‘ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు’ అనేది ఒక సామెత. ఇది అక్షరాలా వాస్తవమేనని నిరూపించారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్. ఇంతకాలంగా బీజేపీ, సంఘ పరివార్‌తో చేతులు కలిపి, స్నేహం చేసి పదవులను భవిస్తున్నందుకు జేడీయూ నేత, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నితీష్‌కూ వారి భావజాలము తలకెక్కి ఉంటుందనే అనిపిస్తున్నది.స్త్రీల పట్ల, ముస్లింల పట్ల వ్యవహరించే తీరు చూస్తే బీజేపీ అడుగుల్లో అడుగేస్తున్నాడని అనిపిస్తున్నది. మొన్నీ మధ్య బీహార్ రాజధాని పాట్నాలో ఆయుష్ డాక్టర్లుగా ఎంపికయిన వేయిమందికి, నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని ఒకటి నిర్వహించారు. ఆ పత్రాలను ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ ఒక్కొక్కరికి అందించే క్రమంలో, ఎంపికయిన ఓ ముస్లిం డాక్టరు నుస్రత్ పర్వీన్ నియామక పత్రాన్ని తీసుకునేందుకు వచ్చింది. ఆమె ముఖానికి హిజాబ్ ధరించింది. పత్రాన్ని ఇస్తూ సీఎం ఆమె హిజాబ్‌ను తీయమని అడగటమే కాక, వెంటనే స్వయంగా అందరిముందు అమ్మాయి హిజాబ్‌ను పట్టుకుని గుంజాడు. ఆమె బిత్తరపోయింది. వేదికపై ఉన్నవాళ్లు గొల్లున నవ్వారు. ముఖ్యమంత్రి తన చేతులతో హిజాబ్‌ను తొలగించాలని లాగడం, ఇపుడు దేశమంతా పెద్ద చర్చనీయాంశమైంది.
దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కూడా చర్చ, నిరసన వ్యక్తమవుతున్నది. ముస్లింలు హిజాబ్‌ను ధరిస్తరనేది అందరికీ తెలిసిన విషయమే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత విశ్వాసాన్ని ప్రకటించుకునే హక్కు ఉంది. దాన్ని నిరోధించడం అంటే రాజ్యాంగ హక్కును నిరాకరించడం అవుతుంది. ఇక రెండో విషయం, ఒక మహిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చర్యకు పూనుకోవడం, అదీ ముఖ్యమంత్రిగా ఉండి చేయడం నేరం అవుతుంది. అంతమంది ప్రజలముందు ఒక స్త్రీని ఇబ్బంది పెట్టడం వేధింపుల కిందికి రాదా! ఆమె ఏ బట్టలు వేసుకోవాలి, ఏది వేసుకోకూడదో నిర్దేశించడం సాంస్కృతిక పోలీసింగ్ అవుతుంది. ఆమె ఆత్మగౌరవానికి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం క్షమించరాని నేరం.ఎవరో ఒక వ్యక్తి మహిళను మనోవేదనకు గురిచేశాడంటే, అది వేరు.
సాక్షత్తూ ముఖ్యమంత్రి బహిరంగంగా మహిళను అవమానపరచడాన్ని అందరూ ఖండిస్తున్నారు.ఈ ఘటన వైరల్ అయి వివాదం కాగానే కేంద్రమంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ నితీష్ చర్యను సమర్థిస్తూ మాట్లాడటం మరింత అజ్యం పోస్తోంది. ”ఇదేమీ ఇస్లామిక్ దేశం కాదు. నియామక పత్రం ఇస్తున్నపుడు ముఖం చూస్తే తప్పేమిటి? తండ్రిలా ఆ పనిచేశాడు” అని సమర్థించాడు. ఇక యూపీ మంత్రి సంజయ్ నిషాద్ అయితే నవ్వుతూ దుర్మార్గమైన వ్యాఖ్యానాలు చేశాడు. అదే రాజస్థాన్, హర్యాణా స్త్రీలు వారు ధరించిన గూంగట్, ముసుగులను ముస్లిం వ్యక్తులు తొలగించి చూస్తే ఒప్పు కుంటారా? అని ఓమర్ అబ్దుల్లా వేసిన ప్రశ్న సరైనదిగానే అనిపిస్తుంది. ఈ సంఘటన జరుగుతున్న సందర్భంలోనే ఘనత వహించిన ప్రధానిగారు ఓమన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి ముస్లిం సంప్రదాయాల ప్రకారం చేసే మర్యాదల్ని స్వీకరిస్తూనే ఉన్నారు. ఇదీ వీరి ద్వంద్వ ప్రవర్తనలకు నిదర్శనం.
కొందరేమో నితీష్‌కుమార్ మానసికస్థితి సరిగా లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రాష్ట్రానికి పాలకుడిగా ఉన్నవాడి మానసికస్థితి బాగా లేకపోతే పాలనకే అనర్హుడు కదా! ఇది నితీష్ మానసిక స్థితే కాదు, నేటి కేంద్ర పాలకుల మానసికత అలాగే ఉంది. ప్రముఖ సినిమా నటి జైరా వాసిమ్ నితీష్ చర్యను తీవ్రంగా ఖండించారు. క్షమాపణ చెప్పాలని కోరారు. సినీనటి రాఖీసావంత్ అయితే ‘నేను మీ ధోవతిని అందరి ముందు లాగితే మీకు ఎలా అనిపిస్తుంది’ అంటూ నిలదీశారు. ”మహిళలు సంప్రదాయంగా పాటించే పరదాని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. కానీ ఒక ముస్లిం వైద్యురాలి పట్ల నితీష్ వ్యవహరించిన తీరును ఎంతమాత్రం సమర్థించను. ఈ దుశ్చర్యను కఠిన పదజాలంతో ఖండిస్తున్నాను” అని ప్రముఖ రచయిత జావెద్ ఆక్తర్ అన్నారు. ఇది కేవలం సుస్రత్ పర్వీన్, నితీష్‌కుమార్ సంఘటనకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు.
ఇది రెండు రకాల పీడనల మనస్తత్వానికి సంబంధించినది, ఒకటి ప్రధానమైనది, స్త్రీలను చులకనగా, వివక్షతతో చూసే మనస్తత్వం. రెండోది మతతత్వ దృక్పథంతో చూసేది. వీటి రెండింటినీ సమర్థించే ఆలోచనా ధార కలిగిన పాలకులే నేడు పరిపాలన చేస్తున్నారు. పురుష అహంకారం, మత దురహంకారం రెండూ మనదేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. బీజేపీతో అంటకాగుతున్న మిగతా ప్రాంతీయ పార్టీలు, నాయకులు కూడా ఇలాంటి చర్యలు ఖండించడానికి ముందుకు రాకపోవడం, రాజీపడటం నేటి విషాదం. అయితే ప్రతిపక్షాలంతా ముక్తకంఠంతో నితీష్ చర్యను ఖండించారు. హక్కుల సంఘాలూ వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యము, రాజ్యాంగం హక్కులను కాలరాస్తున్న నేటి పాలకుల చర్యలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొట్టాలి. లేకుంటే నాటి దుశ్శాసన పర్వం పునరావృతమవుతుంది. అందుకే ”చీర లాగినా, హిజాబ్ గుంజినా, అది వస్త్రాపహరణమే/నాడు దుశ్శాసనుడైతే/నేడు శాసనుడు” అని కవి షుకూర్ కవిత్వీకరించారు.
‘హి’ జాబ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



