Saturday, December 20, 2025
E-PAPER
Homeఆటలుసరైనోళ్లను ఎంపిక చేస్తారా?

సరైనోళ్లను ఎంపిక చేస్తారా?

- Advertisement -

2026 టీ20 ప్రపంచకప్‌ భారత జట్టు ఎంపిక
సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ సమావేశం నేడు

ఐసీసీ 2026 మెన్స్‌ టీ20 ప్రపంచకప్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియా టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సొంతగడ్డపైనే జరుగుతున్న మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది.
సొంతగడ్డపై జురుగుతున్న పొట్టి ప్రపంచకప్‌కు భారత జట్టును నేడు ఎంపిక చేయనున్నారు. ప్రపంచకప్‌తో పాటు జనవరిలో జరిగే న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించనున్నారు.
ప్రపంచకప్‌ జట్టులో పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలు ఉండే అవకాశాలు స్వల్పం. అయినా, ఇటీవల సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20లో దుమ్మురేపిన ఇషాన్‌ కిషన్‌ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఆశిస్తున్నాడు. ఫామ్‌లో లేని శుభ్‌మన్‌ గిల్‌ సహా రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లలో ఎవరు ఫైనల్‌ 15 జట్టులో నిలుస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది.

నవతెలంగాణ క్రీడావిభాగం
శుభ్‌మన్‌ గిల్‌పై ఫోకస్‌
టెస్టు కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ పొట్టి ఫార్మాట్‌లో నేరుగా వైస్‌ కెప్టెన్‌ హౌదాలో రీ ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికే ఓపెనర్‌గా మూడు శతకాలు బాది జోరుమీదున్న సంజు శాంసన్‌ బెంచ్‌కు పరిమితం అయ్యాడు. శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనర్‌గా అవకాశాలు దక్కించుకున్నా ఫామ్‌ చాటుకోలేదు. గత 18 ఇన్నింగ్స్‌ల్లో శుభ్‌మన్‌ గిల్‌ అర్థ సెంచరీ సాధించలేదు. గణాంకాలను పక్కనపెడితే.. జట్టులో గిల్‌ ప్రభావం ప్రతికూలమే. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై 28 బంతుల్లో 47 పరుగుల ఇన్నింగ్స్‌ మినహా ఈ సమయంలో చెప్పుకోదగిన ప్రదర్శన గిల్‌ నుంచి రాలేదు. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ వరుసగా 4, 0, 28 పరుగులే చేశాడు. లక్నో మ్యాచ్‌ రద్దు కాగా, అహ్మదాబాద్‌లో గిల్‌ ఆడలేదు. దీంతో శుభ్‌మన్‌ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. యశస్వి జైస్వాల్‌, సంజు శాంసన్‌ వంటి ధనాధన్‌ హిట్టర్లు అందుబాటులో ఉండగా ఫామ్‌లో లేని గిల్‌ జట్టులో ఎందుకనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఉందా?
విధ్వంసక ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ భారత జట్టు ప్రణాళికల్లో లేకుండా పోయినా.. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌లో సత్తా చాటాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జార?ండ్‌ను చారిత్రక టైటిల్‌ విజయం దిశగా నడిపించిన కిషన్‌.. టైటిల్‌ పోరులో సెంచరీ సహా 517 పరుగులు చేశాడు. టోర్నమెంట్‌లో అత్యధికంగా 33 సిక్సర్లు కొట్టాడు. స్ట్రయిక్‌రేట్‌ 197.32. ఇషాన్‌ కిషన్‌ సూపర్‌గా రాణించినా.. అతడు టాప్‌ ఆర్డర్‌లో పరుగులు రాబట్టాడు. ప్రస్తుతం శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మలు భారత జట్టు ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌లు టాప్‌-4లో నిలిచారు. వికెట్‌ కీపర్‌గా జట్టులో నిలిచేందుకు సైతం ఇప్పటికే జితేశ్‌ శర్మ, సంజు శాంసన్‌లు రేసులో ఉన్నారు. ప్రతిష్టాత్మక దేశవాళీ టీ20 టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి జాతీయ జట్టులో చోటు దక్కకుంటే.. దేశవాళీ క్రికెట్‌కు విలువ లేకుండా పోతుందనే వాదన సైతం వినిపిస్తోంది.

ఆ ఇద్దరిలో ఎవరో?
ఆసియా కప్‌ జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌ను పక్కనపెట్టి రింకు సింగ్‌ను ఎంపిక చేశారు. ఆసియా కప్‌ ఫైనల్లో విన్నింగ్‌ బౌండరీ బాది రింకు సింగ్‌ తనకొచ్చిన ఏకైక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఫినిషర్‌గా నిరూపించుకున్న రింకు సింగ్‌.. గత ప్రపంచకప్‌ జట్టుకు సైతం ఎంపిక కాలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనలో హార్దిక్‌ పాండ్యకు కండరాల గాయం కావటంతో అక్కడ తుది జట్టులో వాషింగ్టన్‌ సుందర్‌, రింకు సింగ్‌లను ఒకేసారి ఆడేంచే వెసులుబాటు ఏర్పడింది. ఇద్దరు ఆడిన వేళ వాషింగ్టన్‌ సుందర్‌ గొప్పగా రాణించాడు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌ వాషింగ్టన్‌ సుందర్‌ వైపు మొగ్గుతుంది.

జులై 2024లో చీఫ్‌ కోచ్‌గా పగ్గాలు చేపట్టిన నుంచి గౌతం గంభీర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో స్పెషలిస్ట్‌ బ్యాటర్ల కంటే ఆల్‌రౌండర్లను ఆడించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ఉపఖండంలో జరిగే ప్రపంచకప్‌లో స్పిన్‌ ఆల్‌రౌండర్లు మ్యాచ్‌ ఫలితాలను శాసించగలరు. దీంతో వాషింగ్టన్‌ సుందర్‌, శివమ్‌ దూబెలకు సహజంగానే చీఫ్‌ కోచ్‌ మద్దతు ఉండనుంది. ఎటువంటి పొరపాటు చేయకుండానే రింకు సింగ్‌ వరుసగా రెండో వరల్డ్‌కప్‌కు దూరం కావటం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో ఆడుతున్న భారత జట్టులో పెద్దగా మార్పులు లేకుండానే.. వరల్డ్‌కప్‌ టీమ్‌ను ఎంపిక చేసే సూచనలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -