- Advertisement -
అది ఒక పాఠం
స్వతంత్రంగానూ ఉండదు
కఠినంగానూ ఉండదు
అట్లని ఆశాజనకంగానూ అస్సలు ఉండదు
చదివేవాన్ని బట్టి అర్థమయే సారాంశమది
ఎక్కడ మొదలయ్యావో అక్కడికి
వచ్చి తీరాల్సిందేనని
ఎలా ఆరంభమయ్యావో
అలానే లయించమని.
రింగ్ రోడ్లు దాని సారాంశాలే
భూమి రూపం జీవన చక్రం
ఎదుగుదలలు ఎగబాకడాలు
ఉత్తాన పతనాలు
కుటుంబాలు కుదుళ్ళు కుదుపులు
వంశాలు ప్రేమలు త్యాగాలు
అశాంతులు అసహనాలు
కీర్తులపకీర్తుల్ సున్నాలోని సున్నాలే
ఉన్నది లేదన్నవారికిదే భూమిక
లేనిది ఉందన్న వారికీ
శూన్యానంతర సంరంభమే
సున్నా ఒక నిగూఢ పాఠం
సున్నా ఒక విస్తత లోకం
సున్నా ఒక సంక్షిప్త శూన్యం
- ఏనుగు నరసింహారెడ్డి,
8978869183
- Advertisement -


