈ కారణాల వల్లనే స్వాతంత్య్రం తర్వాత భారతదేశం ఈ రంగాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచింది. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు. అణుశక్తి అనేది కొందరి లాభాల కోసం కాదు, ప్రజలందరి ప్రయోజనాల కోసమని అప్పటి నాయకత్వం భావించింది. అందుకే అణుశక్తిపై పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ, భద్రత పట్ల రాజ్యం బాధ్యత, పార్లమెంటరీ పర్యవేక్షణ, ప్రజలతో చర్చలకు అవకాశం అనే సూత్రాలపై ఈ రంగాన్ని నిర్మించింది. ఇప్పటి నాయకత్వం ఈ చారిత్రక దృక్పథాన్ని విస్మరించి, అణుశక్తిని ప్రయివేటు పెట్టుబడులకు అప్పగించజూస్తోంది. ఇది గతాన్ని తిరస్కరించడం మాత్రమే కాదు, భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా. ఈ ప్రయివేటీకరణ బిల్లు మూడు కీలక మార్పులను ముందుకు తెచ్చింది.

మొదటిది, అణు విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రయివేటు సంస్థలకు ప్రత్యక్ష ప్రవేశం. రెండోది, అణుప్రమాదాల బాధ్యతనుంచి ప్రయివేటు యాజమాన్యాలను తప్పించడం. మూడోది, ‘సంస్కరణల’ పేరిట భద్రతా నియమాలను సడలించడం… ఈ మూడు కలిపి చెప్పేది ఒక్కటే. అణుశక్తిని కార్పొరేట్‌ వ్యాపారంగా మార్చడం. లాభాలు ప్రయివేటు కంపెనీలకు, ప్రమాదాలు ప్రజలకు. సర్కారువారి రాయితీలూ చట్టపరమైన రక్షణలు ప్రయివేటు సంస్థలకు, ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు, పర్యా వరణ విధ్వంసాలు, విపత్తుల భారాలు ప్రజలకు. ఇదే ఈ బిల్లు సారాంశం. ఒక అణు ప్రమాదం జరిగితే ప్రయివేటు కంపెనీలు మూతవేసి వెళ్లిపోతాయి. కానీ, అవి పోతూ వదిలిన భయంకరమైన రేడియేషన్‌ ప్రభావం వెళ్లిపోదు. ఇక్కడి గాలిలో ధూళిలో, నేలలో నీటిలోనే కాదు.. మానవశరీరంలోని నరనరాల్లో నిలిచిపోతుంది. ఇందుకు మూల్యాన్ని చెల్లించేది ప్రజలే. అదే ప్రభుత్వరంగంలో ఉంటే, అణుశక్తి సంస్థలపై పార్లమెంటు పర్యవేక్షణ ఉంటుంది. ప్రజలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ప్రభుత్వాలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ప్రైవేటీకరణతో ఈ నియంత్రణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమవుతుంది.

‘వాణిజ్య గోప్యత’ అనే ముసుగులో ప్రజా భద్రతకు సంబంధించిన సమాచారం రహస్యంగా మారుతుంది. చివరికిది ప్రజాస్వామ్యాన్ని పెట్టుబడిదారుల ప్రయోజనాలకు లోబరిచే ప్రక్రియగా తయారవుతుంది. ప్రభుత్వం చెబుతున్నట్టు దేశానికి అణుశక్తి అవసరమే కావొచ్చు. కానీ అవసరాల పేరుతో అత్యంత ప్రమాదకరమైన ఈ రంగాన్ని ప్రయివేటీకరించడమే ఏకైక మార్గమా? సౌర, పవన, పునరుత్పాదక శక్తి రంగాల్లో అపార అవకాశాలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఈ ప్రమాదకర దారినే ఎంచుకుంది? ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టం. ఇది దేశ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన అణువిధానం కాదు, కార్పొరేట్ల ధనదాహానికి ప్రభుత్వమిచ్చే బహుమానం. రాజ్యం ప్రజల పట్ల బాధ్యతలను వదిలేసి, కార్పొరేట్ల సేవలో తరించే ఏజెంట్‌గా మారుతున్న సంకేతం. కార్పొరేట్లకు మోడీ సర్కారు చేస్తున్న ఊడిగానికి ఈ బిల్లు ఒక క్లాసిక్‌ ఉదాహరణ. ఇది ప్రజాస్వామ్యానికి, జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు. నిజంగా అణుశక్తి ప్రజల కోసమే అయితే నియంత్రణ ప్రజల చేతుల్లో ఉండాలి. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించిన ఏ విధానమైనా ప్రజా వ్యతిరేకమే. ఈ బిల్లు అలాంటి ప్రజా వ్యతిరేక విధానమే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -