Sunday, December 21, 2025
E-PAPER
Homeసోపతిలెక్కలే వారి జీవితం

లెక్కలే వారి జీవితం

- Advertisement -

గణితంలో ఆర్యభట్ట, భాస్కరాచార్యుల తర్వాత అంతటి మేధావి శ్రీనివాసరామానుజన్‌. ఆయన జీవించింది కేవలం 32 ఏండ్లే. వందేండ్లు గడిచినా నేటికీ మరువలేని గొప్ప మేధావి ఆయన. ఆస్ట్రో ఫిజిక్స్‌, బ్లాక్‌ హోల్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)కు ఉపయోగపడే గణిత సమీకరణాలు నాడు ఆయన రాసుకున్న పుస్తకంలో ఉన్నాయట. క్యాన్సర్‌ చికిత్స, ఉపగ్రహాలపై పనిచేసే గ్రావిటేషనల్‌ ఎఫెక్టు వంటి వాటి గురించి తెలుసుకునేందుకు వందేళ్ల క్రితం ఈయన కనిపెట్టిన సమీకరణాలే ఉపయోగపడుతున్నాయట. నేటి భావితరం ప్రాథమిక, కళాశాల విద్యార్థులు ఈ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జీవిత పాఠాలను తెలుసుకుని అనుసరిస్తే.. మరింత మంది రామాను’జమ్స్‌’ తయారు అవుతారంటే అతిశయోక్తి కాదు. నేటి తరం పిల్లలు, యువకుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ.. తమది పేద కుటుంబమని, ఏమీ సాధించలేమని కుమిలిపోవద్దు. తమలో ఉన్న మేథాశక్తికి నిత్యం పదును పెడుతుండాలి.



శాస్త్రవేత్త రామానుజన్‌ ఇలా ఎదిగిన వారే. తనకు లెక్కలంటే ఇష్టం. మూడో తరగతిలోనే తను అడిగిన ప్రశ్న గణితం మాస్టారును ఆశ్చర్యపరిచిందట. సున్నను సున్నతో భాగిస్తే ఎంత వస్తుందనే ఆ ప్రశ్నతోనే మేథాశక్తిని చాటిన రామానుజన్‌ ఆసక్తికి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించారు. తండ్రి శ్రీనివాస అయ్యంగార్‌ దుకాణంలో గుమాస్తాగా చిరు సంపాదనతో నెట్టుకొస్తూనే చదివించారు. అలా గణితంపై మక్కవతో కంటే ప్రేమతో తమ జీవితాలను గణితానికి అంకితం చేసిన వారు ఉన్నారు. మానవ కంప్యూటర్‌ గా పేరు గాంచిన శకుంతలా దేవి, మీనాక్షిసుందరం, డా. లక్కోజు సంజీవరాయశర్మ, నరేంద్ర కమలాకర్‌ వంటి ఎందరో గణిత మేధావులున్నారు. నేడు మన ముందు మన హైదరాబాదీ మానవ కంప్యూటర్‌గా వేగవంతమైన లెక్కలు చేయడంలో ప్రపంచ రికార్డు సష్టింస్తున్న నీలకంఠ భాను ప్రకాష్‌ మనకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అతనికి లెక్కలంటే లెక్కే లేదు..! అంకెలు.. సంఖ్యలే అతడి మెదడులో ఎప్పుడూ మెదులుతుంటాయి. గణితంతో అం దరూ కుస్తీ పడుతుంటే.. అతడు మాత్రం ఏ సమస్యనైనా క్షణాల్లో కంప్యూటర్‌ కన్నా వేగంగా పరిష్కరిస్తాడు.. అతడే హైదరాబాద్‌కు చెందిన నీలకంఠ భాను ప్రకాశ్‌. గణితంలో అత్యంత వేగంగా గణన ప్రక్రియ పూర్తిచేసిన మానవ కంప్యూటర్‌గా పేరొందాడు. నగరంలోని మోతీనగర్‌లో నివాసముంటున్న భానుప్రకాశ్‌ వయసు 26 ఏండ్ల. ఈ ప్రాయంలోనే అతను విశ్వవిఖ్యాత హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడం విశేషం.

ఐదేళ్ల ప్రాయం నుంచే అనితరసాధ్యమైన సాధనతో గణితంలో అంతుచిక్కని సమస్యలకు పరిష్కారాలను కనిపెడుతున్న భాను ప్రకాశ్‌ ఎనిమిదేళ్లకే ఆంధ్రప్రదేశ్‌ అరిథ్మటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని మూడోస్థానం అందుకున్నాడు. మానసిక ఎదుగుదలలేని పిల్లాడిగా అవుతాననుకున్న అతడు… ఆ ప్రైజు అందుకోవడం చూసి అతడి తల్లికి మరింత గురి కుదిరింది. పద్నాలుగేళ్లు వచ్చేటప్పటికల్లా అంతర్జాతీయ మ్యాథ్స్‌ ఒలింపియాడ్స్‌లో భారత్‌ తరపున పాల్గొన్నాడు. లండన్‌లో నిర్వహించిన మైండ్‌ స్పోర్ట్‌ ఒలింపియాడ్‌లో గణితంలో అసాధారణ తెలివితేటలు చూపి గోల్డ్‌ మెడల్‌ సాధించి అత్యంత ఫాస్టెస్ట్‌ హ్యూమన్‌ కేలిక్యులేటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ పోటీలో సుమారు 13 దేశాలకు చెందిన 30 మంది మేధావులు పాల్గొన్నారు. నాలుగు ప్రపంచ రికార్డులు సాధించాడు.. 50 సార్లు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం అందుకున్నాడు. శకుంతలాదేవి రికార్డూ ఛేదించేశాడు. గణిత పోటీల్లో ప్రతిష్ఠాత్మకమైన ‘మెంటల్‌ కాలిక్యులేషన్స్‌ – ఛాంపియన్‌షిప్‌’లో బంగారు పతకం అందుకున్నాడు. ‘అత్యంత చురుకైన మానవ కాలిక్యులేటర్‌’గా గుర్తింపు సాధించాడు.



భానుప్రకాశ్‌ 2018లో ‘ఎక్స్‌ప్లోరింగ్‌ ఇనిషియేటివ్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థని ఏర్పాటుచేశాడు. ప్రభుత్వ బడులకెళ్లి అక్కడి పిల్లల్లో గణితంపట్ల భయాన్ని పోగొట్టే కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాడు. ఒక్క కొవిడ్‌ సమయంలో సుమారు పది లక్షలమంది పిల్లలకి అవి ఉపయోగపడ్డాయి. కానీ- ‘ఓ దశలో సంస్థని నడపడం కష్టమైంది. కనీస ఫీజులు తీసుకోకుండా నా సేవల్ని ముందుకు తీసుకెళ్లలేమనిపించింది. దాంతో నా సంస్థని స్టార్టప్‌గా మార్చి.. భాంజూ అని పేరుపెట్టాను.- అని ఒక ఇంటర్వ్యూలో నీలకంఠ భాను ప్రకాష్‌ తెలిపాడు.

అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -