రోషన్, అనస్వర రాజన్ జంటగా ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. స్వప్న సినిమాస్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ శనివారం మీడియాతో చిత్ర విశేషాలను షేర్ చేసుకున్నారు.
-ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్ మా చిత్రాన్ని ‘మగధీర’తో పోల్చడం, నా గురించి బాగా మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.
-ఇది 1948లో జరిగే కథ. యాక్షన్, డ్రామా, వార్ అన్ని చాలా గ్రాండ్‌గా ఉంటాయి. చరిత్రలో బైరాన్‌పల్లి గురించి చాలా మందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి, ఈ కథని ప్రజెంట్ చేశారు. ఇందులో నేను పోషించిన పాత్ర ప్రాపర్ హైదరాబాది. ఆ యాసను స్పష్టంగా నేర్చుకున్నాను. ఈ సినిమాతో కొత్త రోషన్‌ని చూస్తారు. సినిమా రష్ చూశాం. మా దర్శకుడు ప్రదీప్ అద్భుతంగా తెరకెక్కించారు.
-ఇందులో చాలా మంచి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. ఊర్లో ఉండే ఎమోషన్స్‌ని చాలా అద్భుతంగా చూపించారు. ఆ ఎమోషన్ అందరికీ కనెక్ట్ అవుతుంది.
-ఈ సినిమాలో నాన్నతో పని చేసిన చాలా మంది నటీనటులతో కలిసి నటించే అవకాశం దొరికింది. ఇందులో నా పాత్రే కాదు బైరాన్‌పల్లి గ్రామంలోని ప్రతి క్యారెక్టర్‌కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక ప్రారంభం, ముగింపు ఉంటుంది. అలాగే కళ్యాణ్ చక్రవర్తి చేసిన పాత్రని బైరాన్‌పల్లి గ్రామంలో ఒక నిజమైన పాత్ర స్ఫూర్తితో డైరెక్టర్ రాసుకున్నారు. ఆయనతో కలిసి నటించడం చాలా గొప్ప అనుభూతి.
-ఇందులో హీరో, హీరోయిన్ మధ్య డ్రామా అనే కాన్సెప్ట్‌తో చాలా మంచి ఫన్ ఉంటుంది. అనస్వర మలయాళంలో దాదాపు 25 సినిమాలు చేసింది. తన క్యారెక్టర్‌లో చాలా డెప్త్ ఉంటుంది. హీరో పర్పస్‌ని ఫుల్‌ఫిల్ చేసే పాత్ర తనది. ఇక ఈ సినిమాతో ఓ కొత్త మిక్కీ జే మేయర్‌ని చూస్తారు. యాక్షన్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమా కోసం పీటర్ అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీని డిజైన్ చేశారు.
-అశ్వినిదత్ ఎంతోమందిని లాంచ్ చేశారు. ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు. అలాంటి నిర్మాత నాకు ఇంత గ్రాండ్ స్కేల్‌లో ఈ సినిమా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఓ కొత్త సినిమా ప్రకటన ఉంటుంది.
నేను క్రికెటర్‌ని అవ్వాలనుకున్నాను. మా నాన్న (శ్రీకాంత్) కోరిక కూడా అదే. అయితే నాకు సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. నాన్నకి మంచి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. అయితే నేను ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉండాలని కోరుకుంటా. ఇప్పుడు ప్రేక్షకుల మనస్తత్వం మారిపోయింది. ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే అనుభూతి నిచ్చే కథలతో సినిమాలు చేయాలి. -హీరో రోషన్



