Tuesday, May 20, 2025
Homeక్రైమ్విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

- Advertisement -

– మోటారు సైకిల్‌ సహా సజీవదహనం
నవతెలంగాణ-సత్తుపల్లి

తెగిపడిన 11కేవీ విద్యుత్‌ తీగలను గమనించని ఓ రైతు అటుగా మోటారు సైకిల్‌పై పొలానికి వెళ్తున్న క్రమంలో విద్యుద్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన ఖమ్మం సత్తుపల్లి మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో మోటారు సైకిల్‌తోపాటు రైతు పూర్తిగా దగ్ధమయ్యాడు. రైతు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన పైడిమర్ల పెద్ద మురళీధరరెడ్డి(59) రోజువారీ పనిలో భాగంగా ఉదయం ఖాతాదారులకు పాలుపోసి ఇంటికొచ్చిన అతను బైక్‌పై పొలానికి బయలుదేరాడు. ఆదివారం సాయంత్రం వీచిన గాలి దుమారానికి గౌరిగూడెం సబ్‌స్టేషన్‌ నుంచి కొత్తూరు గ్రామానికి ఏర్పాటు చేసిన 11కేవీ విద్యుత్‌ తీగలు పడిపోయాయి. అది గమనించని మురళీధరరెడ్డి బైక్‌ను తీగలపై నుంచి పోనివ్వడంతో బండి చక్రాలకు తగిలాయి. వెంటనే అతను విద్యుద్ఘాతానికి గురై మోటారు సైకిల్‌తోపాటు పూర్తిగా కాలిపోయాడు. కొంత సేపటి తరువాత అటుగా వచ్చిన మరో రైతు గమనించి పరిగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి మృతిచెందిన వ్యక్తి పెద్ద మురళీధరరెడ్డిగా గుర్తించారు. వెంటనే సత్తుపల్లి విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఆ లైనుకు విద్యుత్‌ సరఫరా బంద్‌ చేశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైతులకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సత్తుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పుడూ వెళ్లే దారి మీదుగా కాకుండా కొంత దూరం తగ్గుతుందనే ఉద్దేశంతో వారం రోజుల నుంచి ఈ మార్గం మీదుగా వెళ్లి ప్రాణం పోగొట్టుకున్నాడని గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -