Saturday, December 20, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పుస్తకాలు ఆలోచనలను మార్చేస్తాయి

పుస్తకాలు ఆలోచనలను మార్చేస్తాయి

- Advertisement -

అవి అందరికీ అందుబాటులోకి రావాలి
అన్ని జిల్లాల్లో పుస్తక ప్రదర్శనలకు రూ.3 కోట్లు
గ్రంథాలయాల్లో పుస్తకాల కోసం రూ. కోటి మంజూరు
బుక్‌ ఫెయిర్‌కు శాశ్వత స్థలం, కార్యాలయ ఏర్పాటుపై సీఎం దృష్టికి : 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మనిషి ఆలోచనలను పుస్తకాలు పూర్తిగా మార్చేస్తాయనీ, అలాంటి పుస్తకాలు అందరికీ అందుబాటులోకి రావాలని రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆయన 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ను ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు డాక్టర్‌ యాకూబ్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన తెలంగాణ సాహిత్య అకాడమీకి చెందిన త్రైమాసిక పత్రిక పునాసను, వచ్చే ఏడాది క్యాలెండర్‌ను, ప్రభాత భేరి కరపత్రాన్ని, యువతరం పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహించేలా ప్రతి జిల్లాకు రూ.10 లక్షల చొప్పున రూ.3 కోట్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు.

అదేవిధంగా గ్రంథాలయాల కోసం రూ.కోటి విలువైన పుస్తకాలను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించారు. బుక్‌ ఫెయిర్‌ కార్యాలయం, బుక్‌ ఫెయిర్‌ నిర్వహణ కోసం శాశ్వత స్థలం కేటాయింపునకు సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు హామీ ఇచ్చారు. సామాజిక రుగ్మతలను పారదోలి, మంచి స్ఫూర్తినిచ్చే పుస్తకాలను ఎంపిక చేయాలని నిర్వాహకులకు సూచించారు. గతంలో పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉండటంతో నాటి తరంలో విలువలు, మంచి గుణగణాలు, ఆలోచనా విధానం కనిపించేవని గుర్తుచేశారు. నేటి తరానికి కూడా గొప్ప వ్యక్తుల పుస్తకాలు చదివే అలవాటు చేయాలని కోరారు. మనిషి తనను తాను సంస్కరించుకోవడంతో పాటు సమాజాన్ని సంస్కరించడమే విద్య అనీ, నేడు విద్య అంటే మార్కులు, ర్యాంకులు అన్నట్టుగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు వారి జనాభా 8 కోట్ల మందికి పైగా ఉంటే పత్రికల సర్క్యులేషన్స్‌ అన్ని కలిపి కూడా ఇప్పటికీ 30 నుంచి 40 లక్షలు మించడం లేదని తెలిపారు. సాంస్కృతిక విభాగం ద్వారా గ్రామాల్లో స్కిట్స్‌ ప్రదర్శనతో రుగ్మతలను పారదోలేందుకు ప్రయత్నిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

ప్రతి గ్రామ పంచాయతీలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీతక్కను కోరనున్నట్టు జూపల్లి వెల్లడించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రాయడం, చదవడం నేర్పించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సలహాదారు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ పుస్తకాన్ని చదవడమంటే చరిత్రలోకి ప్రయాణించడమేనని తెలిపారు. మనం కలవలేని మహనీయులతో సంభాషించే అద్భుత అవకాశాన్ని పుస్తకం ఇస్తుందని చెప్పారు. పశువుల కాపరిగా ఉన్న అందెశ్రీ పుస్తక పఠనంతోనే గొప్ప సాహితీవేత్తగా ఎదిగారని గుర్తుచేశారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ చాలా బాగుందనీ, అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని కొనియాడారు. నగరవాసులు కుటుంబ సమేతంగా సందర్శించి, బుక్‌ ఫెయిర్‌ను విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సలహాదారు, సీనియర్‌ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి పుస్తక పఠనం ఉపయోగ పడుతుందని తెలిపారు.

ప్రభుత్వంలోని పెద్దలు ఇలాంటి ప్రదర్శలను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ చైర్మెన్‌ డాక్టర్‌ రియాజ్‌ మాట్లాడుతూ కోల్‌కతా తర్వాత అతి పెద్ద బుక్‌ ఫెయిర్‌ హైదరాబాద్‌లోనే జరుగుతోందని తెలిపారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ కాలానుగుణంగా పుస్తకం రూపం మారినా దానిలో సారం మారదని అన్నారు. ఫెయిర్‌ అధ్యక్షులు డాక్టర్‌ యాకూబ్‌ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శన కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు బాలోత్సవ్‌, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కళా ప్రదర్శనలు, అనంతరం నాకు నచ్చిన పుస్తకం, నాకు స్ఫూర్తినిచ్చిన పుస్తకం పేరుతో ప్రముఖుల ప్రసంగాలుంటాయని తెలిపారు.

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌.వాసు మాట్లాడుతూ బుక్‌ఫెయిర్‌లో 13 రాష్ట్రాల నుంచి 368 స్టాల్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. మరో 10 రాష్ట్రాల నుంచి స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపించినప్పటికీ అప్పటికే గడువు ముగిసిందని వెల్లడించారు. పుస్తక ప్రదర్శనలో అన్ని భాషల ప్రాతినిథ్యం ఉందని స్పష్టం చేశారు. 37వ బుక్‌ ఫెయిర్‌ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి ఫెయిర్‌ కార్యాలయం, నిర్వహణకు శాశ్వతంగా స్థలం కేటాయిస్తామని ఇచ్చిన హామీ అమలయ్యేలా చొరవ తీసుకోవాలని మంత్రి జూపల్లికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ బారాచారి, హైదరాబాద్‌ బుక్‌ సొసైటీ ప్రధాన ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, బి. శోభన్‌ బాబు, కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌, సంయుక్త కార్యదర్శులు కె. సూరిబాబు, పి. నారాయణ రెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -