పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్ : హాకీ ఇండియా లీగ్ 2025-26లో పాల్గొంటున్న ‘హైదరాబాద్ తూఫాన్స్’ హాకీ జట్టు తెలంగాణ రాష్ట్రానికి పర్యాటక, సాంస్కృతిక రాయబారులుగా నిలవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మారియట్ హోటల్‌లో జరిగిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ పర్యాటక శాఖ ఈ జట్టుకు స్పాన్సర్‌గా ఉండటం గర్వకారణమన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, అవి పర్యాటక రంగాన్ని, స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనాలని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ‘తెలంగాణ క్రీడా విధానం 2025’ ద్వారా రాష్ట్రంలో క్రీడా విప్లవాన్ని తీసుకువస్తున్నామని, త్వరలో ఏర్పాటు కానున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై మన జెండా ఎగిరేలా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు.
యువత మాదకద్రవ్యాలు, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వంటి వ్యసనాల బారిన పడకుండా, క్రీడల వైపు మళ్లేలా క్రీడాకారులు స్పూర్తిని నింపాలని కోరారు. ‘చక్ దే ఇండియా’ సినిమాలోని ”టీమ్ బనానె కె లియె తాకత్ నహీ… నియత్ చాహియే” అనే డైలాగ్‌ను ఉటంకిస్తూ, సంకల్ప బలమే విజయాన్ని అందిస్తుందని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. హైదరాబాద్ తూఫాన్ హాకీ జట్టు రాణించి తూఫాన్ సృష్టించాలని అన్నారు. కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, తెలంగాణ హాకీ అసోసియేషన్ కార్యదర్శి భీమ్‌సింగ్, హైదరాబాద్ తూఫాన్స్ సీఈఓ సాయి ప్రకాష్, ఒలింపియన్ దేవేందర్ వాల్మీకి, అసిస్టెంట్ కోచ్ ఎమిలీ కాల్డెరాన్, హైదరాబాద్ తూఫాన్స్ కెప్టెన్ సుమిత్ వాల్మీకితో పాటు ఆటగాళ్లు అర్షదీప్ సింగ్, అమన్ దీప్ లక్రా, రాజిందర్ సింగ్ పాల్గొన్నారు.



