Monday, December 22, 2025
E-PAPER
Homeఆటలుకుర్రాళ్లు చతికిల

కుర్రాళ్లు చతికిల

- Advertisement -

191 పరుగుల తేడాతో ఓటమి
టైటిల్‌ సొంతం చేసుకున్న పాకిస్తాన్‌
అండర్‌-19 ఆసియా కప్‌ 2025


నవతెలంగాణ-దుబాయ్
యువ భారత్‌ తడబడింది. అజేయ జోరుతో అంతిమ పోరుకు చేరుకున్న భారత కుర్రాళ్లు టైటిల్‌ పోరులో నిరుత్సాహపరిచారు. ఆదివారం దుబాయ్ లోని ఐసీసీ అకాడమీలో జరిగిన అండర్‌-19 ఆసియా కప్‌ (వన్డే) ఫైనల్లో భారత్‌ 191 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాట్‌తో, ఆ తర్వాత బంతితో రాణించిన పాకిస్తాన్‌ కుర్రాళ్లు ఆసియా కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగులు చేసింది. ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌ (171, 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ సెంచరీతో చెలరేగాడు. అహ్మద్‌ హుస్సేన్‌ (56, 72 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ సెంచరీతో రాణించాడు. ఓ ఎండ్‌లో సమీర్‌ మిన్హాస్‌ కదం తొక్కటంతో ఏ దశలోనూ పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌ నెమ్మదించలేదు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్‌ (3/83) మూడు వికెట్లు పడగొట్టినా.. యూత్‌ వన్డేల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన భారత బౌలర్‌గా నిలిచాడు.

హెనిల్‌ పటేల్‌ (2/62), ఖిలాన్‌ పటేల్‌ (2/44) రెండేసి వికెట్లు పడగొట్టినా పాక్‌ బ్యాటర్లను కట్టడి చేయటంలో ఇతర బౌలర్లు విఫలం అయ్యారు. బౌండరీల రూపంలోనే ఏకంగా 122 పరుగులు పిండుకున్న సమీర్‌ మిన్హాస్‌.. పాకిస్తాన్‌కు భారీ స్కోరు అందించాడు. టైటిల్‌ వేటలో రికార్డు ఛేదనకు దిగిన యువ భారత్‌ దారుణంగా తడబడింది. వైభవ్‌ సూర్యవంశీ (26), ఆయుశ్‌ మాత్రె (2), ఆరోన్‌ జార్జ్‌ (16), విహాన్‌ మల్హోత్ర (7), వేదాంత్‌ త్రివేది (9), అభిజ్ఞాన్‌ (13), కనిష్క్‌ చౌహాన్‌ (9) తేలిపోయారు. 68 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన యువ భారత్‌ మళ్లీ కోలుకోలేదు. పాకిస్తాన్‌ బౌలర్లలో అలీ రెజా (4/42), మహ్మద్‌ సయ్యమ్‌ (2/38), అబ్దుల్‌ సుభాన్‌ (2/29), హుజిఫా అషాన్‌ (2/12) వికెట్ల వేటలో ఆకట్టుకున్నారు. శతకంతో మెరిసిన సమీర్‌ మిన్హాస్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. పాకిస్తాన్‌ అండర్‌-19 యూత్‌ వన్డే ఆసియా కప్‌ చాంపియన్‌గా నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -